న్యూఢిల్లీ : దేశంలో మరోసారి మునుపటి మాదిరిగానే సంభవించిన పరిణామాల నడుమ వలస కూలీల పరిస్థితి వారిబతుకు అతీగతి గురించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? అని సుప్రీంకోర్టు నిలదీసింది. ఇంతకు ముందటిలాగానే ఇప్పుడు కూడా వలసకూలీలు లాక్‌డౌన్ల భయాలు, కరోనా ఉధృతితో తిరిగి తమ స్వస్థలాలకు పయనం అయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న వలస కూలీల నమోదు ప్రక్రియలో చాలా మందకొడితనం ఉం దని, ఇది మంచి పద్థతి కాదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అసలు వలస కూలీలు ఎవ రు? ఎక్కడెక్కడ ఉన్నారు? ఈ అతి పెద్ద అసంఘటిత కార్మిక రంగ వర్కర్ల నమోదు ప్రక్రియ ఎప్పుడూ అత్యవసరం. ఇప్పుడు నెలకొన్న కొవిడ్ తీవ్రత నేపథ్యంలో ఇది మరింత అవసరం అని, ఇటువంటి ఏర్పాట్లతో వలస కూలీలకు ఎక్కడున్నా సహాయ పథకాలు అందుకునే అవకాశం ఏర్పడుతుంది. వీరిని జాబితాలో నమోదు చేసే పద్ధతి లేకపోతే ఇక వారికి ఎటువంటి సహాయం ఎవరైనా, ఎక్కడైనా ఏ విధంగా అయినా అందించగలరా? అని న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం తెలిపింది.
అసంఘటిత కార్మికుల విషయాలను కేంద్రం , రాష్ట్రాలు గాలికివదిలేస్తున్నాయి. సాధారణ పరిస్థితులలో వలస కూ లీలు తమ బతుకు తాము బతికే కనీస జీవన స్థితిలో ఉన్నారు. మరి కరోనా వంటి తీవ్రస్థాయి పరిణామాలు తలెత్తిన దశలో కాలికి చక్రాలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఏర్పడిన వలస కూలీలకు ఏదైనా ఆసరా ఉందా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రకటించే పథకాల ప్రయోజనాలు లబ్థిదారులకు చెం దాల్సి ఉంది. వీరిలో వలసకూలీలు కూడా ఉంటారని దీనిని గుర్తుంచుకోవాలని ధర్మాసనం తెలిపిం ది. వలస కూలీల నమోదు ప్రక్రియను వేగిరపర్చ డం అత్యవసరం అని ధర్మాసనం తెలిపారు.
వలస కూలీలకు ఆహార భద్రత, నగదు పంపిణీ, రవాణా, ప్రయాణ సౌకర్యాలు, ఇతర సంక్షేమ చర్యలు చేపట్టాల్సి ఉందని, ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు తగు సూచనలు వెలువరించాలని సుప్రీంకోర్టులో ముగ్గురు హక్కుల నేతలు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తాము నిరుడు ఈ దశలోనే వలస కూలీల పయనం వారి కడగండ్లను దృష్టిలో పెట్టుకుని వారికి న్యాయం చేయాలని, ముందు వలసకూలీల లెక్కలు తీయాలని ఆదేశించామని అయితే ఇప్పటికీ ఈ ప్రక్రియ నత్తనడక అయిందని ధర్మాసనం ఆక్షేపించింది.