Sunday, January 19, 2025

మధ్య తరగతి బతుకుల్లోని చీకటి వెలుగులు

- Advertisement -
- Advertisement -

సాధారణంగా రచయితలు నాలుగు రకాలు. రచయితగా తమ పేరును చూసుకోవాలన్న తాపత్రయంతో కథావస్తువుతో సంబంధం లేకుండా తమకు నచ్చినట్లు రాసుకుంటూ పోయేవారు మొదటి రకానికి చెందుతారు. తమకు తెలిసున్న జ్ఞానాన్ని లేదా సమాచారాన్ని మిగతా వారికి అందించాలన్న ఉత్సుకతతో రచనలు చేసేవారు రెండవ రకానికి చెందినవారు. అలా కాకుండా ఎదుటివారితో సంబంధం లేకుండా తమ భావజాలాన్ని పాఠకుల మెదళ్లలోకి ఇంకింపజేయాలని, తామే కరెక్టని, తామే గొప్ప అని, తమకు ఎదురేలేదని నిరూపించడానికి పారుకులాడేవారుమూడవ రకానికి చెందినవారు.
‘అరే, సమాజం ఇలా ఉందేమిటి? పద్ధతులు ఇలా మారిపోయాయేమిటి?గాడితప్పుతున్నారెందుకు? మనస్పర్థలు ఎక్కడ చోటుచేసుకుంటున్నాయి? వాటినెలా పరిష్కరించుకుంటేబాగుంటుంది? సమాజం ఇలా ఉంటే బాగుంటుంది కదా! అనికలలు కంటూ,

తాము కలగన్న సమాజం కోసం అంతర్గతమైన సందేశాన్నిస్తూ రచనలు చేసేవారు చివరిదైన నాలుగవ రకానికి చెందినవారు. రెండవ రకాన్ని, నాలగవ రకాన్ని మిక్సీలో వేయగా వచ్చిన ఐదో రకానికి చెందిన రచయిత ఆచాళ్ళ ఉమా మహేష్. అతను విజ్ఞానం కలవాడు. సమాజం పట్ల బాధ్యత కలిగిన పౌరుడు. అసమానతల్ని తట్టుకోలేని సున్నిత హృదయుడు. సహజంగానే తనకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవాలని, దాన్ని ప్రత్యక్షంగా చెప్పకుండా అనుభూతి చెందేలా చెప్పాలని రచనా రంగంలోకి అడుగుపెట్టినవాడు.ఒక కూరగాయలమ్మాయి బాధను చూడలేడు.వ్యవసాయాన్ని మానేసే రైతుని చూసి తట్టుకోలేడు. నలుగురికి సాయం చేసేవాడికి సాయం అందకపోతే సహించలేడు. ఇల్లాలిని వంటకే పరిమితం చేస్తానంటే ఒప్పుకోడు. పేకాట, తాగుడు లాంటి అలవాట్లున్న వాళ్ళనుమాన్పించలేకపోయినా జీవితంలో స్థిరపడమని చెప్పే ఆలోచన కలవాడు. బీచ్లో చిరు వ్యాపారులను ప్రోత్సహించే మంచి మనసున్నవాడు.

తప్పు చేస్తే కటకటాలకైనా పంపించడానికి వెనకాడనివాడు. అన్నదమ్ముల, అక్కాచెల్లెళ్ల, తల్లిదండ్రుల కుటుంబ సంబంధాలను నెత్తినెట్టి మోసుకు తిరిగేవాడు కాబట్టే సంఘే శక్తి కలియుగే లాంటి మంచి కథాసంపుటిని మనకు అందించాడు. ఇందులో మొత్తం ఇరవై ఒక్క కథలున్నాయి.దాదాపు అన్ని కథలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, స్వాతిలో ప్రచురితం అయినవే.అన్ని కథల్లోని నేపథ్యం ఇంచుమించుగా మధ్య తరగతి జీవితాల్లోనివే. నోట్లు బంద్ అయినా, నిత్యావసర ధరలు అందుబాటులో లేకపోయినా, మరే ప్రకృతి విపత్తు తలెత్తినా ఎక్కువ ప్రభావానికి లోనయ్యేది మధ్య తరగతి వారే!అందుకేమో ఆయన కథావస్తువుల్లో వారి జీవితాలు పురుడు పోసుకున్నాయి.మనపై చెరగని ముద్ర వేస్తున్నాయి.వసుధ ఆ వీధిలో ఇంచుమించు అందరికీ అమ్మ కంటే ఎక్కువ. చుట్టుపక్కల మూడు వీధుల్లో ఆమెకు ఎంత పేరంటే… ప్రతిరోజూ ఏదో ఒక పేరంటంలో పూజో, నోమో పేరుచెప్పి ఆమె పాదాలు మూడొందల అరవై ఐదు రోజులూ పసుపుతోనే ఉంటాయి.

