Wednesday, January 22, 2025

దేశంలో ధనేశం ఏకేశం శనీశం

- Advertisement -
- Advertisement -

దేశ ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారింది. కార్పొరేట్లకు కోట్లప్పగించిన నేతలు ఏకచ్ఛత్రాధిపత్య నిరంకుశత్వానికి పాల్పడ్డారు. మరోమారు గద్దెనెక్కితే నియంతృత్వమే. శనీశ్వరాన్ని వదిలించుకోవాలని జనేశ్వరం కోరుకుంటున్నది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యతిరేక సంపన్న పాలకవర్గ, మతాధిపతుల, బహుళ జాతి సంస్థల బంధం ధనస్వామ్యానికి దారి తీసింది. సామాన్యులు ప్రజా ప్రాతినిధ్య అవకాశాలు కోల్పోయారు.
చట్టసభలు కోటీశ్వరుల కోటరీలు: పాలకులు వ్యవస్థలను అవినీతిమయం చేశారు. ధనస్వామ్యానికి నాందిపలికారు. ఇందులో కాంగ్రెస్ పెద్దన్న బిజెపి. ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలను చట్టబద్ధం చేసి వాజపేయి ప్రభుత్వం ధనస్వామ్యాన్ని బలోపేతం చేసింది. మోడీయం నిస్సిగ్గుగా కార్పొరేట్ల దళారీగా మారింది. ఎన్నికల ప్రణాళికల్లో అవినీతి నిర్మూలన ఊసే లేదు. గతంలో నీతి నిజాయితీ, నిరాడంబరతలకు మారు పేరు, ప్రజా సేవకులు, కమ్యూనిస్టులు ఇంద్రజిత్ గుప్త, భూపేశ్ గుప్త, జ్యోతి బసు, పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణరెడ్డి, నంబూద్రిపాద్, యెద్దుల ఈశ్వరరెడ్డి మొదలగు వారు ఎన్నికయ్యారు. నేడు ఇలాంటి నేతలు నెగ్గడం లేదు. కార్పొరేట్ల మాధ్యమాలు పెట్టుబడిదారీ పార్టీల గొంతులయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లతో పాటు లిఖిత వాంగ్మూలాలు సమర్పిస్తారు.

2014 పత్రాల సమాచారంతో ‘ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ ఎడిఆర్) సమర్పించిన నివేదిక ప్రకారం 29 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల 620 మంది మంత్రుల్లో 609 మంది సగటు ఆస్తి రూ. 9.52 కోట్లు. వీరిలో 462 మంది కోటీశ్వరులే. ఆంధ్రప్రదేశ్‌లో 20 మంది సగటు ఆస్తి రూ. 45.49 కోట్లు. దేశంలో వీరిది అగ్రస్థానం. పొంగూరు నారాయణ రూ. 496.86 కోట్ల ఆస్తితో అత్యధిక ధనశాలి. చంద్రబాబు రూ. 177.49 కోట్ల ఆస్తితో నాల్గవ స్థానంలో వున్నారు. కేంద్ర మంత్రుల్లో 72(92%) మంది కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తి రూ. 12.94 కోట్లు. రూ. 113 కోట్లతో అరుణ్ జైట్లీ, రూ. 95 కోట్లతో పియూష్ గోయల్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. 15 వ లోక్‌సభ సభ్యుల్లో 165 మంది కోటీశ్వరులు, 16వ లోక్‌సభ (2014-19) కూ ఎన్నికయారు. 2009-14 మధ్య 5 ఏళ్ళలో ఈ ఎంపిల ఆస్తులు రూ. 1,232.43 కోట్ల పెరుగుదలతో సగటున 137% పెరిగాయి. 15 వ సభ నుండి 16 వ సభకు పోటీ చేసిన 396 మంది చిరాస్తులు రూ. 3,366.58 కోట్లు (146%) పెరిగాయి. 16 వ లోక్‌సభ అతి సంపన్నుల సభ. 82% మంది కొత్త ఎంపిల ఆస్తులు కోటి పైనే. ఈ సంఖ్య 2004, 2009 సభల్లో వరుసగా 30%, 58%. గుంటూరు టిడిపి ఎంపి గల్లా జయదేవ్ రూ. 683 కోట్ల ఆస్తితో దేశంలో అతి ధనవంతుడు.

