ఒక్క సమస్య ప్రపంచ వ్యాప్తంగా సాంకేతికతపై ఆధారపడే జీవులను సతమతం చేసింది. ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ విండోస్‌లో తలెత్తిన భారీ టెక్నికల్ ఎర్రర్ అంతే స్థాయిలో సమస్యలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా విండోస్ 10,11 ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజర్లు తీవ్రంగా దీని ప్రభావానికి గురయ్యారు. శుక్రవారంనాడు ఉదయమం క్లౌడ్ సేవల యూజర్లు పిసిలు, ల్యాప్‌టాప్‌లు ఆన్ చేయగానే బ్లూస్కీన్ డెత్ ఎర్రర్ దర్శనమిచ్చింది. దీంతో సిస్టమ్స్ వెంటనే రీస్టార్ట్, షట్‌డౌన్ కావడం మొదలుపెట్టాయి. ఈ సాంకేతిక సమస్యతో ప్రపంచమంతటా ముఖ్యంగా రవాణా సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. విమాన, రైలు, టెలికం, బ్యాంకింగ్, బ్రాడ్‌కాస్ట్, ఐటి ఇలా కీలక రంగాల కు భారీ ఎత్తున విఘాతం కలిగింది. అమెరికా, ఆ స్ట్రేలియా, భారత్, బ్రిటన్ సహా పలు దేశాలపై ఎ నలేని ప్రభావం పడింది.
ఫలితంగా దేశీయ, అం తర్జాతీయ ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. వేలాదిగా విమాన సర్వీసులకు ఆటంకం ఏర్పడింది. మరికొన్ని ఎయిర్‌లైన్స్ సంస్థలు వందలాది సర్వీసులను రద్దు చేసుకున్నాయి. ఒక్క భారత్‌లోనే 200కుపైగా విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ఇందులో ఇండిగోకు సంబంధించినవే 192 కావడం విశేషం. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. బ్రిటన్‌లో వార్తా ఛానెళ్ల ప్రసారాలకు కూడా అంతరాయం కలిగింది. పారిస్ ఒలింపిక్స్ సన్నాహాకాలకు ఈ సెగ తగిలింది. మరోవైపు త్వరితగతిన ఈ సాంకేతిక సమస్యను మైక్రోసాఫ్ట్ పరిష్కరించలేకపోతే భారీ ఎత్తున గందరగోళం తలెత్తే అవకాశాశాలున్నాయి. అయితే మైక్రోసాఫ్ట్ మాత్రం సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నామని వెల్లడించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్‌పై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతుండగా… నెటిజన్లు రకరకాల మీమ్స్‌తో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఐటి ఉద్యోగులు తమకు మైక్రోసాఫ్ట్ వీకెండ్ ఆఫర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.