ఆమె ఆ ఇంటికి మహామంత్రి. ఆ ఇంటికి రాజు గుమస్తా అయిన ఆమె భర్త విశ్వనాథం. ఆమె తాతలు స్థితిపరులు. విశ్వనాథం మంచోడని ఆస్తులు లేకపోయినా అతనికిచ్చి కట్టబెట్టారు. రాజకుమారిలా పెరిగిన ఆమె మెట్టినింటికొచ్చి పేడ పిసికింది.పుట్టింటినుంచి రూపాయి ఆశించలేదు. భర్త చాలీచాలని జీతంతో నలుగురు పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడం కష్టమని భావించి నాలుగు గేదెల్ని మేపింది, వీధిలో నాలుగిళ్ళకు పాలు పోసింది, పుట్టింటినుంచి తెచ్చిన నగలన్నీ కరిగించేసింది. నలుగురిలో‘పెద్ద’గా గుర్తింపు పొందింది. అటువంటి వసుధ ఉన్నట్లుంది ఒంటరిఅయ్యింది. కట్టుకున్న భర్త డ్యూటి పూర్తిచేసుకుని వెళ్ళిపోయాడు. కడుపున పుట్టిన బిడ్డలు నలుగురూ తల్లిపై తమకున్న ప్రేమను బాహాటంగా ప్రకటించుకున్నారు. స్వార్థాన్ని కడుపులో దాచుకున్నారు. ఓ నిర్ణయం ప్రకారం నలుగురు బిడ్డల దగ్గర తలో మూడు నెలలు ఉండాలన్న తీర్మానం జరిగింది. భువి(వసుధ) కోరుకొని ఈ భ్రమణాన్ని ఉమా మహేష్ భువి కోరని భ్రమణం కథలో ఎంత ఆర్థ్రంగా చెప్తాడో… చదివితే గుండె బరువెక్కుతుంది.

ఇలాంటి కుటుంబమే భ్రమరాంబది. అచ్చం ఇలాంటి పరిస్థితులే అని రచయిత ఎక్కడా చెప్పకపోయినా ఈ కథకు కొనసాగింపుగా బ్రేక్ ది రూల్ కథ ఉంటుంది. తడి, మడి ఆచారాలు కలిగిన కుటుంబానికి చెందిన భ్రమరాంబకుఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. మొదటి ముగ్గురూ పెళ్ళిళ్ళు చేసుకుని సంసార సాగరాన్ని ఈదుతున్న వారే! చివరివాడైన చంటి మాత్రం ఆజన్మ బ్రహ్మచారిగాఉండిపోతాడు. దానికి కారణం ముగింపులో ఉన్నదే కావొచ్చు. కొన్నేళ్ళ తర్వాత వేరు వేరు కారణాలతో అల్లుళ్ళు, కోడలు, మనవలు, మనవరాళ్ళు ఆ యేడు సంక్రాంతి పండుగకు రావడం కుదరలేదు. ఆమె నలుగురు పిల్లలు మాత్రమే వచ్చారు. ఆ పండక్కి ఆ ఐదుగురే ఉండటంతో సరదాగా అంత్యాక్షరిలాంటి ఆట ఆడుకుందామని చంటి ప్రతిపాదిస్తాడు.ఇన్నేళ్ళ జీవితంలో తీరని కోరికలు ఏమున్నాయో మనసు విప్పి మాట్లాడుకోవడమే గేమ్ అన్నాడు. అది రూల్స్ ను బ్రేక్ చేసేదిగా ఉండాలన్నాడు.తలోకరు తలో మాట అన్నారు.వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. ఎవరికీ చెప్పమని ఓట్లు వేసుకున్నాక ఒక్కొక్కరూ తమకు తీరని కోరికలు చెప్పడం ప్రారంభించారు.