రూ. 50 కోట్ల సగటు ఆస్తులతో తెలుగు రాష్ట్రాల టిడిపి, తెరాస, వైఎసార్ సిపిలకు అత్యంత ధనవంతులైన సభ్యులున్నారు. ఇవి ఎన్నికల సంఘానికి సమర్పించిన అధికార గణాంకాలు. అనధికార ఆస్తుల ‘అభివృద్ధి’ ఎన్నో రెట్లు ఎక్కువ. నల్ల సంపాదన, బినామీ ఖాతాల లెక్కలు వేరే వుంటాయి. ఈ గణాంకాలు మన ధనస్వామ్య ఘనతను నిరూపిస్తున్నాయి.
రాజకీయ చందాలు: 2017- 18 సంవత్సరంలో బిజెపికి అన్ని జాతీయ పార్టీల కంటే అధికంగా రూ. 1,027.34 కోట్ల చందాలొచ్చాయి. అందులో రూ. 553.38 కోట్లు (53.87%) రహస్య చందా లు. ఇవి అన్ని పార్టీల రహస్య చందాల్లో 80%. కాంగ్రెస్ చందా రూ. 99.2 కోట్లు. బి.ఎస్.పి. చందా రూ. 51.7 కోట్లు. బిజెపి ప్రభుత్వం చేసిన కొత్త చట్టం ప్రకారం రూ. 20 వేల లోపు నగదు, ఎన్నికల బాండ్ల చందాల వివరాలు ప్రకటించనక్కర లేదు. అందువల్ల జాతీయ పార్టీలు పొందిన చందాల్లో 50% రహస్యాలే. 20 వేలు దాటిన చందాలు బిజెపికి 93% రాగా, అందులో 92% కార్పొరేట్ల నుండే వచ్చాయి. ఎన్నికల బాండ్ల ద్వారా బిజెపికి 38%, కాంగ్రెస్‌కు 4% చందాలొచ్చాయి. ఇవి ఎన్నికల సంఘానికి సమర్పించిన గణాంకాలు. లెక్కల్లో చూపని వసూళ్ళు, జేబుల్లో కుక్కుకున్న చందాలు, నల్ల కుబేరులు అనామత్తుగా ఇచ్చింది,

కానుకలు, పార్టీలు, పబ్బాలు, తిండి తీర్థాలు, సమావేశ నిర్వహణలకు శ్రేయోభిలాషులు పెట్టిన ఖర్చు కలిపితే వసూళ్ళు ఎంతకు చేరుకుంటాయో! ఇంత సొమ్ము ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇస్తారా? దేశ, విదేశాల్లోని నల్లధనాన్ని బయటికి తీస్తామని ఎన్నికల్లో అన్ని పాలక పార్టీలు వాగ్దానాలు చేస్తాయి. 2014లో మోడీ నల్ల డబ్బు తెచ్చి మనిషికి రూ. 15 లక్షలు ఇస్తానని నమ్మించి పీఠమెక్కారు. నల్ల కుబేరులకు తాయిలాలు ఇచ్చారు కానీ చర్యల జోలికి పోలేదు. పాలక పార్టీలకు చందాలు వచ్చేదే నల్ల సంపాదన నుండి. నల్లసొమ్ము వసూలు చేయడం కల్ల.
విదేశీ విరాళాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి స్పందించిన ఢిల్లీ హైకోర్టు బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై 6 నెలల్లో చర్యలు తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని, 28 మార్చి 2014 న ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాలేదు. కోర్టు ధిక్కార నేరం జరిగింది. 2016 పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ‘ఆర్థిక బిల్లు 2016’ ను ఆమోదించింది. దీని ప్రకారం విదేశీ షేర్ హోల్డింగ్ కంపెనీలు రాజకీయ పార్టీలతో సహా భారత దేశ సంస్థలకు ఇచ్చే విరాళాలు ‘ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగులేషన్ యాక్ట్, 2010’ (ఎఫ్‌సిఆర్‌ఎ) పరిధిలోకి రావు.

