Monday, January 20, 2025

వలస కార్మికుల వెతలు తీరేనా?

- Advertisement -
- Advertisement -

నగరానికి ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుండి వేలాది మంది కార్మికుల వలస వస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమం కోసం ఇంటర్ స్టేట్ మైగ్రెన్ట్ వర్క్ మెన్ యాక్ట్, 1979 ఉంది. దీనిని ఉల్లంఘించడమే తప్ప అమలు చేసిన రుజువులు లేవు. బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారికి నిర్మాణ, పని స్థలాల్లో నివాస వసతి కల్పించాలి. చౌకధరలతో క్యాంటిన్ ఏర్పాటు చేయాలి. చిన్నపిల్లలకు క్రెచ్‌లు అందుబాటులో ఉంచాలి. కార్మికులకు ఒక పాస్ బుక్ అందించి, అందులో ఆయన పనిలో చేరిన తేదీ, డ్యూటీ వేళలు, పేమెంట్ వివరాలు రికార్డు చేయాలి. నగరంలో వలస కార్మికుల దుస్థితిని, యాజమాన్యాల చట్టాల ఉల్లంఘనల గురించి గత నెలలో హ్యూమన్ రైట్స్ ఫోరమ్, హైదరాబాద్ యూనిట్ ఓ లేఖను కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శికి, కార్మిక శాఖ కమిషనర్‌కి అందజేసింది. భవన నిర్మాణ రంగంలోని వలస కార్మికులు దుస్థితిని అందులో వివరంగా పేర్కొంది.

‘పాలరాతి బొమ్మైనా.. పార్లమెంటు భవనమైనా.. వాడు చుడితేనే శ్రీకారం.. వాడు కడితేనే ఆకారం..’ అని శ్రామికుని విలువ చెబుతూ రాశాడు కవి అలిశెట్టి ప్రభాకర్. ఎంత డబ్బున్నా.. ఎంత యంత్ర సామాగ్రి ఉన్నా మనిషి చేయి పడనిదే ఏ నిర్మాణం పూర్తి అవదు. వేలాది శ్రామికులు ఏళ్ల తరబడి రాళ్లెత్తితేనే తాజ్‌మహల్ నిలబడింది. 12 ఏళ్లు పాటు 50 వేల మంది కార్మికులు చెమటోడ్చితేనే నాగార్జునసాగర్ ఆనకట్ట పూర్తయింది. ఇలాంటి భారీ నిర్మాణాలకు స్థానిక శ్రామికులు సరిపోరు. కట్టడాలు త్వరగా పూర్తవడానికి వలస శ్రామికశక్తి ఎంతో తోడ్పడుతుంది. వలస రెండు వైపులా అనివార్యత. ఉన్న చోట పని దొరకనివారు.. తెరువుని వెదుక్కుంటూ భారంగా ఊరుని వదిలేస్తున్నారు. వారి అవసరాలు అలా తరిమికొడుతున్నాయి.అది దూరాభారాలు లెక్కచేయదు. భాషా, ప్రాంతాలను చూడదు. వలస ఆకలికి.. నిర్మాణానికి మధ్య వారధి.

హైదరాబాద్ వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ ఇంతగా వర్ధిల్లడానికి వలస కార్మికులే అసలైన ఇంధనం. పనిని వెదుక్కుంటూ ఉత్తరాది రాష్ట్రాల నుండి నగరానికి వస్తున్న లక్షలాది బడుగు జీవుల కడుపులను ప్రధానంగా నిర్మాణ రంగమే నింపుతోంది. హైదరాబాద్ నగరంలో 2 వందల కుపైగా లేబర్ అడ్డాలున్నాయి. ఒక్కో అడ్డా వద్ద పొద్దున్నే వందకు పైగా కూలీలు లంచ్ బాక్సులు పట్టుకొని పని కోసం ఎదురుచూస్తుంటారు. సుమారు 60 వేల మంది ఇలా దినవారీ పని కోసం అడ్డా వద్దకు వచ్చి రోడ్డుకిరువైపులా నిలబడి ఎవరు పిలుస్తారా అని దిక్కులు చూస్తుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, పెద్దల ఆరోగ్య అవసరాలు, అప్పులు తీరేందుకు కుటుంబంలో రెక్కలాడేవాళ్లంతా నగరబాట పడుతున్నారు. వీరికి తోడుగా ఉత్తరాది రాష్ట్రాల నుండి కూలీలుగా, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ లాంటి పనివారుగా ఎందరో వస్తున్నారు. అందరూ అరకొర వసతులతో బతుకులు వెళ్లదీస్తూ, వీలైనంత కూడబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. వీరికి కార్మిక చట్టాల ద్వారా ఎలాంటి వసతుల కల్పన జరగడం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

