Wednesday, January 22, 2025

మిల్లెట్ మ్యాన్ పివి సతీశ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు తెలంగాణ మిల్లెట్ మ్యాన్‌గా పేరుగాంచిన పి.వి సతీశ్ (77)కన్నుమూశారు. ఆనారోగ్యంతో చికిత్సపొందుతూ అపోలో ఆస్పత్రిలో ఆదివారం తెల్లవారు ఝామున తుదిశ్వాస విడిచారు. కొన్నేళ్లుగా మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన కోలుకోలేక ఆస్పత్రిలోనే మృతి చెందారు. 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన ఆయన పూర్తిపేరు పెరియపట్నం వెంటక సుబ్బయ్య సతీశ్ . ఉద్యోగ రిత్యా హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో పనిచేశారు. అనంతరం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో డక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. వాతావరణ మార్పుల నేపధ్యంలో రసాయన ఎరువులు , క్రిమి సంహారక మందులకు ప్రత్యామ్నాయంగా సహజ వ్యవసాయ పద్దతులను ప్రోత్సహిస్తూ రైతుల్లో అవగాహన పెంపొందింపచేస్తూ వచ్చారు. చిన్న సన్న కారు రైతుల పొలాల్లో పెద్దగా పెట్టుబడి లేకుండా చిరుధాన్యాల సాగును పెంచుతూ ప్రజల్లో వాటి వినియోగం పెంపుదలకు కృషి చేశారు.

ప్రతియేటా పాత పంటల పండగ:

జహీరాబాద్ ప్రాంతంలో మహిళా సాధికారత దిశగా కార్యక్రమాలు చేపట్టిన సతీష్ అనతి కాలంలోనే మంచి ఫలితాలు రాబట్టగలిగారు. చిరుధాన్యాలసాగులో సఫలీకృతులయ్యారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంలో కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి 2018సంవత్సరాన్ని జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించపచేయడంలో కీలక పాత్ర పోషించారు. సతీశ్ కృషికి పలు జాతీయ , అంతర్జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. చిరుధాన్య పంటల సాగుపట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేందకు ప్రతియేటా జనవరిలో పాత పంటల పండుగను నిర్వహిస్తూ వచ్చారు. జహీరాబాద్ కేంద్రంగా పరిసర గ్రామాల మహిళారైతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని పెద్ద వేడుకగా నిర్వహిస్తూ వచ్చారు.పాత పంటలకు సంబంధించిన విత్తనాలను భద్రపరిచి విత్తన వ్యవస్థను బలోపేతం చేసేందుకు విత్తనభాంఢాగారం ఏర్పాటు చేయించారు. మిల్లెట్ మ్యాన్‌గా పిలుచుకునే సతీశ్ మృతి పట్ల రైతులకు , రైతుమహిళలకు తీరని లోటుగా చెబుతున్నారు. సతీశ్ మృతదేహాన్ని జహీరాబాద్‌లోని దక్కన్ సొసైటీ కార్యాలయానికి తరలించారు . సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సతీష్ కృషిని కొనసాగిద్దాం

డిడిఎస్ వ్యవస్థాపకులు సతీష్ మృతి పట్ల రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు , వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. చిరుధాన్యాల సంరక్షణకు సతీశ్ కృషిని కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. పాతపంటలు సంప్రదాయ పంటల రక్షణ ఉద్యమం చేపట్టి ఎంతో కృషి చేశారని కొనియాడారు. మహిళాసాధికారతకోసం కృషి చేసిన సతీస్ గొప్ప మానవతావాది అని తెలిపారు. సతీశ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్దిస్తున్నట్టు మంత్రులు హరీష్‌రావు , నిరంజన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News