Sunday, November 17, 2024

బంగ్లాదేశ్ నుంచి వలసలు తప్పవా?

- Advertisement -
- Advertisement -

మొత్తం ఈశాన్య ప్రాంతం, ముఖ్యంగా అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరమ్ పొరుగునున్న ఉత్తర బెంగాల్‌లోని చికెన్ నెక్ కారిడార్ ద్వారా భారత భూభాగంతో కన్నా ఎక్కువ సరిహద్దులు పంచుకుంటున్నాయి. ఏ రాజకీయ పార్టీకీ అనుబంధితం కాని విద్యార్థుల సారథ్యంలో సాగిన ఉధృత ఉద్యమం ఫలితంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని దేశం వదలి పారిపోయిన తరువాత ఇటీవల చోటు చేసుకున్న సాంఘిక, రాజకీయ పరిణామాలను ఈశాన్య ప్రాంత ప్రజలు ఆసక్తితో గమనిస్తున్నారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరా టం తరువాత మాదిరిగా ఆ రాష్ట్రాల్లోకి శరణార్థుల వలస పెద్ద ఎత్తున జరగవచ్చుననే ఆందోళన కూడా ఉన్నది. షేక్ హసీనాకు వ్యతిరేకంగా విజయవంతంగా ఉద్యమానికి నాయకత్వం వహించిన విద్యార్థులు ఈ ఉద్యమాన్ని బంగ్లాదేశ్ రెండవ స్వాతంత్య్ర పోరాటంగా అభివర్ణించారు.
హసీనా ప్రభుత్వం పతనం తరువాత ఈ పర్యాయం కూడా భారత్‌లో ప్రవేశానికి అనేక మంది ప్రజలు, ముఖ్యంగా హిందువులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, గట్టి సరిహద్దు భద్రత ఏర్పాట్లు బంగ్లాదేశ్ నుంచి అటువంటి వలసను అడ్డుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థులు నెల రోజుల పాటు నిరసన ప్రదర్శనలు సాగించడంతో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. 1971 స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రజల వారసులకు 30% సివిల్ సర్వీస్ ఉద్యోగాలను ఆమె ప్రభుత్వం రిజర్వ్ చేసింది. ప్రభుత్వ అణచివేత చర్యలు, అధికార అవామీ లీగ్ పార్టీ తో సంబంధం ఉన్న వర్గాల దాడుల పర్యవసానంగా నిరసనలు హింసాత్మకంగా మారాయి.

ఆగస్టు 4, 5 తేదీల్లో ప్రజ్వరిల్లిన హింసాత్మక సంఘటనలు షేక్ హసీనా ప్రభుత్వ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికాయి. నాయకుడు లేని కళాశాల విద్యార్థుల ఉద్యమం షేక్ హసీనాకు, అధికారంలో ఉన్న ఆమె పార్టీకి సవాల్ విసిరింది. ముందుగా ప్రకటించిన తేదీలు, వేదికలతో వారు ర్యాలీ లు, పాదయాత్రలు నిర్వహించారు. స్వల్ప కాలంలోనే ఆ యువ విప్లవకారులు వీధుల్లో ప్రవేశించడంతో దేశం దృష్టిని ఆకర్షించారు. దానితో హసీనా పారిపోవడానికి హెలికాప్టర్ ఎక్కవలసి వచ్చింది. ఒక దశాబ్దంపైగా మాజీ ప్రధాని నేతృత్వంలోని రాజకీయ ప్రతిపక్షం ప్రయత్నించి, వరుసగా విఫలమైన పరిణామాన్ని వారు సాధించారు.

భవిష్యత్ సంస్కరణలపై ఏవో కొన్ని వాగ్దానాలతో సరిపోయే పరిస్థితిని ప్రధాని చేసిన అర్థం లేని వ్యాఖ్యలు, ఆమె భద్రత బలగాల క్రూర అణచివేత చర్యలు మరింత ప్రజ్వలింప చేశాయి. హింసాత్మక సంఘటనలు సాగిస్తున్నవారు విద్యార్థులు కారని, దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులని ఆమె అన్నారు. నిరసనకారులను అవామీ లీగ్ ప్రభుత్వం రజాకార్లుగా పేర్కొన్నది. పాకిస్తానీ దళాలకు సహకరించేవారిని అభివర్ణించేందుకు హసీనా ప్రభుత్వం రజాకార్ పదాన్ని వాడుతుండేది. హింసాకాండ, లూటీలు, గృహదహనాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలపై ముఖ్యంగా ఇస్లామిక్ రాడికల్ శక్తులు, పాకిస్తాన్, చైనా కారణంగా భారతీయ మీడియాలో ఒక వర్గం దృష్టి కేంద్రీకరించినప్పటికీ షేక్ హసీనా దేశం వదలి పారిపోయిన తరువాత రోడ్లపై భారీ సంఖ్య లో జనం సమీకృతం కావడం, వారి ఆనందాతిరేకాలు ప్రభుత్వంపై ప్రజలు అప్పటికప్పుడు వ్యక్తం చేసిన ఆగ్రహావేశాలను సూచిస్తున్నాయి.

