Friday, November 22, 2024

ఆగిన పరుగు

- Advertisement -
- Advertisement -

Milkha Singh passed away due to covid 19

కోట్లాది మందికి ఆదర్శం ఫ్లయింగ్ సిఖ్ జీవితం
కరోనాతో పోరాడి ఓడిన పరుగు వీరుడు

మన తెలంగాణ/క్రీడా విభాగం: భారత క్రీడల్లో ఎందరో దిగ్గజాలు ఓ వెలుగు వెలిగారు. వీరిలో పరుగు వీరుడు మిల్కా సింగ్ ఒకరు. హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ తర్వాత భారత క్రీడల్లో అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించిన దిగ్గజం మిల్కా సింగ్ మాత్రమే. ప్రపంచ అథ్లెటిక్స్‌లోనే అత్యంత అరుదైన అథ్లెట్‌గా మిల్కా సింగ్ పేరు తెచ్చుకున్నారు. 91 ఏళ్ల మిల్కా సింగ్‌తో శుక్రవారం అర్ధరాత్రి అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. ఫ్లయింగ్ సిఖ్‌గా పేరు తెచ్చుకున్న మిల్కా సింగ్ మృతి చెందడంతో భారత క్రీడా రంగం పెను విషాదంలో కూరుకు పోయింది. మిల్కా సింగ్ మృతిపై వేలాది మంది క్రీడాకారులు కన్నీళ్ల పర్యంతరం అయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఉప రాష్ట్రపతితో సహా పలువురు రాజకీయ, క్రీడా, సినీ తదితర రంగాలకు చెందిన ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

శరణార్థి శిబిరాల్లో తలదాచుకుని..

దేశ విభజన అనంరతం పాకిస్థాన్‌లో జరిగిన నరమేధంలో మిల్కా సింగ్ తల్లిదండ్రుల్ని చంపేశారు. దీంతో ఆ శత్రు దేశంలో ఉండలేక మిల్కా సింగ్ ఢిల్లీకి వచ్చి శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాడు. ఈ శిబిరాల్లో ఉన్నప్పుడూ బూట్లు తుడిచాడు. దొంగతనాలు చేసి జైలుకు సయితం వెళ్లాడు. అయితే సోదరి నగలమ్మి మిల్కాను జైలు నుంచి విడిపించింది. ఆ తర్వాత మిల్కా సింగ్ కొత్త జీవితాన్ని ఆరభించాడు. వరుస వైఫల్యాల తర్వాత భారత సైన్యంలో చేరాడు. అక్కడే పరుగుపై ఆసక్తి ఏర్పడింది. స్వల్ప వ్యవధిలోనే అథ్లెటిక్స్‌లో ఎదురులేని శక్తిగా మారాడు. రోమ్ ఒలింపిక్స్‌లో తృటిలో పతకాన్ని సాధించే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అంతేగాక ఆసియాలో తిరుగులేని అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ దిగ్గజం అబ్దుల్ ఖలిద్‌ను అతనిసొంత గడ్డలోనే చిత్తు చేసి ఫ్లయింగ్ సిఖ్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇలాంటి ఎన్నో అరుదైన రికార్డులు తన పేరిట లిఖించుకున్న మిల్కా సింగ్ కోట్లాది మంది క్రీడాకారులకు, ముఖ్యంగా అథ్లెట్లకు ఆదర్శమూర్తిగా నిలిచాడు.

కష్టాలతో సహజీవనం..

మిల్కా సింగ్‌కు చిన్నప్పటి నుంచే కష్టాలు వెంటాడాయి. 15 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు. ఆ తర్వాత భారత్‌కు శరణార్థికి వచ్చాడు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను అనుభవించాడు. జీవితాన్ని నెట్టుకొచ్చే క్రమంలో బూట్లు పాలిష్ చేశాడు. అంతేగాక పాత ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఓదుకాణం క్లీనర్‌గా పడి చేశాడు. ఇదే సమయంలో దొంగతనం చేసి జైలు కెళ్లాడు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత మిల్కా సింగ్ జీవితంలో మార్పు స్పష్టంగా కనిపించింది. అప్పటి నుంచి కష్టపడి పని చేశాడు. అదే సమయంలో సైన్యంలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. చివరికి నాలుగో ప్రయత్నంలో భారత సైన్యంలో చేరాడు. తొలి పోస్టింగ్ సికింద్రాబాద్‌లోనే. 9 ఏళ్ల పాటు సికింద్రాబాద్ సైనిక శిబిరాల్లో ఉంటూ శిక్షణ పొందాడు.

పరుగుపై ఆసక్తి..

సికింద్రాబాద్‌లో ఉన్న సమయంలోనే మిల్కా సింగ్ పరుగుపై ఆసక్తి పెంచుకున్నాడు. ఐదు మైళ్ల క్రాస్ కంట్రీ పరుగులో మిల్కా తొలిసారి పోటీ పడ్డాడు. టాప్10లో నిలిస్తే ఒక గాలు పాలు అదనంగా ఇప్పిస్తానని అప్పటి సైనిక కోచ్ గురుదేవ్ సింగ్ మాటివ్వడంతో మిల్కా సర్వం ఒడ్డి పోరాడాడు. ఇదే క్రమంలో ఆరో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత అతనికి 400 మీటర్ల పరుగులో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. దీంతో మిల్కా సింగ్ కెరీర్ కొత్త పుంతలు తొక్కింది.

ఎన్నో చారిత్రక విజయాలు..

ఇక మిల్కా సింగ్ తన సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించాడు. 1958 కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. అంతేగాక ఆసియా క్రీడల్లో ఏకంగా 4 స్వర్ణ పతకాలు సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేశాడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 0.1 సెనను తేడాతో కాంస్యం సాధించే అవకాశాన్ని చేజ్చాకున్నాడు. అయితే ఇదే క్రమంలో 45.6 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు 38 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండింది అంటే మిల్కా సాధించిన ఘనత ఎలాంటిదో ఊహించుకోవచ్చు. ఇక 80 రేసుల్లో పోటీ పడిన మిల్కా ఇందులో 77 సార్లు విజేతగా నిలువడం విశేషం. ఇక మిల్కా సింగ్‌కు 1959లో పద్మశ్రీ అవార్డు లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News