న్యూఢిల్లీ : భారత నౌకాదళానికి చెందిన మిగ్ 29కే విమానం గోవా సముద్ర తీరంలో కుప్పకూలింది. సాంకేతిక లోపం కారణం గానే ఈ విమానం కూలిపోయినట్టు నేవీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో పైలట్ క్షేమంగా బయటపడ్డాడు. విమానం సముద్రం మీదుగా ఎగురుతుండగా సాంకేతిక లోపంతో ఒక్కసారి కూలిపోయింది. సమాచారం అందిన వెంటనే అధికారులు వేగంగా రెస్కూ ఆపరేషణ్ చేపట్టడంతో పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. శిక్షణలో వినియోగిస్తున్న ఈ విమానం నేవీ స్థావరానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై విచారణకు బోర్డు ఆఫ్ ఎంక్వైరీని అధికారులు ఆదేశించారు. రష్యాలో తయారైన మిగ్ 29 కే ప్రపంచం లోనే అత్యంత అధునాతనమైన యుద్ధ విమానం. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ఎజెక్షన్ హ్యాండిల్ లాగడంతో వెనక సీటులో ఉండే పైలట్ ముందుకు ఎజెక్ట్ అయి సురక్షితంగా బయటపడేందుకు ఈ విమానంలో ప్రత్యేక ఎజెక్షన్ సీటు ఉంది.
ఏ వాతావరణం లోనైనా బహు విధాలుగా పోరాటం చేయగల సత్తా ఉన్న ఈ విమానాన్ని రష్యాకు చెందిన ఎయిరోస్పేస్ కంపెనీ మికొయాన్ తయారు చేసింది. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నుంచి వీటిని వినియోగించడం కోసం దశాబ్ద కాలం క్రితం దాదాపు 2 బిలియన్ డాలర్ల వ్యయంతో రష్యా నుంచి ఇండియన్ నేవీ 45 మిగ్ 29 కేలను కొనుగోలు చేసింది. 2020 నవంబర్‌లో ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నుంచి మిగ్ 29 కె టేకాప్ అయిన వెంటనే గోవా అరేబియా సముద్రంలో కుప్పకూలింది. 2020 ఫిబ్రవరి 23న మరో మిగ్ 29 కె గోవా తీరంలో ఐఎన్‌ఎస్ హంసా నుంచి టేకాఫ్ అయిన వెంటనే అరేబియా సముద్రంలో కుప్పకూలింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. 2019 నవంబర్‌లో దక్షిణ గోవా తీరంలో రెండు సీట్ల మిగ్29 కె కుప్పకూలినా అందులోని ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ గలిగారు.