Friday, February 21, 2025

కొత్త సిఇసి నియామకంపై అర్ధరాత్రి నిర్ణయం అవమానకరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎంపిక ప్రక్రియను సుప్రీం కోర్టులో సవాల్ చేసినప్పుడు కొత్త సిఇసి ఎంపికపై అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం ప్రధానికి, హోమ్ శాఖ మంత్రికి ‘అవమానకరం, అమర్యాదకరం’ అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ మంగళవారం ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎంపిక కమిటీ సమావేశమైన కొన్ని గంటల తరువాత సోమవారం రాత్రి మాజీ ఐఎఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్‌ను కొత్త సిఇసిగా ప్రభుత్వం నియమించింది. హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ విషయమై సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్న దృష్టా సమావేశాన్ని వాయిదా వేయవలసిందిగా ప్రభుత్వాన్ని లోక్‌సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కోరారు. రాహుల్ గాంధీ కమిటీకి ఒక అసమ్మతి పత్రాన్ని అందజేశారు.

కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కూడా కమిటీలో ఒక సభ్యుడు. ‘తదుపరి ఎన్నికల కమిషనర్ ఎంపిక నిమిత్తం కమిటీ సమావేశంలో నేను ప్రధానికి, హోమ్ శాఖ మంత్రికి ఒక అసమ్మతి పత్రం అందజేశాను. కార్యనిర్వాహక వర్గ జోక్యం లేని స్వతంత్ర ఎన్నికల కమిషన్‌కు సంబంధించి అత్యంత మౌలిక అంశం ఏమిటంటే ఎన్నికల కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియ’ అని ఆ పత్రంలో రాశాను’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు.‘సుప్రీం కోర్టు ఉత్తర్వును ఉల్లంఘించడం, కమిటీలో నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)ని తొలగించడం ద్వారా మోడీ ప్రభుత్వం మన ఎన్నికల ప్రక్రియ సమగ్రతపై కోట్లాది మంది వోటర్ల ఆందోళనలను తీవ్రతరం చేసింది’ అని రాహుల్ గాంధీ తన పోస్ట్‌లో అసమ్మతి పత్రాన్ని పంచుకుంటూ వ్యాఖ్యానించారు.

ప్రతిపక్ష నాయకునిగా తన కర్తవ్యం బాబా సాహెబ్ అంబేద్కర్, దేశ వ్యవస్థాపక నేతల ఆశయాలను పరిరక్షించడం, ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడం అని ఆయన పేర్కొన్నారు. ‘అసలు కమిటీ కూర్పు, ఎంపిక ప్రక్రియను సుప్రీం కోర్టులో సవాల్ చేస్తున్నప్పుడు, 48 గంటలలోపే విచారణ జరగనున్నందున కొత్త సిఇసి ఎంపికపై అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం ప్రధానికి, హోమ్ శాఖ మంత్రికి అవమానకరం, అమర్యాదకరం’ అని కూడా రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ నియామకాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆక్షేపించింది. సుప్రీం కోర్టు పరిశీలనను ‘తప్పించాలని’, కోర్టు తీర్పు వెలువడే లోపే నియామకం జరపాలని ప్రభుత్వం పట్టుదలతో ఉందని కాంగ్రెస్ ఆరోపించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News