Wednesday, January 22, 2025

జన్వాడలో విందు కలకలం

- Advertisement -
- Advertisement -

ఫామ్‌హౌస్‌లో అర్ధరాత్రి పోలీసుల సోదాలు.. విదేశీ మద్యం, నిషేధిత గేమింగ్ వస్తువులు స్వాధీనం

డ్రగ్స్ పరీక్షల్లో ఒకరికి పాజిటివ్, విజయ్ మద్దూరిగా గుర్తింపు నిందితుల జాబితాలో బావమరిది రాజ్ పాకాల కెటిఆర్ నివాసం, ఒరియన్
విల్లాస్ వద్ద ఉద్రిక్తత సోదాలకు వెళ్లిన పోలీసులను అడ్డుకున్న బిఆర్‌ఎస్ నేతలు, అరెస్టు రాజ్ పాకాల నివాసంలో రాత్రి 10 గం. వరకు తనిఖీలు

మనతెలంగాణ/హైదరాబాద్ : నగర శివారులోని జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న విందును శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యం సహా, భారీగా దేశీయ మద్యం స్వాధీనం చేసుకున్నారు. బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఫాంహౌస్‌లో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులకు విశ్వాసనీయ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన సైబరాబాద్ ఎస్‌ఒటి, ఎక్స్‌జ్ పోలీసులు ఫామ్‌హౌస్‌లో సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు.ఈ పార్టీలో 22 మంది పురుషులు, 16 మంది మహిళలతో కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పార్టీ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముందస్తు అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంతోపాటు విందులో విదేశీ మద్యం, నిషేదిత గేమింగ్ వస్తువులు వినియోగించారని పోలీసులు తెలిపారు. విదేశీ మద్యం సహా, భారీగా లిక్కర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్లేయింగ్ కార్ట్, ప్లాస్టిక్ కైన్స్ సైతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10.5 లీటర్ల విదేశీ మద్యం, 10 లూజ్ ఇండియన్ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై ఎక్సైజ్ యాక్ట్, ఎన్‌డిపిఎస్ యాక్ట్, గేమింగ్ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ఒకరికి కొకైన్ పాజిటివ్..

జన్వాడ ఫామ్‌హౌస్ కేసు విచారణ జరుగుతుందని సైబరాబాద్ డిసిపి శ్రీనివాస్ తెలిపారు. శనివారం అర్థరాత్రి మొకిలా ఫామ్‌హౌస్‌పై ఎస్‌ఒటి, ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారని తెలిపారు. రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో 22 మంది పురుషులు, 16 మంది మహిళలను గుర్తించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. విదేశీ మద్యంతో పాటు గేమింగ్ సంబంధిత అంశాలు గుర్తించినట్లు తెలిపారు. గేమింగ్ సంబంధిత అంశాలపై విచారణ జరుగుతుందని అన్నారు. పురుషులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించామని ఒకరికి కొకైన్ పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు.

అయితే విందులో పాల్గొన్న మహిళలు పరీక్షలకు నిరాకరించినట్లు డిసిపి తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో రెండవ నిందితుడిగా పేర్కొన్న విజయ్ మద్దూర్‌కి కొకైన్ సేవించిన పరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్(ఎన్‌డిపిఎస్), 1985 చట్టంలోని 25,27, 29 కేసు నమోదు చేశారు. మొకిలా పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ కోటేశ్వర్‌రావు ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎ1గా రాజ్ పాకాల, ఎ2గా విజయ్ మద్దూరిపై కేసు నమోదు చేశారు. దీంతో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 3, 4 ప్రకారం కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. జాన్వాడ ఫామ్‌హౌస్ పార్టీపై విచారణ కొనసాగుతోందని సైబరాబాద్ డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు.

కెటిఆర్ నివాసం వద్ద, రాజ్ పాకల సోదరుడి నివాసం వద్ద ఉద్రిక్తత

నందినగర్‌లోని కెటిఆర్ నివాసం వద్ద, రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫామ్‌హౌజ్ ఘటన నేపథ్యంలో సోదాల కోసం వెళ్లిన పోలీసులు బిఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారికి అదుపులోకి తీసుకున్నారు. కెటిఆర్ నివాసం వద్దకు ఆదివారం మధ్యాహ్నం భారీగా చేరుకున్న పోలీసులు బలవంతంగా లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని నిరసనలు తెలిపారు. సెర్చ్ వారెంట్ లేకుండా లోనికి వెళ్లేందుకు పోలీసులు యత్నించడంతో వారిని అడ్డగించారు. ఈ క్రమంలో బిఆర్‌ఎస్ నేతలతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రికత్త వాతావరణం నెలకొంది. నందినగర్ కెటిఆర్ నివాసం వద్ద పోలీసులు ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న బిఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్‌తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే రాజ్ పాకాల సోదరుడు శైలేంద్ర పాకల విల్లా వద్ద బిఆర్‌ఎస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఓరియన్ విల్లాలో శైలేంద్ర పాకాల నివాసంలోకి పోలీసులు వెళ్లకుండా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు మాగంటి గోపీనాథ్, కెపి వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ఎంఎల్‌సి శంభీపూర్ రాజు, మాజీ ఎంఎల్‌ఎ బాల్క సుమన్ తదితరులు అడ్డుకున్నారు. తమ న్యాయవాది సమక్షంలో సెర్చ్ చేయాలని బిఆర్‌ఎస్ నేతలు వారించారు. విల్లా లోపలకు వెళ్లేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించారు. ఎక్సైజ్ పోలీసులు జేబులు తనిఖీ చేశాక లోపలకు పంపిస్తామని కార్యకర్తలు చెప్పారు. ఫామ్‌హౌస్‌లో సోదాలు చేయొద్దని బిఆర్‌ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు,బిఆర్‌ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బిఆర్‌ఎస్ నేతలు కెపి వివేకానంద, బాల్క సుమన్, రాజుసాగర్, రాకేశ్, ఆశిష్ యాదవ్ సహా 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక చివరికి కుటుంబసభ్యులు కలిసి జరుపుకుంటున్న వేడుకను రేవ్ పార్టీగా చిత్రీకరించారని ఎంఎల్‌ఎ కల్వకుంట్ల సంజయ్‌కుమార్ మండిపడ్డారు. నోటీసులు లేకుండా రాజ్ పాకాల ఇంట్లోకి పోలీసులు ఎలా వస్తారని బిఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ ప్రశ్నించారు.

