Saturday, December 21, 2024

మైక్రో స్కూళ్లు వస్తున్నాయి

- Advertisement -
- Advertisement -

‘Micro-schooling is a learner-focussed educational model that focuses on providing personalized and tailored learning experie nces for small groups of students. The customised approach allows for more targeted instruction and a more flexible curriculum, ensuring that students can progress at their own pace and explore topics of particular interest to them. In addition, micro-schools present a new and exciting educational perspective, focusing on personalized learning experiences and the principles of Self Awareness, Self-mastery and Self-regulation’ Lina Ashar, Founder Dreamtime Learning Hub.

మార్పులు ఒక దాన్ని మించి ఒకటి రాజ్యమేలుతున్న ఇరవైఒకటో శతాబ్దంలో మనం జీవిస్తున్నాం.ఇది సహస్రాబ్ది ఆరంభ సమయం కూడా. ఇప్పుడు విద్య పరిశ్రమగా ఆవిర్భవిస్తున్న అపూర్వమైన సందర్భానికీ మనం సాక్షులం. బోధన పద్ధతులు త్వరితగతిన రూపాంతరం చెందడమూ మనం గమనిస్తున్నాం. మార్పు కాల స్వభావం, మార్పుకున్న శక్తి అమోఘమైంది. ప్రముఖ సంగీత ఆల్బం Uriah Heep స్వరకర్తలు సుప్రసిద్ధ లిరిక్ Age of changesలో తలపోసినట్టు ‘మార్పుల గిలిగింతల్లో మహా అయితే నవ్వుతూ కూర్చుంటాం, మలుపు వద్ద గంపెడంత ఆకలితో మార్పులకు వీడ్కోలు చెబుతాం’ అంతే కాని, మార్పులతో సమ ఉజ్జీగా ప్రయాణించడం మనం అరుదుగా చేస్తుంటాం. మార్పులను ముఖ్యంగా మనకు అన్వయించుకుంటే, విద్యావిధానంలో మనం అధునాతన మార్పులు చాలా చేసుకోవాల్సిందే. స్వాతంత్య్రానంతరం నూతన విద్యా విధానాలు అమలు చేసుకున్నప్పటికినీ మూసను అధిగమించలేకపోయామనే చెప్పాలి. 2020 నూతన విద్యా విధానం కూడా సరికొత్త విధానాలను సంకల్పించింది. ఫలితాలెట్లా ఉంటాయో చూడాలి. అయితే, ఇప్పటి దాకా కొనసాగుతున్న సంప్రదాయ పాఠశాలలను పక్కకు నెడుతూ ఇప్పుడు కొత్త ఒరవడిలో మైక్రో స్కూళ్లు వస్తున్నాయి.

ఐరోపా, అమెరికా, ఆస్ట్రేలియాల్లో తప్ప మనకు మైక్రో స్కూళ్లు అంతగా పరిచయంలేని వ్యవస్థ. ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మైక్రోస్కూలింగ్ అత్యంత జనాదరణ పొందుతుంది. పరిమిత సంఖ్యలో పది పదిహేను మంది పిల్లలుండే తరగతిలో’ Flipped Class room, Blended Learning, Constructivis m’ పద్ధతిన విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులు శ్రద్ధ అనుభవాలకు అనుగుణంగా రూపొందించిన ఉల్లాసవంతమైన శిక్షణ ఇక్కడ ఉంటుం ది. పనిగంటలు, పని దినాలు, పని వేళలు వివైధ్యంగానూ ఉంటాయి. భిన్న వయస్కులు కూడా ఒకే తరగతిలో ఉండవచ్చు. ఇటీవలి కాలంలో ఒక ట్రెండ్‌గా మారిన మైక్రో స్కూళ్లు ప్రప్రథమంగా చిన్న స్వతంత్ర పాఠశాలలు (స్మాల్ ఇండిపెండెంట్)గా బ్రిటన్ లో ప్రారంభమైనాయి.

ఫుల్ టైం ట్యూటర్ల నేతృత్వంలో ప్రత్యేక సౌకర్యాలతో, కలసి వచ్చే తల్లిదండ్రుల (లైక్ మైండెడ్ పేరెంట్స్) సమూహాలు సమకూర్చే నిధులతో ప్రైవేటుగా మైక్రో స్కూళ్లు నడుస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలకు కల్పించే హోం స్కూలింగ్‌లా కాకుండా చిన్నస్థాయి అభ్యాస వాతావరణంలో ప్రత్యేకంగా నడుస్తాయి. K-12 విద్యార్థులకు సేవలందించే మైక్రో స్కూళ్లను ‘పర్సనలైజ్డ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్’ కేంద్రాలుగా విద్యావేత్తలు పోలుస్తున్నారు. కేవలం కంటెంట్ పంపిణీదారులుగా కాకుండా విద్యార్థుల నేతృత్వంలో జరిగే క్రియాశీలక అభ్యాసాలకు ఫెసిలిటేటర్లుగా ఉపాధ్యాయులు పని చేస్తారు. మైక్రో స్కూల్ గురించి క్లేటన్ క్రిస్టెన్‌సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిస్ప్ట్రివ్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ హార్న్ చేసిన ఆసక్తికరమైన ఈవ్యాఖ్య Think one-room schoolhouse meets blended learning and home schooling meets private schooling. మైక్రో స్కూలింగ్ సముచిత రీతికి అద్దంపడుతుంది.