పరిస్థితులు తనకు వ్యతిరేకంగా మారుతున్న విషయాన్ని హసీనా ప్రభుత్వం పసిగట్టలేకపోయింది. దేశంలో అంతర్గత వివాదాలు, సాంఘిక సమస్యల పరిష్కారంలో హసీనా ప్రభుత్వం దుందుడుకుతనం, మొండిపట్టుదల దేశంలో హింసాకాండ ప్రజ్వలనకు, పరిస్థితి విషమించడానికి కారణం అయ్యాయి.
హసీనా ప్రభుత్వ పతనమైన వెంటనే కొన్ని ఇస్లామిక్ మూఢశక్తులు మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై బెదిరింపులు, దాడులు సాగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, విద్యార్థి నాయకులు, స్థానిక ప్రజలు మైనారిటీల సంరక్షణకు ముందుకు వచ్చారు. మనం భారత్‌ను పరికిస్తే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కింద ప్రతి రోజు దేశవ్యాప్తంగా మైనారిటీలపై అటువంటి దాడులు జరుగుతుండడం కనిపిస్తుంది. హసీనాను హిందువుల రక్షకురాలుగా, భారత్ అనుకూల నేతగా, ఆమెకు ముందు ప్రధాని పదవి లో ఉన్ననేతను మైనారిటీ వ్యతిరేకిగా, భారత్ అనుకూలవతిగా కాకుండా, భారత వ్యతిరేకిగా, భారతీయ నేతలు పరిగణించడం దౌత్యపరంగా విజ్ఞతతో కూడిన చర్య కాదు. ఎందుకంటే బంగ్లాదేశ్ భౌగోళిక, రాజకీయ రక్షణ, భద్రత దృష్టా ఆ దేశంతో భారత్‌కు స్నేహపూర్వక సంబంధాలు కీలకం. బంగ్లాదేశ్ కేవలం ఏదో పొరుగు దేశం కాదు.

అది భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామి, సరిహద్దు భద్రతకు, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలతో సరిహద్దు భద్రతకు కీలకమైన సన్నిహిత మిత్రదేశం. రెండు దేశాల మధ్య 4096 కిలోమీటర్ల నిడివైన సరంధ్రమైన సరిహద్దు ఉన్నది. భారత ఈశాన్య ప్రాంత రాష్ట్రాల నుంచి సాయుధ తిరుగుబాటు వర్గాలు సురక్షిత ప్రదేశం కోసం బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించడానికి అది తేలికగా వీలు కల్పిస్తుంది. నోబెల్ గ్రహీత, బంగ్లాదేశ్‌లో ప్రస్తుత మధ్యంతర ప్రభుత్వ ముఖ్య సలహాదారు ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ మౌలికవాది కారు. ఆయన తమ దేశంలో ఇస్లామిక్ రాడికల్స్ ఆధిపత్యాన్ని అనుమతించబోరని ఆశించాలి. బంగ్లాదేశ్‌కు వచ్చి, హసీనా ప్రభుత్వ పతనానంతరం హిందువులు ఎలా బంగ్లాదేశ్‌లో జీవిస్తున్నారో నివేదించవలసిందని భారతీయ జర్నలిస్టులను ప్రొఫెసర్ యూనస్ ఆహ్వానించారు. షేక్ హసీనా హయాంలో నేను చాలా సార్లు బంగ్లాదేశ్‌ను సందర్శించి, ఎదురుగా కనిపిస్తున్న కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు, వెడల్పైన రోడ్లు, పద్మా నదిపై వంతెన నిర్మాణం మొదలైనవి స్వయంగా గమనించాను.