మొదటిగాడ్బ్బై యేళ్ళు దాటిన భ్రమరాంబ చెప్పింది – ఉడకబెట్టిన గుడ్డును రెండు ముక్కలుగా కోసి తినాలన్నది కోరిక అని. తర్వాత పెద్ద కూతురు తులసి చెప్పింది – మందులో ఉన్న మహత్యం ఏమిటో తెలుసుకోవాలన్నది తన తీరని కోరిక అని. ఆ తర్వాత చిన్న కూతురు పద్మ చెప్పింది -చిన్నప్పుడు ఎనిమిదో తరగతిలో ఆమె శ్రద్ధగా అల్లం, మిర్చి, జీలకర్ర, నెయ్యితో చేసిన పెసరట్టు ఎంతో బాగుందని మెచ్చుకున్న ప్రీతం జైన్ గురించి. ఆమె చేసే వంటల్ని భర్త ఎప్పుడూ మెచ్చుకోడని, అలాంటప్పుడు అతను గుర్తుకొస్తాడని. ఈసారి పెద్దకొడుకు రామకృష్ణ చెప్పాడు – అతనికి పేకాట అంటే విపరీతమైన పిచ్చి. లెక్చరర్ అవడంతో బలవంతంగా ఆ వ్యసనాన్ని వదులుకున్నాడు. ఓ ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరాయంగా పేకాట ఆడాలన్నది అతని కోరిక.ఇక చివరి వాడైన చంటి తాను బ్రేక్ చేయాలనుకున్న రూల్ గురించి చెప్పడు. దాటవేస్తాడు. అసలు చంటి వాళ్ళందరిచేత ఈ ‘బ్రేక్ ది రూల్’ గేమ్ ఎందుకు ఆడించాడు? అతని మనసులో ఏముంది? అవి తెలుసుకున్న తర్వాత అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి?

వాళ్ళ నలుగురి కోరికలు తీరనవిగానే మిగిలిపోతాయా? అనేది‘బ్రేక్ ది రూల్’ కథ చదివి తెలుసుకోవాల్సిందే. ముగింపు చదివాక మనస్సు కలుక్కుమంటుంది. అలాంటి ఇంకో కథే అన్నదాత. అన్నదాతా సుఖీభవ అనే దానికి తనదైన నిర్వచనం ఇచ్చాడు ఉమా మహేష్ ఆచాళ్ళ. విశాఖపట్నం సిటీకి పది కిలోమీటర్ల దూరంలో మావగారు అతనికో నాలుగొందల గజాల స్థలం ఇచ్చారు. ఏ గద్దో తన్నుకుపోకుండా దాని చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి ఓ రెండు గదుల షెడ్డు వేసి క్యాటరింగ్ చేసుకోవడానికి బుజ్జి అనే అతనికి అద్దెకిచ్చాడు. ఆ స్థలంలో ఓ డ్యూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలని ఎప్పట్నుంచో ఉన్న కోరిక మేరకు అందులో ఉంటున్న బుజ్జిని ఖాళీ చేయమని చెప్పేశాడు.అదే సిటీకి ఓ అరవై కిలోమీటర్ల దూరంలో తండ్రినుంచి సంక్రమించిన ఎకరం పొలం ఉంది. అది ప్రస్తుతం కౌలులో ఉంది. రియల్ ఎస్టేట్ బూమ్ వచ్చాక దాని రేటుకు రెక్కలోచ్చాయి. దాన్ని అమ్మడం ఇష్టం లేకపోయినా, రేట్లు మరింతగా పెరిగితే కాపాడుకోలేమని ఏ మూలనో ఉన్న భయంతో దాన్ని అమ్మేయ్యాలని నిర్ణయించుకుంటాడు.

