ప్రజా తీర్పును కాలరాసి మయన్మార్ సైనిక నియంతలు మరోసారి దేశాధికారాన్ని తమ ఇనుప బూట్ల కిందికి తెచ్చుకొని రేపటికి రెండు నెలలవుతుంది. మిగతా ప్రపంచమంతా ప్రేక్షక పాత్ర పోషిస్తుండగా అక్కడి ప్రజానీకం మాత్రం సైనిక పాలకుల తుపాకులకు ఎదురు వెళ్లి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం వీధి పోరాటాలు సాగిస్తున్నారు. మొన్నటి వారాంతపు దుర్మరణాలను కలుపుకుంటే ఈ సమరంలో ఇంత వరకు దాదాపు 500 మంది ప్రాణాలర్పించినట్టు అధికారిక సమాచారం. గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల ఫలితాలను గౌరవించి అంగ్‌సాన్ సూకీ పార్టీ నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీకి అధికార పగ్గాలను అందజేయాలని కోరుతూ ప్రజలు పోరాడుతున్నారు. బలగాల కాల్పుల్లో మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నప్పటికీ వారి పోరాట దీక్ష సడలకుండా బలపడుతుండడమే ఆనందాశ్చర్యాలు కలిగించే అంశం. అణచివేతను ఎదిరించే చైతన్యం పుంజుకున్న ప్రజలను ఎవరూ ఆపలేరని మయన్మార్ తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. అంతర్జాతీయ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఐక్యరాజ్య సమితి వంటి సువ్యవస్థిత సంస్థలున్నప్పటికీ నిరంకుశ శక్తుల ముష్కర బలానికి ప్రజా కంఠం బలవుతూ రక్తమోడుతుంటే ఆదుకోలేకపోతున్న దుస్థితి ఇప్పుడు మయన్మార్‌లో కళ్లకు కడుతున్నది. జనం గుమికూడరాదన్న కొత్త నియంతల ఆజ్ఞను మయన్మార్ ప్రజలు బాహాటంగా ఉల్లంఘిస్తున్నారు.
విదేశీ రాయబార కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. గతంలో మాదిరిగానే సైనిక నియంతలు వాక్ స్వాతంత్య్రాన్ని అణగదొక్కారు. ఇంటర్‌నెట్‌కు ఉరి బిగించారు. 1948లో బ్రిటిష్ పాలకుల నుంచి స్వాతం త్య్రం పొందిన బర్మా (మయన్మార్) 1962 నుంచి 2011 వరకు 49 సంవత్సరాలు పాటు కఠోర సైనిక పాలన కింద మగ్గింది. ఆ తర్వాత ఏర్పడిన ప్రజాస్వామ్య వ్యవస్థకు కూడా సైనిక సంకెళ్లు కొనసాగుతూనే వచ్చాయి. ఎక్కడైనా సైన్యం విరుచుకుపడదలిస్తే ముందుగా ఎత్తి చూపేది ఎన్నికలనే. 1971లో తూర్పు పాకిస్థాన్ మీద పాక్ సైన్యం ఉక్కు పాదం మోపడానికి ముందు అక్కడ ఎన్నికల ఫలితాలను తప్పుపట్టింది. అలాగే అనేక దేశాల్లో ప్రజల తీర్పును గౌరవించడం బొత్తిగా ఇష్టం లేకనే సైనిక శక్తులు దేశహితం పేరుతో అధికార పగ్గాలు చేపడుతుంటాయి. గత నవంబర్‌లో మయన్మార్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అంగ్‌సాన్ సూకీ పార్టీ అఖండ విజయం సాధించగా దానిని తప్పుపట్టి ఆ పార్లమెంటు కొలువు దీరవలసి ఉన్న ఫిబ్రవరి 1 న తాజా సైనిక తిరుగుబాటు జరిగింది. అమెరికా, బ్రిటన్ వంటి ప్రజాస్వామ్య దేశాలు మయన్మార్ పరిణామాలను తరచూ ఖండిస్తున్నాయి.
అమెరికా ఒక మాదిరి ఆంక్షలను కూడా విధిస్తున్నది. కాని మయనార్‌తో వాణిజ్యాది సంబంధాలను దృష్టిలో పెట్టుకొని అక్కడి సైనిక పాలకులకు కోపం తెప్పించ రాదనే దృష్టితో ఆసియా దేశాలు ఈ పరిణామాలను తీవ్రంగా తీసుకోడం లేదనిపిస్తున్నది. అందుకే భారత్ సహా ఏ ఒక్క ఆసియా దేశమూ మయన్మార్ పరిణామాలను ప్రజాస్వామిక చైతన్యంతో తీవ్రంగా ఖండించలేకపోతున్నాయి. ఆగ్నేయాసియా దేశాల సంఘం ‘ఏసియాన్’ దీనిని మయనార్ ఆంతరంగిక వ్యవహారంగా పరిగణించడం గమనించవలసిన విషయం. చైనా ఎప్పటి మాదిరిగానే సైనిక పాలకులకు పరోక్ష మద్దతును ఇస్తున్నట్టు స్పష్టపడుతున్నది. పరిస్థితులను చక్కదిద్దుకోవాలని మయన్మార్ నాయకత్వానికి ఉచిత సలహా ఇచ్చి ఊరుకోడంలోనే దాని కపటం బోధపడుతుంది. భారత్ కూడా ఆందోళన వెలిబుచ్చడంతో సరిపుచ్చింది. అదే సమయంలో మయన్మార్ నుంచి వస్తున్న శరణార్థుల విషయంలో ప్రధాని మోడీ ప్రభుత్వం కఠిన వైఖరి తీసుకున్నట్టు బోధపడుతున్నది. వారికి ఆశ్రయం ఇవ్వరాదని సరిహద్దు ఈశాన్య రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు సమాచారం.
నిరసన ప్రదర్శకులు కనిపిస్తే కాల్చేయాలని నియంతలు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయలేక మయనార్ నుంచి కొందరు పోలీసులు కూడా మన సరిహద్దు రాష్ట్రాలకు శరణార్థులుగా వచ్చారు. వారిని తిరిగి అప్పగించాలన్న మయన్మార్ నియంతల అభ్యర్థనను మన్నించాలన్నది మోడీ ప్రభుత్వం ఆంతర్యంగా కనిపిస్తున్నది. శరణార్థుల విషయంలో మానవతా దృష్టితో వ్యవహరించాలని నిర్ణయించుకున్న మిజోరాం వంటి రాష్ట్రాలకు ప్రధాని మోడీ ప్రభుత్వం వైఖరి మింగుడు పడడంలేదు.మయనార్ ప్రజల్లో కూడా ఉండవలసినంత ఐక్యత కనిపించడం లేదు. ఇటీవల అక్కడి నుంచి రోహింగ్యా ముస్లింలను కట్టుబట్టలతో తరిమివేసినప్పుడు అంగ్‌సాన్ సూకీ కిమ్మనకపోడం ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రియులను కష్టపెట్టింది. ఇప్పుడు అక్కడి మైనారిటీలు సైనిక పాలనను వ్యతిరేకించడంలో ప్రధాన స్రవంతి ప్రజలతో కలిసి అడుగేయడం లేదు.అయినా మయన్మార్ ప్రజల వీరోచిత ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం వీలైనంత త్వరగా విజయవంతం కావాలని కోరుకుందాం.