కుష్లాబారీ అనే యూరోపియన్ విద్వన్మహిళ మొదటిసారిగా మైక్రో స్కూలింగ్‌ను 2010లో ప్రతిపాదించారు. అన్యాకెమెంట్జ్ వంటి పలువురు విద్యా రచయితలు మైక్రో స్కూలింగ్ విధానాన్ని ఆహ్వానించారు. విద్యార్థులు తమంతట తాము జ్ఞాన సముపార్జన చేయడానికి సంబంధించిన సమస్త పరికల్పనలకు ఉపాధ్యాయుల వైపు నుంచి సంపూర్ణ ప్రోత్సాహం, తల్లిదండ్రుల నుంచి ఇతోధిక సహకారం అందిస్తూ రూపొందించిన పాఠశాలలివి. సంప్రదాయ తరగతిని మించి అభ్యసనావకాశాలు విద్యార్థులకు పుష్కళంగా ఉంటాయి. న్యూ థాట్, న్యూ జనరేషన్ అభ్యాస భావనలకు టెక్నాలజీ జోడించిన విప్లవాత్మక నమూనా అమలవుతూ ఉంటుంది. ప్రముఖ రచయిత్రి భారత దేశంలో మైక్రో స్కూలింగ్ వ్యవస్థాపకురాలు లీనా అషర్ ‘How micro schools are revolutioning school education’ అనే పరిశోధనా పత్రంలో ‘అమెరికాలో 55 మిలియన్ల పాఠశాల పిల్లలు ఉండగా 2 నుండి 4 శాతం మంది 1.1 నుండి 2.2 మిలియన్ల మంది పిల్లలు మైక్రో-స్కూళ్లలో చదువుతున్నారు;

ప్రత్యేక విద్యావేత్తలతో చిన్న పరిమాణంలో తరగతి గది ఉంటుంది. టీచర్ల సాన్నిహిత్యంలో ప్రతి విద్యార్థి తన ప్రత్యేక అవసరాలు, అభిరుచులను తీర్చే అభ్యాస కల్పనలుంటాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య బలమైన సంబంధాలను ఏర్పరచడం ద్వారా మైక్రో- పాఠశాలలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. వైయక్తిక నైపుణ్యాలకు మద్దతునిస్తూ స్వీయ ప్రేరణ పొందేటటువంటి ప్రోత్సాహకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. విద్యార్థుల్లో ఆసక్తులను రగిలించడానికి, అన్వేషణ నవోన్మేషణ బలపడడానికి, విద్యార్జనా ప్రయాణంలో మంచి యాజమాన్యాన్ని అందివ్వడానికి, అవకాశాలతో కూడిన భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేస్తూ కీలక నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశమూ వీటిల్లో ప్రోత్సాహమూ ఉంటుంది’ అంటూ మైక్రో స్కూలింగ్ సాధించే విజయాలపై చేసిన వ్యాఖ్య ఆలోచించదగినది. పిల్లలు చేరిక నుండి వదిలివెళ్లే తేదీకి మొత్తం కాలం అభ్యాసకుల ఫలసిద్ధి ( సక్సెస్)కి బృహత్తర పునాదిని పాఠశాలే వేయాల్సుంది.

‘లెర్నింగ్, ట్రైనింగ్, ఇన్‌స్ట్రక్షన్, ప్రాక్టీస్’ నాలుగు దశల్లో చురుకుదనం అభినివేశం చూపే దిశగా పాఠశాల నడవాలి, విద్యార్థులను నడిపించాలి. గిజూభాయి వధేకా హెచ్చరించినట్టు ‘రుచీ పచీ లేని ఒక నీరస నిరాసక్త నిర్జీవ నిస్సారమయ పాఠశాలల వల్ల ప్రయోజనమే లేదు, ఉండదు’. Flexibility, Adoptability కి తార్కాణగా నిలిచే పాఠశాలను, తమ కలలను సాకారం చేసే (Dreams intoreality) పాఠశాలలు ఇవాళ్టి విద్యార్థుల జన్మహక్కు. ఇందుకు మైక్రో స్కూలింగ్ అనువైన విధానంగా ప్రజలకు చేరువవుతున్నది. మహానగరం హైదరాబాద్ మొదలు చిన్న పట్టణాలకూ మైక్రో స్కూళ్లు విస్తరిస్తున్నాయి. మైక్రో స్కూళ్ల విద్యా ప్రమాణాలను గమనిస్తే, మన దేశానికి ఇప్పుడు అందివచ్చిన డెమోగ్రాఫిక్ డివిడెండ్ రీత్యా ఇవి ఎట్లా కీలకమైనవో, పని సామర్థ్యం కలిగిన అసలైన మానవ వనరుల తయారీకి ఎంతగా దోహదపడగలవో తెలియగలదు. సహజ వనరులు, మౌలిక వసతులు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానం, అనే మూడు అంశాలతో పాటు సూపర్ పవర్ దేశాల వేగవంతమైన అభివృద్ధిని అక్కడి మానవ వనరులు శాసిస్తున్నాయి. ‘మానవ వనరులు’ అనేది గత రెండు మూడు దశాబ్దాలుగా జనాభా కు ప్రత్యామ్నాయంగా వాడుకలోకి వచ్చిన గౌరవ పూర్వకమైన పదం.