అందులో క్యాప్సికం పండిస్తున్న సుబ్బయ్యకు దిగుబడి రాగానే ఖాళీ చేసెయ్యమని చెప్తాడు. కెరీర్లో నిలదొక్కుకోవడానికి సురేష్ పార్ట్ టైం జాబ్చేస్తుంటాడు. ఫుడ్ డెలివరీ జాబ్ అది. ఓ రోజు ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాడు కథానాయకుడు(కథలోప్రధానపాత్ర). అది తెచ్చి ఇచ్చిన సురేష్ గురించి ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది. అయితేబుజ్జికి, సుబ్బయ్యకు, సురేష్ కు మధ్యనున్నసంబంధం, వారికి ప్రధాన పాత్రతో ముడిపడి ఉన్న సంబంధం గురించి తెలిస్తే షాక్ అవుతాం. వాస్తవానికి చాలా దూరంగా, నాటకీయంగా(సినిమాటిక్గా) నడుస్తుంది ఈ కథ. రచయిత ప్రవేశం పుష్కలంగా ఉన్న కథ. ముగింపు చదివాక అవన్నీ పక్కకు వెళిపోతాయి. మనసు బరువుతుంది. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ కథకు మూడొందలకుపైగా(స్వయంగా రచయితే ప్రకటించుకున్నారు) ఫోన్ కాల్స్ వచ్చాయంటే ఎంతమంది హృదయాల్ని కదిలించిందో అర్థమవుతూనే ఉంది.

సుందరానికి, రామ్మూర్తికి విడదీయరాని అనుబంధం ఉంది. పెళ్ళిళ్ళు అయ్యాక ఎవరి జీవితాలు వారివయ్యాయి. అయినా కలిసికట్టుగానే ఉండేవారు. వజ్రం ఎంత గట్టిగా ఉన్నా మరో వజ్రం దాన్ని ముక్కలుగా చేసినట్లు వారిద్దరి మధ్య చీలికలు రావడానికి రామ్మూర్తి బామ్మర్ది కారణమయ్యాడు. అతనేం చెడ్డవాడు కాదు. అలాంటి గుణం ఉన్నవాడు అంతకంటే కాదు. కాని, ఆ సమయానికి రాహువుగా మారాడంతే! సుందరం ఉంటున్న ఇంటికి మూడు వీధుల అవతలున్న నాలుగొందల గజాల ఇళ్ళ స్థలం ఒకటి అమ్మాకానికొచ్చింది. కొనుక్కుంటే ఇద్దరికీ మంచి రిటరన్స్ వస్తాయని సుందరం చెప్పడంతో రామ్మూర్తి సరేనంటాడు. అతనిమీదున్న నమ్మకంతో స్థలం చూడడానికి కూడా వెళ్ళకుండా రిజిస్ట్రేషన్ చేయించేసుకుంటాడు. ‘ఎనిమిది లక్షలకే వచ్చే స్థలాన్ని పదిలక్షలకు ఎలా కొన్నావ్ బావా? బేరంఆడలేదా?’ అని రామ్మూర్తి బామ్మర్ది అనుమానపు బీజాన్ని నాటతాడు. ఆ స్థలం సుందరం మావగారి దగ్గర బంధువులదని, అందుకే అడిగినంత ఇచ్చేసి ఉంటాడని, మధ్యలో నిన్ను బలిపశువును చేశాడని, నా మాట ఆబద్ధమైతే ఇప్పుడే ఆ ప్లాట్ అమ్మేసి డబ్బులు ఇవ్వమని అడగమంటాడు.

