Saturday, November 23, 2024

కాంగ్రెస్‌కు మిలింద్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

ముంబై : సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి మిలింద్ దేవ్‌రా ఆదివారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను ప్రగతి పథంలో కలిసినడవాలనుకుంటున్నట్లు తెలిపిన మిలింద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సారధ్యపు శివసేనలో తాను చేరుతున్నట్లు ప్రకటించారు. ఆదివారమే మణిపూర్‌లో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రను ఆరంభించిన నేపథ్యంలో మిలింద్ కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు ప్రకటించడం పార్టీకి షాక్‌గా మారింది. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన వెంటనే మిలింద్ సిఎం ఏక్‌నాథ్ షిండే అధికార నివాసం వర్షాకు వెళ్లారు. ఆయనతో మాట్లాడిన తరువాత శివసేన షిండే కండువా వేసుకుని బయటకు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తో దేవ్‌రా కుటుంబానికి 55 ఏండ్ల అనుబంధం ఉంది. ఇది ఇప్పుడు తెగిపోతోందని మిలింద్ ప్రకటించారు. భారత్ జోడో యాత్ర ఆరంభం సమయంలోనే ముంబైలో రాజీనామా నిర్ణయం ప్రకటించారు. దేవ్‌రా ముంబై సౌత్ ఎంపిగా గతంలో వ్యవహరించారు. తాను కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన సామాజిక మాధ్యమంలో తెలిపారు. ఈ ఘట్టం తన రాజకీయ గమనంలో అత్యంత కీలకమైనదని, పార్టీని వీడుతున్నానని, తన కుటుంబానికి కాంగ్రెస్‌కు ఉన్న చిరకాల బంధాన్ని తెంచుకోవడం బాధాకరమే , అయితే ఇది అనివార్యంగా తీసుకున్న నిర్ణయం అని తెలిపారు.

ఇంతకాలం తనకు సహకరించిన నేతలు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్పారు. ఆ తరువాత ఆయన స్థానిక ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయానికి వెళ్లిపూజలు నిర్వహించారు. 47 సంవత్సరాల దేవ్‌రా తమ ప్రకటన వెలువరించినప్పుడు తొలుత పార్టీ వీడటానికి కారణాలు తెలియచేయలేదు. ఆ తరువాత పార్టీ వ్యవహారశైలిని తప్పుపడుతూ మాట్లాడారు. తాను దేశ ప్రగతి పథంలో పాలుపంచుకోవాలనుకుంటున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం పారిశ్రామికవేత్తలను దూషించడమే పనిగా పెట్టుకుందని, దీని వల్ల తలెత్తే సంకేతాలను పట్టించుకోవడం లేదన్నారు. సౌత్ ముంబైలోని రామాలయం నివాసం నుంచి బయలుదేరిన వెంటనే ఆయన తమ సంచలన ప్రకటన వెలువరించారు. దేవ్‌రా ఇటీవలి కాలంలో పార్టీ పట్ల అసంతృప్తిగా ఉంటున్నారు. ఆయనను ఎఐసిసి సంయుక్త కోశాధికారిగా పార్టీ ప్రకటించింది. అయితే తాను కోరుకుంటున్న సౌత్ ముంబై పార్లమెంటరీ స్థానం తమకు కావాలని ఇండియా కూటమిలోని ఉద్ధవ్ థాకరే వర్గం పట్టుపట్టడం, దీనికి కాంగ్రెస్ నాయకత్వం కూడా మొగ్గు చూపడం వంటి పరిణామాలతో మిలింద్ ఈ రాజీనామా నిర్ణయాన్ని అత్యంత కీలక దశలో వెలువరించారు.

దేవ్‌రా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఓ దశల ముంబై కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు. రాహుల్‌కు సన్నిహితుడుగా పేరొందారు. పార్టీ దిగ్గజనేత దివంగత మురళి దేవ్‌రా కుమారుడే మిలింద్ దేవ్‌రా. ఆయన రాజీనామా తరువాత మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఈ పరిణామం దురదృష్టకరమని స్థానిక నేతలు తెలిపారు. మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు నానా పటోలే మాట్లాడుతూ బిజెపి చేతబడి ఇదని విమర్శించారు. యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎత్తుగడ అని, అయినా దేవ్‌రా రెండుసార్లు ఓడిన అభ్యర్థి అని స్పందించారు. ఆయన నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపదని అన్నారు. ముంబై సౌత్ సీటు కారణంగానే మిలింద్ రాజీనామా చేశారనే వార్తలపై ఉద్ధవ్ శివసేన నేత సంజయ్ రౌత్ మాట్లాడారు. తాము ఈ సీటును కాంగ్రెస్‌కు వదిలేది లేదని స్పష్టం చేశారు.
సంచలన వార్తకు మోడీ వ్యూహం : కాంగ్రెస్
రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రను ఎదుర్కొనేందుకే ఇప్పుడు అదును చూసుకుని మిలింద్‌తో రాజీనామా చేయించారని కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇదంతా కూడా ప్రధాని మోడీ నిర్థారిత చర్య అని, అవసరం అయిన సమయంలో తమకు అనుకూల వార్తలు వెలువరించే నిర్వాహక బృందం మోడీ ఆదేశాల మేరకు వ్యవహరించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన రాజీనామాతో జరిగేదేమీ లేదు, రాహుల్ యాత్రపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడబోదని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News