చిన్న రాష్ట్రమే కావచ్చు, కానీ కోటీశ్వరులకు కొదవ లేదు. నవంబర్ 7న అసెంబ్లీ ఎన్నికలకు వెళుతున్న మిజోరంలో ఉన్నవి నలభయ్యే అసెంబ్లీ సీట్లు. కానీ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కోట్లకు పడగలెత్తినవారు బోలెడుమంది ఉన్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ (ఎడిఆర్), మిజోరం ఎలక్షన్ వాచ్ సంయుక్తంగా విడుదల చేసిన ఓ నివేదిక ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.
పోటీలో ఉన్న 174మంది అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఐదు కోట్లకు పైబడి ఆస్తులు ఉన్నవారు 25.86 శాతం మంది (45మంది అభ్యర్థులు) కాగా రెండు నుంచి ఐదు కోట్లలోపు ఆదాయం గలవారు 25.29 శాతం మంది (44మంది అభ్యర్థులు) ఉన్నారు. మరో 25.29 శాతం మంది (44మంది అభ్యర్థులు) ఆస్తుల విలువ 50 లక్షలనుంచి రెండు కోట్ల రూపాయలలోపు ఉందట. 10.34 శాతంమంది (18 మంది అభ్యర్థులు) ఆస్తుల విలువ 10 లక్షలనుంచి 50 లక్షల రూపాయల మధ్య ఉండగా, కేవలం 13.22 శాతంమందికి (ఇద్దరు అభ్యర్థులు) మాత్రమే పది లక్షల లోపు ఆస్తులు ఉన్నాయట.
ఈ వివరాలనుబట్టి చూస్తే, కోటీశ్వరులకే ఆయా పార్టీలు ఎక్కువగా టికెట్లు (66శాతం) ఇచ్చినట్లు అర్థమవుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎమ్ఎన్ఎఫ్) తరపున బరిలోకి దిగిన 40మంది అభ్యర్థులలో 36 మంది (90%) ఆస్తుల విలువ కోటికి పైమాటే. కాంగ్రెస్ అభ్యర్థులలో 33 మంది (83%), జోరామ్ పీపుల్ మూవ్ మెంట్ టికెట్ పై పోటీ చేస్తున్న 29మంది అభ్యర్థులు కోటీశ్వరులేనంటే ఆశ్చర్యం కలగకమానదు. ఇక బిజెపి పోటీకి నిలబెట్టిన 23మందిలో తొమ్మిది మంది అభ్యర్థులు (9శాతం), ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుపై పోటీ చేస్తున్న నలుగురిలో ఒకరు (25%) తమ ఆస్తులు కోటికి పైగానే ఉన్నట్లు అఫిడవిట్లలో ధ్రువీకరించారు.
మొత్తం 40 స్థానాలలో 27మంది ఇండిపెండెంట్లు పోటీ చేస్తున్నారు. వీరిలోనూ ఆరుగురు కోటీశ్వరులే కావడం విశేషం.
ఎన్నికల బరిలోకి దిగిన కోటీశ్వరుల జాబితాలో బిజెపికి చెందిన జె.బి. రౌల్చింగా అగ్రస్థానంలో ఉన్నారు. తనకు 90,32,89,532 కోట్ల రూపాయల స్థిర చర ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆయన తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ కు చెందిన వాన్లాల్ ట్లువంగా (రూ. 55,63,93,721), జొరామ్ పీపుల్స్ మూవ్ మెంట్ పార్టీ అభ్యర్థి జింజలాలా (రూ. 36,09,52,042) ఉన్నారు.
కోటీశ్వరులే కాదు, ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నిరుపేదలూ ఉన్నారు. కానీ వారి సంఖ్య తక్కువ. వారిలో మొదటిస్థానం రామ్లున్-ఎడెనాకు దక్కుతుంది. ఆయన తనకు 1,500 రూపాయలు మాత్రమే ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత నహక అనే అభ్యర్థి (6,742 రూపాయలు), లాల్ మచ్చువానీ అనే అభ్యర్థి (పదివేల రూపాయలు) మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ముగ్గురూ ఇండిపెండెంట్ అభ్యర్థులే కావడం గమనార్హం.