ఎఫ్‌సిఆర్‌ఎ సవరణకు పలుమార్లు విఫలమైన బిజెపి ఏకంగా చట్టాన్నే చేసి కోర్టును ఎగతాళి చేసింది. రాజ్యాంగ, న్యాయ నిబంధనల ధిక్కరణలో బిజెపి, కాంగ్రెస్ పరస్పరం సహకరించుకున్నాయి. దొంగతనానికి అనుమతిచ్చి దొంగాటల ఇక్కట్లు తప్పించుకున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలకు విదేశీ విరాళాలు ఎక్కువ. అధికారం అందిన తర్వాత అవి అధికమయ్యాయి. ఆర్థిక బలం పెంచుకోవడానికి బిజెపి చేసుకున్న చట్టాల్లో ఇదీ ఒకటి. రూ. 20,000 ల పైబడిన విదేశీ చందాలు భాజపా, కాంగ్రెస్‌లకే వస్తున్నాయి. చందాలిచ్చిన వారికి ‘సేవలు’ చేయాలి కదా. అదానీ, అంబానీ, తాతాలతో ‘నీకిది నాకది’ సూత్ర పాలనే నేటి పాలక నీతి. ఎన్నికల బాండ్లతో, ఆర్థిక బిల్లు 2016తో బిజెపి బాగా లాభపడింది. రాజకీయ నిధులకు బిజెపి చేసిన ఎన్నికల బాండ్ల చట్టం పారదర్శకతకు పాతరేసిందని, డొల్ల కంపెనీల ద్వారా నల్ల నగదు పార్టీలకు చేరి అవినీతి అదుపు తప్పుతుందని ఎన్నికల సంఘం మార్చి 27, 2019న సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. చట్టసభల్లో ధనవంతులు బహుళ జాతి సంస్థలకు మేలు చేసే చట్టాలే చేస్తున్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించబడవు. ఆర్థిక స్వాతంత్య్రం లేని స్త్రీలు ఎన్నికల్లో పోటీ చేయలేరు. ధనవంతుల చట్టసభలు మహిళలు,

పిల్లలకు అనుకూలం కావు. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాల ప్రచార నినాదాలు, ప్రపంచీకరణ విధానాలు, ఆర్థిక సంస్కరణలు, బూటకపు పథకాలు వామపక్షాల ఆకలి, పేదరికం, నిరుద్యోగం, దున్నేవాడికి భూమి, పని హక్కు, జీవించే హక్కు, పెట్టుబడిదారీ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ వ్యతిరేక ఆశయాలు, గమ్యాలను పూర్వపక్షం చేశాయి. వామ పక్షాల ఓట్ల శాతం తగ్గింది.
ప్రత్యామ్నాయం: స్వయం ప్రతిపత్తి రాజ్యాంగ సంస్థ ఎన్నికల సంఘానికి విశేష అధికారాలున్నాయని సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. అది ఆ అధికారాలు ఉపయోగించుకోలేదు. అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల్లోని ఆస్తులు, నేరాల ఆధారంగా చర్యలు చేపట్టలేకున్నది. తాను విధించిన ఎన్నికల ఖర్చు పరిమితులపై నిఘా, చర్యలు లేవు. బూర్జువా పార్టీల అనుచిత పథకాలను ప్రశ్నించటం లేదు. బిజెపి ముక్త భారత్ కావాలని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనగా సిపిఐ పూర్వ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, ‘ఇప్పుడు కావలసింది కేవలం రాజకీయ ప్రత్యామ్నాయం కాదు. సైద్ధాంతిక, ఆర్థిక, సామాజిక ప్రత్యామ్నాయం’ అన్నారు. వామపక్ష ప్రత్యామ్నాయం ఈ దిశలో సమ సమాజ స్థాపనకు కృషి చేయగలదు. మార్క్సిజం సమకాలీన అనువర్తనతో ధనేశ, ఏకేశ శనీశాన్ని వదిలించగలదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News