నిజానికి మన దేశంలో సకల సమస్యల పరిష్కారానికి చట్టాలు ఉన్నాయి. దౌర్భాగ్యమేమిటంటే అవి పుస్తకాల్లోని ఉంటాయి. వాటిని అమలు చేసేందుకు తగిన యంత్రాం గం ఉండదు. ఉన్న మేరకైనా విధులు సక్రమంగా నిర్వహించరు. యాజమాన్యాలతో లాలూచిపడి సొంత లాభం చూసుకుంటారు. మీ మేలు కోసం మేమున్నామని కార్మిక శాఖ కూలీల భుజం తట్టిన దాఖలాలు కనిపించవు. కనీస వేతన చట్టం, కూలీలకు పనిచోట సౌకర్యాల కల్పన లాంటి అత్యవసరాలను కూడా పట్టించుకొనే నాథుడులేడని శ్రామికుల దుస్థితే తెలుపుతోంది. చట్టప్రకారం అన్ని కల్పిస్తే యాజమాన్యాలకు వచ్చే లాభాలు తగ్గుతాయి. ఎంతో కొంత అధికారులకు ముట్టజెబితే సరిపోతుంది అనే భావన సర్వత్రా ఉంది. అధికారులు బిల్డర్లకు వత్తాసుగా ఉండకుండా కార్మికులకు న్యాయం చేస్తే దేశంలో సంపద పంపిణీ సక్రమంగా జరుగుతుంది. పనివారల జీవితాలు కూడా మెరుగవుతాయి. వారి కొనుగోలుశక్తి పెరిగి వాణిజ్య, పారిశ్రామిక రంగాలు బలపడతాయి. అన్ని విధాలుగా చట్టాల అతిక్రమణ వల్లే మన దేశంలో 10% కుటుంబాల వద్ద 90% సంపద కూడి మూలుగుతోంది. ప్రపంచ కుబేరుల జాబితాలో 100 లోపు ధనవంతుల్లో మనవారు ఒక్కరు కూడా లేనప్పుడే దేశం బాగుపడుతుంది. కార్మికులు సృష్టించిన సంపదలో వారికి కూడా న్యాయమైన పాలు లభిస్తుంది.

నగరానికి ఒడిశా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుండి వేలాది మంది కార్మికుల వలస వస్తున్నారు. వలస కార్మికుల సంక్షేమం కోసం ఇంటర్ స్టేట్ మైగ్రెన్ట్ వర్క్ మెన్ యాక్ట్, 1979 ఉంది. దీనిని ఉల్లంఘించడమే తప్ప అమలు చేసిన రుజువులు లేవు. బయటి ప్రాంతాల నుంచి వచ్చినవారికి నిర్మాణ, పని స్థలాల్లో నివాస వసతి కల్పించాలి. చౌకధరలతో క్యాంటిన్ ఏర్పాటు చేయాలి. చిన్నపిల్లలకు క్రెచ్‌లు అందుబాటులో ఉంచాలి. కార్మికులకు ఒక పాస్ బుక్ అందించి, అందులో ఆయన పనిలో చేరిన తేదీ, డ్యూటీ వేళలు, పేమెంట్ వివరాలు రికార్డు చేయాలి.

