Friday, November 22, 2024

మిఛెల్.. జిగేల్

- Advertisement -
- Advertisement -

దుబాయి: ఐపిఎల్ మినీ వేలం పాట క్రికెటర్లపై కనక వర్షం కురిపించింది. దుబాయి వేదికగా మంగళవారం జరిగిన వేలం పాటలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిఛెల్ స్టార్ ఐపిఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా నయా చరిత్ర లిఖించాడు. తాజా వేలం పాటలో స్టార్క్ ఏకంగా రూ.24.75 కోట్ల ధరను పలికాడు. ఐపిఎల్‌లో ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు కూడా ఇంత పెద్ద మొత్తంలో ధర లభించలేదు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ భారీ మొత్తాన్ని వెచ్చంచి స్టార్క్‌ను సొంతం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాడు. అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రూ.20.5 కోట్లకు కొనుగోలు చేసింది. న్యూజిలాండ్ విధ్వంసక ఆటగాడు డారిల్ మిఛెల్ కూడా కళ్లు చెదిరే ధరను పలికాడు. అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్ ఏకంగా రూ.14 కోట్లను వెచ్చించింది. మరోవైపు భారత యువ ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా మినీ వేలం పాటలో జాక్‌పాట్ కొట్టాడు. అతని కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. ఇక వెస్టిండీస్ యువ ఆల్‌రౌండర్ అల్జారీ జోసెఫ్ కూడా వేలం పాటలో కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయాడు. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.11.50 కోట్లకు దక్కించుకుంది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్పెన్సర్ జాన్సన్ కూడా వేలం పాటలో కళ్లు చెదిరే ధరను పలికాడు. అతన్ని గుజరాత్ టైటాన్స్ రూ. 10 కోట్లను వెచ్చించడం గమనార్హం.
సమీర్ రిజ్వీ సంచలనం..
ఇదిలావుంటే భారత్‌కు చెందిన అన్‌క్యాప్డ్ ఆటగాడు సమీర్ రిజ్జీ వేలం పాటలో పెను ప్రకంపనలు సృష్టించాడు. ఇప్పటి వరకు ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడని ఉత్తర్‌ప్రదేశ్ యువ సంచనలం సమీర్ మినీ వేలం పాటలో ఏకంగా రూ.8.4 కోట్లకు అమ్ముడు పోయాడు. అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తాన్ని వెచ్చించింది. దేశవాళీ క్రికెట్‌లో సమీర్ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. దీంతో అతన్ని సొంతం చేసుకునేందుకు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. దీంతో రూ.20 లక్షల కనీస ధరతో వేలం పాట బరిలోకి దిగిన రిజ్వీ ఏకంగా రూ.8.4 కోట్లకు అమ్ముడు పోవడం విశేషం.మరో అన్‌క్యాప్డ్ ఆటగాడు కుమార్ కుషాగ్రా కూడా మినీ వేలం పాటలో భారీ ధరను పలికాడు. అతన్ని రూ.7.20 కోట్లను వెచ్చించి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. దేశవాళీ క్రికెట్‌లో కుషాగ్రాకు ఉన్న రికార్డులను దృష్టిలో పెట్టుకుని ఫ్రాంచైజీలు అతన్ని సొంతం చేసుకునేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి ఢిల్లీ భారీ మొత్తం ధరకు సొంతం చేసుకుంది. మరో విధ్వంసక ఆటగాడు షారుఖ్ ఖాన్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాడు. రూ.60 లక్షల బేస్ ప్రైస్‌తో బరిలోకి దిగిన షారుఖ్ ఏకంగా రూ.7.4 కోట్ల ధరను పలికాడు. అతన్ని గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. దీంతో పాటు శివమ్ మావి, శుభమ్ దూబే, ఉమేశ్ యాదవ్ తదితరులు కూడా భారీ ధరకు అమ్ముడు పోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News