ఒక దేశంలోని మొత్తం జనాభాకే అక్కడి మానవ వనరులు అని నామాంతరం. దీంట్లో మళ్లీ అసలైన మానవ వనరులు ( True Human Resources) అనే మాట కూడా వ్యవహారంలో ఉంది. పని చేసే వయస్సు యోగ్యత కలిగిన జన సమూహాలే నిజమైన మానవ వనరులు. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (United Nations Population Fund) వివరణ ప్రకారం 15 నుండి 64 సంవత్సరాల మధ్యలోని వారంతా నిజమానవ వనరులగా పరిగణింపబడతారు.వీళ్లే ‘డెమోగ్రాఫిక్ డివిడెండ్’ కిందకు వస్తారు. యువకుల సంఖ్య పెరగడం, సంతానోత్పత్తి తగ్గుముఖం పడుతున్న దేశాలు జనాభా డివిడెండ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

అంటే జనాభాలో శ్రామిక ప్రజల నిష్పత్తి హెచ్చుదల వల్ల డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏర్పడుతుందని అర్థం. ఉత్పాదకత, ఆర్థిక వృద్ధికి దోహదపడే సామర్థ్యాన్ని డెమోగ్రాఫిక్ డివిడెండ్ సూచిస్తుంది. ఈ దృష్ట్యా మన దేశాన్నే తీసుకుంటే 1980ల నుండి పని సమూహంలోకి చేరుతున్న జనాభా సంఖ్య పెరుగుతూ వచ్చింది. గత నలభై ఏండ్లుగా డెమోగ్రాఫిక్ డివిడెండ్ దేశాభివృద్ధికి కలసి వచ్చే అంశంగా మన ముందుండిన వాస్తవం. ఇప్పుడు మన దేశమే డెమోగ్రాఫిక్ డివిడెండ్‌లో అగ్రస్థానంలో ఉంది. మనకు ఈ అగ్రస్థానం 2040 దాకా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా పనిశక్తి, పని సమూహాల ద్వారా పొందే ప్రయోజనాలకు లబ్ధికి మనదేశం దూరం అవుతుంది. మరి గత నాలుగు దశాబ్దాలుగా మనం బోధిస్తూ వస్తున్న విద్య, ఇస్తూ వచ్చిన శిక్షణ సంప్రదాయ నైపుణ్యాలు (Traditional World Skills)ను దాటి వాస్తవ -ప్రపంచ నైపుణ్యాలు (Real World Skills )ను సమకూర్చింది అంతంత మాత్రమేనని చెప్పకతప్పదు.

పాత బోధనా ప్రణాళిక పడగల కిందనే ఇంకా మన స్కూళ్లు, కాలేజీలు శ్వాస తీస్తున్నాయి. ఇవాళ ఒక డిమాండ్‌గా ముందుకొస్తున్న New Age Curriculamలో మనం వేసిన ముందడుగు లేశ మాత్రమే. నాల్గో పారిశ్రామిక్ విప్లవ ప్రభంజనం వీస్తున్న ప్రస్తుత తరుణంలోనైనా జనాభా డివిడెండ్‌ను సద్వినియోగం చేసుకునే దిశగా విద్యా వ్యవస్థ జాగృతం కావలసి ఉంది. విద్యారంగ నిపుణులు రితేష్ రావల్ (7 immediate changes needed in the Indian education system) చెబుతున్నట్టు మన జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి విద్య ఎంత కీలకమో మనందరికీ అర్థమైనప్పటికీ, విద్యా పరివర్తన మన దేశంలో ఒక ప్రధాన సమస్యగా మారింది. అర్థం లేని వల్లెవేత నుండి, మూస మూల్యాంకనం నుండి, సబ్జెక్టులన్నటి పట్ల సమాన గౌరవంలేని దుస్థితి నుంచి, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించలేని బలహీన స్థితి నుంచి, విద్యార్థి వ్యక్తిగత అభిరుచిని పట్టించుకోనితనం నుంచి, అధ్యాపక శిక్షణలోని లోపాల నుంచి, విద్యావశ్యకతను సరిగ్గా విద్యార్థులకు ఉన్మిఖీకరించలేని నిస్సత్తువ నుంచి మనం మనం చదువులను పరిరక్షించాల్సి వుంది. ఇందులో భాగంగానే తల్లిదండ్రులు ఇప్పుడు మైక్రో స్కూళ్ల వైపు చూస్తున్నారు. ఇక మిగిలింది ప్రభుత్వాలు పంతుళ్ల భాగస్వామ్యమే.

డా. బెల్లియాదయ్య- 9848392690

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News