సూకీతో సహా పలువురు నేతల అరెస్టు
నేపీటా(మయన్మార్): ఏడాది పాటు దేశాన్ని తమ అధీనంలో ఉంచుకోవడానికి సైన్యం చర్యలు చేపట్టినట్లు మయన్మార్ సైనిక టెలివిజన్ సోమవారం ప్రకటించింది. మరోపక్క ఆంగ్ శాన్ సూకీతోసహా పలువురు కీలక రాజకీయ నేతలను సైన్యం అదుపులోకి తీసుకుంది. దేశంలో అత్యవసర పరిస్థితుల కాలంలో ఏడాది పాటు సైనిక పాలన ఉండేందుకు సైన్యం రూపకల్పన చేసిన రాజ్యాంగం అనుమతిస్తోందని బర్మా సైన్యానికి చెందిన మయావాది టివి ప్రకటించింది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అక్రమాలను సరిచేయాలని సైన్యం ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం, కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఎన్నికలను వాయిదా వేయడంలో నిర్లక్షం వహించడం వంటి కారణాలతోనే దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినట్లు సైన్యం తెలిపింది.
ఇదిలా ఉండగా, దేశంలో సైనిక పాలన చోటుచేసుకోవడం అక్రమమని, రాజ్యాంగానికి, ప్రజాతీర్పునకు ఇది వ్యతిరేకమని సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ ఒక ప్రకటనను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. సైనిక తిరుగుబాటును, సైనిక నియంతృత్వ పాలనను ప్రతిఘటించవలసిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. కాగా..ఐదు దశాబ్దాల పాటు సైనిక పాలనలో ఉన్న మయన్మార్ 1962 నుంచి అంతర్జాతీయ వెలివేతను ఎదుర్కొంది. అనేక దశాబ్దాల పాటు ప్రజాస్వామ్య పునర్ధురణ కోసం పోరాటం సాగించి విజయం సాధించిన సూకీ నోబెల్ శాంతి బహుమతిని కూడా పొందారు.
ఇప్పుడు హఠాత్తుగా దేశం మళ్లీ సైనిక పాలన వైపు మళ్లడంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సూకీతోసహా పలువురు నేతలను అదుపులోకి తీసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోని బ్లింకెన్ ప్రకటించారు. ప్రభుత్వ అధికారులు, పౌర సమాజానికి చెందిన నాయకులు అందరినీ వెంటనే విడుదల చేసి ప్రజాస్వామిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని బర్మా సైనిక నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కూడా బర్మా సైనికి చర్యలను ఖండించారు. తాజా పరిణామాలు ప్రజాస్వామిక సంస్కరణలకు గొడ్డలిపెట్టని ఆయన అభివర్ణించారు.