Monday, January 20, 2025

ఎవరికీ పట్టని వలస కార్మికులు

- Advertisement -
- Advertisement -

‘ఎక్కడ జీవితం వుందో అక్కడికే మరణించడానికి వెడతారు వాళ్ళు ఇక్కడికి వాళ్ళు, తిరిగి వాళ్ళ మృత శరీరాలను
మాత్రమే మోసుకు వస్తారు’ గుల్జార్ ఈ ప్రపంచం రెండుగా చీలిపోయి ఉందన్న విషయం, మునుపెన్నటి కన్నా ఎక్కువగా అందరికీ అర్ధం అయింది. సుమారు రెండేళ్ళకు పైగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ పాండమిక్ ప్రబలిన సమయంలోనే లక్షలాది మంది వలస కూలీలు, నెత్తిన మూటలతో, ఆకలి దప్పులకు అలమటిస్తూ, వందల మైళ్ళు పగిలి, నెత్తురోడుతున్న పాదాలతో నడిచి వెడుతున్న దృశ్యాలను, ఇల్లు చేరకనే మరణించిన వాళ్ళని, రైలు పట్టాలపై, రోడ్లపై దిక్కులేని శవాలైన వాళ్ళని, రోడ్లపైనే ప్రసవించిన స్త్రీలను, వాళ్ళ వెంటే నడిచి, నడచి అలసిపోయిన చిన్నిచిన్ని పాదాల పసిపిల్లను మనం చూశాం.

వలస కూలీలు కాక, మిగిలిన ఆ సగం ప్రపంచ జనాభాలో, ఏ కొద్ది మందో తప్ప, ఎంత నిర్దయగా, క్రూరంగా సాటి మనుషుల పట్ల ప్రవర్తించగలరో కూడా ప్రపంచం చూసింది. జీవితం ఎక్కడుందో అక్కడికే మరణించడానికి వెడుతున్న వాళ్ళు ఎవరు? ఎందుకలా వెడుతున్నారు? వాళ్ళున్న చోట వాళ్ళకి మరణం తప్ప జీవితం లేకుండా ఎందుకు పోయింది? నిజానికి మానవజాతి పరిణామక్రమంలో అనేక వలసలు జరిగాయి. తమ ఉనికిని, జీవితాన్ని నిలబెట్టుకోవడం కోసం, అంతకన్నా మెరుగైన జీవితాలను ఆశించి జరిగిన ఆ వలసలు చారిత్రకంగా అనివార్యమైనవి. కానీ, ఇంతటి మానవ వికాసం తరువాత, ఇన్నెన్ని నాగరికతల తరువాత, ఒక మనిషికి తాను పుట్టిన చోటే ఎందుకు సుఖంగా, గౌరవప్రదంగా జీవించగల అవకాశం లేకుండాపోయింది? సంపదల సృష్టికారకులైన శ్రామికులకు, వాటి మీద హక్కు మాట అటుంచి, కనీసం తినేందుకు తిండి, ఉండెందుకు నీడ కూడా లేని స్థితి, ఆ సంపదల అసమ పంపిణీ, సామాజిక అసమానతలు, సామాజిక న్యాయం కొరవడటం కారణంగానే, ఉన్న చోట జీవిక లేక బతుకుతెరువు కోసం కోట్లాది మంది దాదాపు ప్రపంచ జనాభాలో సగం మంది తాము పుట్టిన గ్రామాలను, నగరాలను, దేశాలను వదలి వలసపోతున్నారు.

