చితికి నిప్పంటించిన కుమారుడు జీవ్ మిల్కాసింగ్
కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు, పంజాబ్ గవర్నర్,
పంజాబ్, హర్యానా రాష్ట్రాల మంత్రులు, కుటుంబ సభ్యులు హాజరు
చండీగఢ్: కరోనాతో శుక్రవారం అర్ధరాత్రి కన్ను మూసిన ఫ్లైయింగ్ సిక్ మిల్కాసింగ్‌కు శనివారం ఇక్కడ అభిమానుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు, కేంద్ర క్రీడల మంత్రి కిరెన్ రిజిజుతో పాటుగా పలువురు ప్రముఖుల సమక్షంలో వందలాది మంది అభిమానులు ఆయనకు కన్నీటి తుది వీడ్కోలు పలికారు. మిల్కాసింగ్ కుమారుడు, ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు జీవ్ మిల్కా సింగ్ చితికి నిప్పంటించారు. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారి విపి సింగ్ బడ్నోర్, పంజాబ్ ఆర్థిక మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్, హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్, చండీగఢ్ పిజిఐఎంఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ జగత్‌రామ్ తదితర ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు.
పోలీసులు తమ తుపాకులను అవనతం చేసి గౌరవ వందనం తెలిపారు. అలాగే గాలిలోకి కాల్పులు జరిపి దివంగత దిగ్గజ అథ్లెట్‌కు నివాళి అర్పించారు. మిల్కాసింగ్‌కు పూర్తి రాష్ట్రప్రభుత్వ మర్యాదలతో అంత్యక్రియలు జరుగుతుఆయని పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అంతకు ముందు ప్రకటించారు. కరోనాతో బాధపడుతూ 91ఏళ్ల మిల్కాసింగ్ శుక్రవారం అర్ధరాత్రి చండీగఢ్పిజిఐఎంఆర్లో కన్ను మూసిన విషయం తెలిసిందే.ఆయన భార్య కూడా వారం రోజుల క్రితమే కరోనాతోనే చనిపోయారు.
అంతకు ముందు చండీగఢ్ సెక్టార్ 8లోని మిల్కాసింగ్ నివాసంనుంచి అంతిమయాత్ర మొదలైంది. పూలతో అలంకరించిన వాహనంపై సెక్టార్ 25లోని శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. తమ ప్రియతమ అథ్లెట్‌ను చివరిసారి దర్శించుకోవడానికి దారి పొడవునా పెద్ద సంఖ్యలో అభిమానులు, సామాన్య ప్రజలు బారులు తీరారు. కాగా మిల్కాసింగ్ గౌరవార్థం పంజాబ్ ప్రభుత్వం శనివారం ఒక రోజు సంతాస దినంగా ప్రకటించడంతో పాటుగా సెలవురోజుగా ప్రకటించింది.