అడిగి చూస్తాడు రామ్మూర్తి. ఊహించినట్లుగానే కుదరదంటాడు సుందరం. ఆక్కడ్నుంచి వారిమధ్యనున్న బంధం ఏ తీరాలకు చేరిందో అడ్డుగోడ అనే కథను చదివి తెలుసుకోవాల్సిందే!ఉమా మహేష్ చాలా తెలివైనోడని ఈ సంపుటిలోని ప్రతికథా చెప్పకనే చెప్తుంది. అరటిపండు వలిచినట్లు కథ చెప్పడం అతనికి ఇష్టముండదు. పాఠకుల ఊహాశక్తికి పదును పెడుతుంటాడు. మిగతా సమకాలీన రచయితల కన్నా ఉమా మహేష్ ఎందుకు భిన్నమైన వాడో అతని కథల్లోని కథనం చెప్తుంది. ఒక విషయాన్ని పాఠకులకు అర్థమయ్యేలా చెప్పడానికి కొందరు పేరాలు పేరాలు రాసేస్తూ ఉంటారు. కానీ ఉమా మహేష్ అలా చేయడు. రావిశాస్త్రి గారి ప్రభావంతో ఉపమానాలను తన ఆయుధంగా మార్చుకున్నాడు. ఎంతటి క్లిష్టమైన సందర్భాన్ని చెప్పడానికైనా చిన్న ఉపమానంలో కన్వే చేసేస్తాడు. ఉపమానాల ఉమా మహేష్ గా పిలవబడే అతను, కథల్లో ఉపమానాలను ఎలా ఉపయోగించాడో, వాటి గాఢత ఏంటో చూడ్డానికి పుస్తకం అట్ట వెనకున్న కండగలవాక్యాల్నిచదివితే తెలుస్తుంది.

అతనో కథాభిమాని. వైజాగ్ కస్టమ్స్ లో అప్రైజల్ ఆఫీసరుగా అలుపెరుగని బాధ్యతలు నిర్వహిస్తూనే కథాసాహిత్యంలో తలమునలై ఉన్నారంటే కథలంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.పాఠకులు ఫోన్ చేసి తన కథ గురించి చర్చిస్తే సమయాన్నే మర్చిపోయే రచయిత.కొసమెరుపుతో కథను ముగించి పాఠకులను ఆకట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాడు ఉమా మహేష్. చాలాచోట్ల అది సఫలం అయ్యింది. అలాగే ప్రత్యామ్నాయ పదాలు ఉన్నా ఆంగ్లాన్ని ఎక్కువగా వాడటం కొంతమంది పాఠకులకు మింగుడు పడకపోవచ్చు. ఉమా మహేష్ ఏది పడితే అది రాసెయ్యడు. పత్రికను బట్టి, వాటి భావజాలాన్ని బట్టి తన కలాన్ని కదుపుతుంటాడు. తనకు తెలియని విషయాల జోలికి పోడు. ఒకవేళ పోవాల్సి వస్తే పరిశోధిస్తాడు, తెలుసుకుంటాడు. అప్పుడే రాస్తాడు. ఉదాహరణకు‘అక్కడెవరో ఉన్నారు’ అనేకథ. ఇప్పుడున్న సమకాలీన కథకుల్లో విశిష్టమైన స్థానం పొందగలిగిన కథకుడు ఉమా మహేష్. మూస నేపథ్యాలనుంచి వస్తు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తే కచ్చితంగా చిరస్థాయిగా నిలబడగలిగే సత్తా ఉన్నవాడు.

ఈ సంపుటిలో చాలా కథలు మనల్ని ఆకట్టుకుంటాయి.ఒకే రకమైన కథలు ఉండకుండా కొన్ని హాస్య కథలూ ఇందులో చేర్చాడు. ఈ సంపుటికి ‘సంఘే శక్తి కలియుగే’ అనే పేరే ఎందుకు పెట్టాడో రచయిత అంతరంగం చదివి తెలుసుకోవాల్సిందే! అది తెలుసుకున్నాక ప్రముఖ కథకులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ పుస్తకానికి అవార్డ్ ఇవ్వడంలో తప్పు లేదని అంటారు. ఎంతో సత్తా ఉన్న ఉమా మహేష్ నుంచి మరిన్ని గట్టి కథలు ఆశిద్దాం.

కథాసంపుటి: సంఘే శక్తి కలియుగే
రచయిత: ఉమా మహేష్ ఆచాళ్ళ
పేజీలు : 166
ధర: రూ.12౦/-లు
ప్రతులకు : విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్ : +91 98493 03247.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News