వలసలు అని వేటిని అంటాం?
వాళ్లు పుట్టిన, సాధారణంగా నివసించే నివాస ప్రాంతాలను వదిలి ఒకే దేశం లోపల, ఇతర ప్రాంతాలకు వెళ్లడం లేదా అంతర్జాతీయ సరిహద్దుల్ని దాటి వేరు దేశాలలో నివాసాలు నేర్పరచుకోవడం, తమని తాము రీలొకేట్ చేసుకోవడం దీన్ని వలసగా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్ నిర్వచిస్తున్నది. ఈ వలసలను అంతర్గత వలసలు, ఎక్స్‌టర్నల్ మైగ్రేషన్ లేదా ఒక దేశం నుండి మరో దేశానికి అంతర్జాతీయంగా వలసపోవడం, స్వచ్ఛంద వలసలు, తాత్కాలిక వలసలు, రివర్స్ మైగ్రేషన్ ఇలా ఉంటాయని అనుకోవచ్చు. ప్రపంచం అంతటా అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం కారణంగా బలవంతపు వలసలు, నిర్వాసితులు కావడం జరుగుతూ వుంది. వలసపోవడం అంటే తామున్న భౌగోళిక ప్రాంతాన్ని వదలడమే కాకుండా తమ బంధు మిత్రులని, చివరికి తమ జ్ఞాపకాలని, సంస్కృతిని, జీవన విధానాన్ని, చివరకు ఆహారపు అలవాట్లను సైతం వదులుకోవాల్సి వస్తుంది. పేదరికం, ఉన్న చోట ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, పంట నష్టాలు, నిరంతరం ఎదుర్కొంటున్న కరువు కాటకాలు మొదలైనవి వలసలకు కారణాలు.

ఇదే కాకుండా మంచి ఉద్యోగాలు, అధిక జీతాలు, అవకాశాలు, మెరుగైన జీవన పరిస్థితులు ఇవి కూడా వేరు వేరు ప్రాంతాలకి వలస వెళ్లడానికి కారణం అవుతాయి. రాజకీయ కారణాలు, అంతర్గత కలహాలు కూడా వలసలకు కారణం. ఆయా ప్రాంతా ల్లోనూ, ఆయా దేశాల్లోనూ ఉండడం వల్ల, తమ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని భావించినప్పుడు, అక్కడి నుంచి జనం వ్యక్తులుగాను, సమూహంగాను వలస పోవల్సి వస్తుంది. పాపులేషన్ డివిజన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఎఫైర్స్ (యు.ఎన్.డి.ఇ.ఎస్.ఎ) ప్రకారం 2020 జులై 1 నాటికి ప్రపంచ వ్యాప్తంగా, అంతర్గతంగా జరుగుతున్న వలసల జనాభా 281 మిలియన్లు. ఐఎల్‌ఒ రిపోర్టు ప్రకారం ఇలా వలస వెళుతున్న జనాభాలో 42% మంది అంటే 164 మిలియన్ల వలస మహిళా కార్మికులున్నారు. 2020 పాపులేషన్ డివిజన్ రూపొందించిన 2020 నివేదిక ప్రకారం వలస వెళుతున్న ప్రతి నలుగురిలో ముగ్గురి వయసు 20 నుండి 64 సంవత్సరాలు మధ్య ఉంది. 41 మిలియన్ల మంది అంతర్జాతీయ వలసల ప్రజల వయసు సుమారు 20 ఏళ్లు. అంతర్జాతీయంగా వలసవెళ్తున్న వారిలో ప్రపంచ వ్యాప్తంగా సగానికి సగం మంది ఆసియా దేశాల నుంచి అంటే భారత దేశం, చైనా ఇంకా సౌత్ ఏషియా దేశాలైన అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళినవారు ఉన్నారు.