కెటిఆర్‌ను ఇరికించడానికి సిఎం రేవంత్ మరో కొత్త నాటకం : కెపి వివేకానంద

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కొత్త నాటకానికి తెరదీశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కెపి వివేకానంద విమర్శించారు. సిఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కెటిఆర్‌ను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హామీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం ఎంఎల్‌ఎ కెపి వివేకానంద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కెటిఆర్‌కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని, కెటిఆర్‌పై అసూయతో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి దూషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి : తలసాని

బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బావమరిది గృహ ప్రవేశం కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నదని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలుసతమతం అవుతున్నారని, ప్రభుత్వం వాటిపై దృష్టి సారించాలని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ తప్పిదాలు, ఎన్నికల హామీలపై కెటిఆర్ ప్రశ్నిస్తున్న కారణంగానే కుట్రపూరితంగా కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి సర్చ్ వారెంట్లు లేకుండా గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్న గృహప్రవేశాన్ని రేవ్ పార్టీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజల పక్షాన పోరాడటంలో వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇకనైనా కక్ష సాధింపు చర్యలు మానుకొని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ఫామ్‌హౌస్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందో లేదో అని తేల్చడానికి సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సిఎం బంధువు అయినా, మాజీ సిఎం బంధువు అయినా దర్యాప్తు జరగాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై బిజెపి స్టాండ్ ఇదేనని పేర్కొన్నారు. విదేశీ మద్యానికి అనుమతి లేకుండా ఆ విందులో ఉపయోగించినట్లు చెబుతున్నారని, అది వాస్తవమో..కాదో విచారణలో తేలాలని అన్నారు. పోలీసులు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని, చట్టం తన పని తాను చేసుకునే విధంగా నడుచుకోవాలని కిషన్‌రెడ్డి హితవు పలికారు.

కావాలనే కెటిఆర్‌ను తప్పించారు : బండి సంజయ్ ఆరోపణ

జన్వాఢ ఫాంహౌజ్‌లో కెటిఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులున్నట్లు తమకు సమాచారం ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న వాళ్లు కూడా ఈ పార్టీలో ఉన్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. కొందరు పోలీసులు కావాలనే కెటిఆర్‌ను తప్పించారని ఆరోపించారు. హోంశాఖ సిఎం వద్దే ఉన్నా ఎందుకు సమగ్ర విచారణ జరపడం లేదని అడిగారు. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఒక్కటేనని ఇన్నాళ్లు తాము చెబుతున్నది నిజమేనని మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. కెసిఆర్‌తో ఉన్న దోస్తీ వల్లనే కెటిఆర్‌ను వదిలేశారా..? అని నిలదీశారు. తెలంగాణలో డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతాం..డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ప్రభుత్వ ప్రకటనలన్నీ డొల్లేనా..? అని అడిగారు. డ్రగ్స్ రహిత రాష్ట్రమంటే కెటిఆర్ కుటుంబ సభ్యులను తప్పించడమేనా..?..కెటిఆర్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో డ్రగ్స్ తీసుకునే స్వేచ్ఛ ఇచ్చారా..? అంటూ బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అక్కడున్న టవర్ లొకేషన్స్‌ను గుర్తించాలని చెప్పారు. కెటిఆర్ సహా ఆయన కుటుంబ సభ్యుల పాస్ పోర్టులను సీజ్ చేయాలని, లేనిపక్షంలో వారు విదేశాలకు పారిపోయే ప్రమాదముందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.

జన్వాడ రేవ్ పార్టీపై ఏం సమాధానం చెబుతావ్ కెటిఆర్ : ఆది శ్రీనివాస్

జన్వాడ ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్ పార్టీపై కెటిఆర్ ఏం సమాధానం చెబుతారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఆయన సొంత బావమరది రాజ్ పాకాల డ్రగ్స్ వ్యాపారంలో ఉన్నారని ఆరోపించారు. రాజ్ పాకాల ఇప్పటివరకు ఎంతో మందికి డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ల జీవితాలు, కుటుంబాలను చిన్నాభిన్నం చేశారని ధ్వజమెత్తారు. పోలీసులు ఈ కేసులో సమగ్ర విచారణను చేపట్టి.. రేవ్ పార్టీకి హాజరైన వారందరినీ అరెస్ట్ చేయాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ సమాజం సిగ్గు పడుతోంది : అద్దంకి దయాకర్

కెటిఆర్ బావమరిది ఫామ్‌హౌస్‌లో అసాంఘీక కార్యక్రమాలు చూస్తే.. మొత్తం తెలంగాణ సమాజం సిగ్గు పడుతోందంటూ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని డగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల పకడ్బందీ చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఓ మాజీ మంత్రిగా ఉన్న సొంత బావమరిది ఫామ్ హౌస్‌లో రేవ్ పార్టీలు జరగడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. అయితే, పోలీసుల రైడ్ జరిగే కంటే ముందే రేవ్ పార్టీ నుంచి మరో 20 మంది వరకు వెళ్లిపోయారనే సమాచారం తమ వద్ద ఉందని అద్దంకి దయాకర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News