నగరంలో వలస కార్మికుల దుస్థితిని, యాజమాన్యాల చట్టాల ఉల్లంఘనల గురించి గత నెలలో హ్యూమన్ రైట్స్ ఫోరమ్, హైదరాబాద్ యూనిట్ ఓ లేఖను కార్మిక, ఉపాధి శాఖ ముఖ్య కార్యదర్శికి, కార్మిక శాఖ కమిషనర్‌కి అందజేసింది. భవన నిర్మాణ రంగంలోని వలస కార్మికులు దుస్థితిని అందులో వివరంగా పేర్కొంది. కనీస వేతన చట్టం అమలు కావడమే లేదు. ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా లేబర్ ఆఫీసర్ తనిఖీ చేయలేదని, అక్కడి రికార్డులే చెబుతున్నాయని ఆ లేఖలో ఉంది. నగరంలో నిర్మాణ రంగం వృద్ధి చెందుతున్నవేళ వలస కార్మికుల సంక్షేమం ఆ రంగానికే ఆరోగ్యకరం. చట్టంలో ఉదహరించిన సదుపాయాలతో ప్రభుత్వం వారి బాగోగులు పట్టించుకుంటేనే అది సాధ్యం.

మన రాష్ట్రంలో నిర్మాణ రంగ కార్మికులు కోసం ప్రత్యేకంగా ‘తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కంస్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ ఉంది. నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, సౌకర్యాలు గల వసతి, ఆరోగ్య సంరక్షణ, ప్రమాదాల వేళ సదుపాయాల ఏర్పాట్లు చూడడం దీని బాధ్యత. 1996లో ఏర్పడిన యాక్ట్ ప్రకారం దీనిని సెప్టెంబర్ 2014లో ఏర్పాటు చేశారు. కార్మిక శాఖా మంత్రి దీనికి చైర్మన్‌గా ఉంటారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి అధీనంలో ఆ శాఖ ఉంది. ఈ బోర్డులో ఇద్దరు కార్మిక ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండాలి. కాని ఆ నియామకం జరిగినట్లు లేదు. సుమారు లక్షన్నర కార్మికుల పేర్లు, వివరాలు ఇందులో నమోదు అయ్యాయి.

ఈ బోర్డు విధివిధానాల ప్రకారం కార్మికుల పని సమయంలో మరణిస్తే రూ. 6 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. అంగవైకల్యం పొందినవారికి రూ. 5 లక్షలు ఇవ్వాలి. పెళ్లి ఖర్చులకు రూ. 30 వేలు, ప్రసూతికి రూ. 30 వేలు ఇవ్వాలి. ఇలా కార్మికులు సంక్షేమం కోరుతూ వారి ప్రతి చిన్న అవసరాన్ని తీర్చేందుకు ఇందులో నియమాలున్నాయి. ఈ నిధి కోసం నిర్మాణం జరుగుతున్న ప్రాజెక్టుల పెట్టుబడు నుండి 1% పన్నుగా వసూలు చేస్తారు. గత ఐదేళ్లలో ఈ రూపంలో రూ. 1400 కోట్లు జమ కాగా, రూ.400 కోట్లు కార్మికులు సంక్షేమం కోసం వెచ్చించినట్లు తెలుస్తోంది. కార్మికులు కోసం ఈ బోర్డు లేబర్ అడ్డాలను నిర్మించి విశ్రాంతి, టాయిలెట్ వసతులు కల్పించాలి. కనీసం స్త్రీలకు కూడా ఈ వసతులు ఏర్పాటు చేయకపోవడం ఘోరమైన విషయం. చాలా మంది ఫుట్ పాత్‌లపై పడుకొని బస్ స్టాండ్‌ల వద్ద ఉండే టాయిలెట్లను వాడుతున్నారు. ఖాళీజాగాలో చిన్న డేరా వేసుకొని వంట చేసుకొనేవారు నగరంలో ఎందరో కనబడతారు. మరోదారి లేక పుట్టిన ఊరు వదిలిపెట్టి పొట్ట చేతపట్టుకొని వచ్చినవాడు మన అతిథిగా భావించి కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వ విధి.

బి.నర్సన్ 9440128169

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News