ఆ తరువాత మెక్సికో దేశం నుంచి వలస వెళుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. వలసల గురించి భారత ప్రభుత్వం2020 -21 నివేదికను ప్రకటించింది. వలసలు తాత్కాలికంగా, దీర్ఘకాలం, శాశ్వతంగా జరిగేవిగా ఉంటాయని అది అంటుంది. వలస కార్మికులతో పనిచేస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ 2017న విడుదల చేసిన ఒక నివేదికలో ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది మన దేశంలో అంతర్గత వలస వెళుతున్నట్టుగా పేర్కొంది. వ్యవసాయపు పనులులేని కాలంలో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ పనిచేసి, తిరిగి తమ గ్రామాలకు వెళ్లే వాళ్ళ సంఖ్య మన దేశంలో ఎక్కువగానే ఉంటుంది. మన దేశంలో వలసలు వెళుతున్నటువంటి వాళ్ళలో పురుషులు, స్త్రీల మధ్య మరీ అంత వ్యత్యాసం ఏమీ లేదు. ప్రపంచ వ్యాప్తంగా పనిలో ఉన్న మహిళల్లో 63.5% వలస వచ్చిన మహిళలే ఉన్నారు శ్రామిక శక్తిలో. ఈ వలస కార్మికుల్లోనూ 74% మంది సేవా రంగంలోనూ, డొమెస్టిక్ వర్కర్స్‌గా ఇళ్ల పని చేయడంలోను, ఆరోగ్య సేవలు అందించడం, ఆర్థిక రంగంలో, వైజ్ఞానిక, విద్య, ప్రభుత్వపర ఉద్యోగాల్లోనూ కూడా ఉన్నారు. అలాగే, పురుష కార్మికుల కన్నా, మహిళలను పనిలోకి తీసుకోవడానికి కారణం వాళ్ళు తక్కువ వేతనాలకే పని చేయడానికి సిద్ధపడటం. అంటే, చవకగా, శ్రమ దోపిడీ చేసేందుకు ఎక్కువ వెసులుబాటుగా వీళ్ళు ఉండటం.

కాగా వలస వెళుతున్న మహిళా కార్మికుల్లో ఎక్కువ మంది అన్‌స్కిల్డ్ లేబర్‌గా, గృహ కార్మికులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా పని చేస్తున్నారు. ఇలా వస్తున్నటువంటి మహిళల ఎడల హక్కుల ఉల్లంఘన, ఆర్థిక, లైంగిక దోపిడీ సర్వసాధారణం. వాళ్లు ఒంటరిగా వుండటం, ఇతరులపై ఆధాపడాల్సి రావడమూ, నైపుణ్యత లేకపోవడం లాంటి అంశాలను ఆసరా చేసుకొని వాళ్ళ నివాస, పని చేసే స్థలాల్లో చాలా దుర్మార్గమైన దోపిడీ వీళ్ళపై జరుగుతూ ఉంది. అంతిమంగా ఈ పరిస్థితి అసమాన వేతనాలకే కాక, పనుల్లో అసమానత్వానికి, వివక్షకి, లైంగిక దోపిడీకి దారితీస్తోంది. సరైన ఆహారం, విశ్రాంతి లేకుండా పనిస్థలాల్లో లైంగిక వేధింపులకు గురికావడం, అత్యంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో జీవితాలు ఉండడం, అలాగే చట్టబద్ధత చాలామందికి లేకపోవడం వల్ల కూడాఆయా దేశాల్లో స్వేచ్ఛగా తిరగలేక ఒకే ప్రాంతానికి, భయంతో ఒకే చోట, దళారీల నియంత్రణ క్రింద ఉండడం వంటివి వలస కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.

వలస కార్మికులు సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడే పరిస్థితులు వారున్న స్థితి వల్ల కష్టం కావడమే కాకుండా, కార్మిక సంఘాలు కూడా అనేక కారణాల వల్ల ఈ కార్మికుల సమస్యలను పట్టించుకోవాల్సినంత పట్టించుకోవడం లేదు. అనేక మంది వలస కార్మికులు వెళ్ళిన చోటే దయనీయంగా మరణిస్తున్న స్థితిఉంది. 2015 లెక్కల ప్రకారం ప్రపంచంలో వలస వెళ్లిన వాళ్లలో 61,867 వేల మంది వలస కార్మికులు మరణించారు. ఇప్పుడు అంటే 10 ఏళ్ల తరువాత ఈ సంఖ్య మరింత ఎక్కువ. మళ్ళీ తాము పుట్టిన చోటుకు వారి మృత శరీరాలు కూడా రాని, తమ స్వంత నేలకు కూడా చెందని వాళ్ళ జీవితాలు, ఏమి జీవితాలు? దీన్ని చూస్తున్న సమాజం, అది ఎటువంటి సమాజం?

విమల

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News