Monday, December 23, 2024

అభిమానులకు అసలైన మజా..

- Advertisement -
- Advertisement -

కనువిందు చేసిన హైదరాబాద్-ముంబై పోరు

మన తెలంగాణ/ హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపిఎల్ పోరు అభిమానులను కనువిందు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన జట్టుగా హైదరాబాద్ నిలిచింది. ముంబై బౌలర్లను హడలెత్తించిన హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఐపిఎల్ చరిత్రలో మరే జట్టు కూడా ఇంత పెద్ద స్కోరును సాధించలేదు.

హైదరబాద్ బ్యాటర్లు ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఇటు హెడ్ అటు అభిషేక్ వర్మల విధ్వంసక బ్యాటింగ్‌తో ఉప్పల్ స్టేడియం హోరెత్తిపోయింది. చిరకాల గుర్తుండి పోయే ఇన్నింగ్స్ ఆడిన హెడ్ 24 బంతుల్లోనే 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అభిషేక్ శర్మ మరింత దూకుడుగా ఆడాడు. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి ఐపిఎల్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సన్‌రైజర్స్ బ్యాటర్‌గా నిలిచాడు. ఇంతకుముందు ఇదే మ్యాచ్‌లో ట్రావిస్ హెడ్ సాధించిన 18 బంతుల్లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు.

ముంబై బౌలర్లను హడలెత్తించిన అభిషేక్ 23 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో మూడు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. హెడ్, అభిషేక్‌లు తమ విధ్వంసక బ్యాటింగ్‌తో అభిమానులను ఉర్రూతలూగించారు. వీరి బ్యాటింగ్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచి పోవడం ఖాయం. వీరు ఔటైనా తర్వాత వచ్చిన మార్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్‌లు దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను కనువిందు చేశారు. తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగిన క్లాసెన్ వరుస ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల మోత మోయించాడు. అసాధారణ ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్ 34 బంతుల్లోనే ఏడు సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు సాధించాడు.

ధాటిగా ఆడిప మార్‌క్రమ్ కూడా అజేయంగా 42 పరుగులు చేశాడు. ఇలా టాపార్డర్ బ్యాటర్లు చెలరేగడంతో హైదరాబాద్ ఐపిఎల్‌లోనే అత్యంత భారీ స్కోరును నమోదు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ముంబై కూడా వేగం గా ఆడింది. ఆ జట్టు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇ షాన్ కిషన్‌లు విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబైకు కళ్లు చెదిరే శుభారంభం అందించారు. తిలక్ వర్మ, నమన్ ధిర్, టిమ్ డేవిడ్ తదితరులు కూడా విధ్వంసక బ్యాటింగ్ కనబరిచారు.

దీంతో ఒక దశలో ముంబై ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందా అనిపించింది. అద్భుత పోరాట పటిమను కనబరిచిన ముంబై ఇండియన్స్ కూడా 246 పరుగుల భారీ స్కోరును సాధించి స్వల్ప తేడాతో ఓటమి పాలైం ది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిపి ఏకంగా 523 పరుగులు సాధించడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. హైదరాబాద్ టీమ్ ఐపిఎల్‌లోనే అత్యంత భారీ స్కోరును సా ధించిన జట్టుగా నిలిచింది. దీంతో పాటు ఈ మ్యాచ్‌లోనే అత్యధిక సిక్సర్లు నమోదయ్యాయి. ఇరు జట్ల బ్యాటర్లు కలిపి మ్యాచ్‌లో రికార్డు స్థాయిలో 38 సిక్సర్లను బాదేశారు. ఐపిఎల్ చరిత్రలో మరే మ్యాచ్‌లో కూడా ఇన్ని సిక్సర్లు నమో దు కాలేదు. ఇక ఉప్పల్‌లో జరిగిన ఈ మ్యాచ్ అభిమానులకు చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News