Thursday, January 23, 2025

2047 నాటికి 102 కోట్ల మధ్యతరగతి!

- Advertisement -
- Advertisement -

భారతావనికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏండ్లు పూర్తికానున్న తరుణాన దేశ జనాభాలో 2047 నాటికి మధ్య తరగతి వర్గాల జనాభా 102 కోట్లకు చేరుతుందని, నాటి దేశ జనాభా 166 కోట్లలో 61% మిడిల్ క్లాస్ వర్గాలు ఉంటారని పీపుల్స్ రీసెర్చ్ ఆన్ ఇండియాస్ కన్జ్యూమర్ క్లాస్ (ప్రైస్)’ అనే సంస్థ విడుదల చేసిన ‘ది రైజ్ ఆఫ్ ఇండియాస్ మిడిల్ క్లాస్’ అనబడే నివేదిక స్పష్టం చేస్తున్నది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతావని ఆర్థిక వ్యవస్థ సన్మార్గంలో రూపాంతరం చెందుతున్నదని, 2047 వరకు సాలీనా సగటున 6 7% అభివృద్ధి రేటు నమోదు అవుతుందని వివరించారు. ప్రైస్ సంస్థ 2014, 2016, 2021లలో నిర్వహించిన సర్వేలో 2 లక్షల కుటుంబాల వివరాలను పరిగణనలోకి తీసుకొని శాస్త్రీయ అధ్యయనం చేశారు.

Also Read: రీల్స్ సరదా ప్రాణం తీసింది(వైరల్ వీడియో)

అల్పాదాయ, మధ్య ఆదాయ, ధనిక వర్గాలు సాలీనా రూ. 5 నుంచి రూ. 30 లక్షల ఆదాయం నమోదు చేసిన కుటుంబాలను మధ్య తరగతి (మిడిల్ క్లాస్) గా వర్గీకరించారు. మధ్య తరగతిలో రూ. 5 15 లక్షల వార్షిక ఆదాయ కుటుంబాలను ‘సీకర్స్’గా, రూ. 15 30 లక్షల ఆదాయ కుటుంబాలను ‘స్ట్రైవర్స్’గా విభజించారు. ధనవంతుల్లో రూ. 30- 50 లక్షల వార్షిక కుటుంబ ఆదాయం పొందే వర్గాన్ని ‘నియర్ రిచ్’ అని, రూ. 1- 2 కోట్ల ఆదాయం పొందే కుటుంబాలను ‘షీర్ రిచ్’ అని, రూ. 2 కోట్లకు పైగా ఆదాయం పొందుతున్న కుటుంబాలను ‘సూపర్ రిచ్’ అంటూ వర్గీకరించారు. అత్యల్ప ఆదాయం పొందుతున్న వర్గాల్లో సాలీనా రూ. 1.25 లక్షల కన్నా తక్కువ ఆదాయ కుటుంబాలను ‘డెస్టిట్యూట్స్’గా, రూ. 1.25 5 లక్షల వార్షిక ఆదాయం కలిగిన కుటుంబాలను ‘ఆస్పైరర్స్’గా విభజించారు. దేశ ఆర్థిక రాజకీయ సంస్కరణలు ఫలిస్తే 2047 నాటికి అల్పాదాయ డెస్టిట్యూట్స్, ఆస్పైరర్స్ వర్గాల కుటుంబాలు గణనీయంగా తగ్గుతూ మధ్య తరగతి/ సంపన్న కుటుంబాలు పెరుగుతాయని విశ్లేషించారు.