అయితే, గడచిన రెండు, మూడు సంవత్సరాల్లో ప్రభుత్వంలోని ప్రతి విభాగంలో పెచ్చుమీరిన అవినీతి పనులకు స్థానిక జర్నలిస్టులతో సహా సాధారణ ప్రజలు హసీనా ప్రభుత్వాన్ని బాహాటంగా విమర్శించసాగారు. ఇక్కడ విడ్డూరమేమంటే అవినీతి కేసుల్లో దోషిగా నిర్ధారణ జరిగినందుకు ప్రధాన ప్రతిపక్షం బిఎన్‌పి నేత ఖాలెడ్ జియాను హసీనా ప్రభుత్వం జైలుపాలు చేయడమే కాకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించడం. ఈ రచయిత అధ్యక్షుడుగా ఉన్న, 2019లో రెండు దేశాల జర్నలిస్టులతో ఏర్పాటైన ఇండో బంగ్లాదేశ్ జర్నలిస్ట్ ఫోరమ్ సరిహద్దుకు రెండు వైపుల పలు సమావేశాలు నిర్వహించింది. ద్వైపాక్షిక సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తూ అభిప్రాయాల మార్పిడికి, రాజకీయ విమర్శలకు మించి సమస్యలపై మెరుగైన అవగాహన కోసం ప్రజల మధ్య ముఖాముఖికి వీలు కల్పించడం వాటి లక్షం.

భారత్‌లోకి బంగ్లాదేశీ జాతీయుల అక్రమ చొరబాటు, నదీజలాల పంపకం, భారత సరిహద్దు భద్రత బలగాలు బంగ్లాదేశీ పౌరులను హతమార్చడం, భారత్‌తో బంగ్లాదేశ్ వాణిజ్య లోటు వంటి వివాదాస్పద అంశాలను వాస్తవిక దృక్పథంతో రెండు దేశాల జర్నలిస్టు చర్చించారు. రెండు వైపుల ఎవరు అధికారంలో ఉన్నా పరస్పర మైత్రీబంధం విఘాతాన్ని బంగ్లాదేశ్, భారత్ భరించజాలవని రెండు దేశాల జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు. 1996 ఎన్నికల్లో తమ అవామీ లీగ్ పార్టీ గెలిచిన తరువాత షేక్ హసీనా మొదటి సారిగా బంగ్లాదేశ్ ప్రధాని అయ్యారు. అధికారంలో ఆమె రెండవ విడత 2009లో మొదలైంది. ఆమె రెండవసారి 2009లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాదేశ్ భారీ స్థాయిలో ఆర్థిక పురోగతి సాధించిందనడం నిజమే. అయితే, 2018 సార్వత్రిక ఎన్నికల తరువాత దేశం ఆర్థిక మాంద్యానికి గురైంది. కరోనా మహమ్మారి కూడా దేశం ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రం చేసింది. కొన్ని కీలక రంగాల్లో పురోగతి సాధించినప్పటికీ దేశంలో ప్రజాస్వామ్యం లోటు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల కారణంగా బంగ్లాదేశ్ ప్రధాన పారామిలిటరీ దళం రాపిడ్ ఏక్షన్ బెటాలియన్ (ఆర్‌ఎబి)పైన, దాని ప్రస్తుత, పూర్వపు అధికారులపైన 2021లో యుఎస్ ఆర్థిక శాఖ ఆంక్షలు విధించింది. 2023లో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులు కావడానికి ప్రతిపక్ష సభ్యులను దోషులుగా నిర్ధారించేందుకు జాతీయ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ అధికారులు అణచివేత చర్యలను కఠినతరం చేశారని ప్రతిపక్షం ఆరోపించింది.

బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాన్ని సంతుష్టి పరచేందుకు భారత ప్రభుత్వం సకారాత్మక దృక్పథాన్ని కనబరచింది. ప్రధాని నరేంద్ర మోడీ బంగ్లాదేశ్ మధ్యంతర అధినేత మొహమ్మద్ యూనస్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. అయినప్పటికీ గడచిన 15 సంవత్సరాలుగా షేక్ హసీనాకు, ఆమె పార్టీకి మద్దతు కొనసాగించినందుకు బంగ్లాదేశ్‌లో వ్యక్తం అవుతున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు భారత్ కొంత వ్యవధి తీసుకున్నది. భారత్ ఆధిపత్య యత్నాన్ని ప్రతిఘటించడంలో మాల్దీవులు, నేపాల్ సరసన బంగ్లాదేశ్ చేరడంతో భారత ‘పొరుగుదేశం ముందు’ విధానానికి మరొక ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఆకట్టుకోవడానికి భారత్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా, దౌత్యపరమైన నైపుణ్యంతో వ్యవహరించవలసి ఉంటుంది. ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా పలుకుబడిని భారత్ అలక్షం చేయరాదు. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంతో భారత్ సంబంధానికి తిరిగి రూపకల్పన చేయడానికి భారత ‘పొరుగు దేశం ముందు’ విధానంలో ప్రాథామ్యం కావాలి.

గీతార్థ పాఠక్
ఈశాన్యోపనిషత్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News