ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరు సరస్సుకు లక్షలాది వలస పక్షులు చేరుకుంటున్నాయి. ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చలికాలం అంతా అవి ఇక్కడే ఉండనున్నాయి. అటవీ శాఖ అధికారుల ప్రకారం గ్లాసీ ఇబీస్, ఓపెన్ బిల్లుడ్ స్టోర్క్, పర్పల్ మూర్హెన్ , పెయింటెడ్ స్టోర్క్ రకాల పక్షులు ఈ సీజన్‌లో ఇక్కడ గూడుకట్టుకోడానికి వస్తున్నాయి. వాటిలో చాలా వరకు రష్యా, సైబీరియాల నుంచి ఇక్కడికి వస్తున్నాయి. అక్కడ ఇప్పుడు చలి తీవ్రంగా ఉండడం వల్ల భారత్‌కు వస్తున్నాయి.
రానున్న కొన్ని వారాల్లో మరిన్ని కొంగలు కొల్లేరుకు రాబోతున్నాయి. చలి కాలంలో కొంగలు ఇలా రష్యా, యూరొప్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావడం చాలా సాధారణ విషయం. అవి ఇక్కడ గూడుకట్టి, సంతానోత్పత్తిని చేస్తుంటాయి. అందుకు ఆ కొంగలు వేలాది కిలో మీటర్లు ప్రయాణించి ఇక్కడికి వస్తుంటాయి. ముఖ్యంగా అవి రష్యా, సైబీరియా, యూరొప్ దేశాల నుంచి వస్తుంటాయి.
కొల్లేరు సరస్సు కృష్ణ, గోదావరి నదుల మధ్య ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సు. కొంగలకు ఆహారంగా కావలసిన చేపలు ఇక్కడ లభిస్తుంటాయి. వాటి బ్రీడింగ్‌కు కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. “ఇప్పటికే ఆరు లక్షల కొంగలు కొల్లేరు చేరుకున్నాయి. వీటి సంఖ్య రాగల కొన్ని రోజుల్లో 10 లక్షలకు చేరుకోనుంది. ఇలా వలస వచ్చే పక్షుల గురించి స్థానిక ప్రజలకు ప్రభుత్వం తెలియజెప్పుతోంది. పర్యావరణ సంతుల్యాన్ని కాపాడలని చెబుతోంది. కొంగలను వేటాడే వారిపై నిఘా పెట్టడం కూడా ఫలితాలనిస్తోంది” అని ఏలూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎస్‌వికె కుమార్ తెలిపారు.
వలస కొంగలు వస్తుండడంతో కొల్లేరుకు పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొల్లేరు సరస్సును ‘వన్యప్రాణుల అభయారణ్యం’గా ప్రకటించారు. కొంగలు పిల్లలను పొదిగాక… ఎండా కాలం మొదలవ్వగానే తిరిగి తమ స్వస్థలానికి వెళ్లిపోతాయి. కొల్లేరు సరస్సు కూడా రామ్‌సర్ ప్రదేశాలలో ఒకటి. ‘రామ్‌సర్ కన్వెన్షన్ ’ అనేది చిత్తడి నేలల పరిరక్షణ, సుస్థిర ఉపయోగానికి ఉద్దేశించిన అంతర్జాతీయ ఒప్పందం. 1971లో ఇరాన్‌లోని రామ్‌సర్ నగరంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.