కుటుంబ ఆదాయాల్లో పెరుగుదల

2047 నాటికి భారత కుటుంబ సగటు వార్షిక ఆదాయం రూ. 20 లక్షల వరకు చేరవచ్చనే శుభవార్తను వెల్లడించింది. 2016-21 మధ్య కాలంలో సంపన్నుల అభివృద్ధి రేటు 10 శాతం, మధ్య తరగతి వృద్ధి రేటు 4 7.5 శాతం, పేదల్లో అభివృద్ధి రేటు 0.6 శాతం ఉంటుందని తేల్చింది. దేశ వ్యాప్తంగా ఆర్థిక అసమానతలు క్రమంగా పెరగడం తప్పదని, గ్రామీణ కుటుంబాలు ఉన్నత ఆదాయ వర్గాలకు చేరడం, పేదలు మధ్య తరగతికి, మధ్య తరగతి వర్గాలు ధనవంతుల వర్గంలోకి మారతారని వివరించింది. 2016- 21 మధ్య కాలంలో పట్టణాల్లో పేద కుటుంబాలు 7.6 శాతం పెరగడం జరుగునట్లు అంచనా వేసింది. సంపన్న వర్గాలు పట్టణాల్లో, పేదలు గ్రామీణ భారతంలో విస్తరించారని తెలుస్తున్నది.

నిరక్షరాస్యత, ఆదాయ వ్యయాలు

ధనవంతుల కుటుంబాల్లో డిగ్రీ పొందిన యువత, నిరుపేదల్లో నిరక్షరాస్యులు అధికంగా ఉన్నారని నివేదిక స్పష్టం చేస్తున్నది. పేదల్లో 15 శాతం పూర్తి నిరక్షరాస్యులు, 37 శాతం మంది ప్రాథమిక పాఠశాల విద్య పొందిన బడుగులు ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యార్హతలు పెరిగిన కొద్దీ ఆదాయం కూడా పెరుగుతున్నట్లు అధ్యయనం స్పష్టం చేసింది. ప్రైవేట్ ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందుతున్న వారిలో మధ్య తరగతి, సంపన్న వర్గాల యువత అధికంగా ఉన్నట్లు విదితం అవుతున్నది. 2021లో పేదలు ఏడాదికి సగటున రూ: 82,300/- ఖర్చు చేస్తున్నారని, సంపన్నుల 25 రెట్లు అధికంగా రూ: 20.47 లక్షల వరకు వెచ్చిస్తున్నారని తెలుస్తున్నది. పేద వర్గాలు తమ ఆదాయంలో 67 శాతం కనీస అవసరాలకు, ముఖ్యంగా ఆహార పదార్థాల కొనుగోలుకు, మధ్య తరగతి వర్గాలు 51 శాతం, సంపన్నులు 44 శాతం ఖర్చు చేస్తున్నారని తెలిపింది. సంపన్నుల అధికంగా విలాసవంతమైన జీవన విధానాలకు (విహార యాత్రలు, ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, ఉన్నత విద్య లాంటి) తమ ఆదాయంలో 50 శాతం ఖర్చు చేస్తున్నారని అర్థం అవుతున్నది.దేశంలో మధ్యతరగతి వర్గాల ద్వారా ఆదాయం, వ్యయం, పొదుపు లాంటివి అధికంగా జరుగుతూ దేశ ఆర్థిక గమనానికి దోహదపడుతున్నట్లు వివరించారు.

అట్టడుగు వర్గాలకు ఇంటర్‌నెట్ అందుబాటు

దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల కుటుంబాలకు విద్యుత్ అందుబాటు క్రమంగా పెరుగుతున్నదని, సురక్షిత తాగు నీటి లభ్యతలో మధ్య తరగతి/ సంపన్నులకు మాత్రమే లభిస్తున్నదని, పేదలు వెనకబడి ఉన్నారని తెలుస్తున్నది. 2021లో 30% పేద కుటుంబాలకు కుళాయి నీరు లభ్యం అవుతున్నదని, 50 శాతం కుటుంబాలు టాయిలెట్స్‌కు నల్లా నీటి సౌకర్యానికి దూరంగా ఉన్నాయని తేల్చింది. డిజిటల్ అనుసంధానంలో అసమానతలు గణనీయంగా తగ్గుతున్నాయని, 85% పేదలకు సెల్‌ఫోన్ సౌకర్యం అందుతున్నట్లు, 39 శాతం పేదలు ఇంటర్నెట్ కూడా వినియోగిస్తున్నారని, 90 శాతానికి పైగా పేద కుటుంబాలు సీలింగ్ ఫ్యాన్లను వాడుతున్నారని తెలుస్తున్నది.

డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News