Thursday, January 23, 2025

సెటిలర్లు బిఆర్‌యస్ వైపే

- Advertisement -
- Advertisement -

విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో అనేక దశాబ్దాల క్రితం స్థిరపడ్డారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఇరవై లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జనాభా ఉన్నట్లు అనేక గణాంకాలు తెలియ చేస్తున్నాయి. అదే విధంగా నిజామాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటూ ఇతర తెలంగాణ జిల్లాల్లో పది లక్షల వరకు ఆంధ్రులు స్థిరపడినట్లు అదే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు అందరూ వారి స్వరాష్ట్రానికి వెళ్ళిపోతారని అనేక వార్తలు షికారు చేశాయి. అందుకు భిన్నంగా ఆ సమయంలో కేవలం హైదరాబాద్‌లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లారు. అదే విధంగా కొద్ది మంది స్థిరాస్తి వ్యాపారులు, చిన్న, మధ్య తరహా వ్యాపారవేత్తలు స్వరాష్ట్రానికి వెళ్ళడం జరిగింది.

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళిన వ్యాపార వేత్తలు అక్కడ ఎక్కువకాలం మనుగడ సాగించలేక తిరిగి హైదరాబాద్‌కు రావడం గమనార్హం. ఈ పరిణామానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రభావ వంతమైన, కుల రాజకీయ పరిణామాలే ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రులు అందరూ ఎటువంటి ఆటంకాలు లేకుండా సుహృద్భావ వాతావరణంలో తమ జీవనయానం కొనసాగిస్తున్నారు. ప్రశాంతంగా తమ పనితాము చేసుకుంటూ పోతున్న తెలంగాణ ఆంధ్రులను రాజకీయాలలోకి లాగి వారి ఓట్లను తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కేంద్ర హోం శాఖామాత్యులు అమిత్ షా ఇటీవల తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి ద్వారా నారా లోకేష్‌ను పిలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి వాకబు చేసినట్లు తెలిసిందే. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తెలంగాణలో స్థిరపడిన కొందరు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుల సంఘ నాయకులతో ఇటీవల సమావేశం అవ్వడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా కొంత మంది ఐటి ఉద్యోగులు హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ప్రాంతంలో వేలాదిగా ఒకచోట చేరి నిరసన వ్యక్తం చేశారు. ఐటి ఉద్యోగుల నిరసనలు హైటెక్ సిటీ ప్రాంతంలో రోజురోజుకూ ఎక్కువ కావడంతో ఐటి పరిశ్రమ అస్తిత్వానికి హైటెక్ సిటీ ప్రాంతంలో ప్రశాంతతకు భంగం కలిగించవద్దని తెలంగాణ రాష్ట్ర ఐటి శాఖామాత్యులు కల్వకుంట్ల తారక రామారావు ఐటి ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు వక్రభాష్యం చెపుతూ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు, కొందరు కుల సంఘ నాయకులు బిఆర్‌యస్‌పై బురదచల్లే ప్రయత్నాలు చేయడం దురదృష్టకరం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో రాష్ట్రం అంతా ఉద్యమాలు చేసినా హైటెక్ సిటీ ప్రాంతంలో మాత్రం టిఆర్‌యస్ పార్టీ ఉద్యమాలు చేయలేదు. ఈ విషయాన్ని కెటిఆర్ స్పష్టం చేస్తూ నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు రాజకీయ పార్టీలకు చెందిన రాజకీయ పరిణామాలతో ముడిపడిన అంశం కనుక హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యమాలు చేయవద్దని ఐటి ఉద్యోగులకు కెటిఆర్ స్పష్టంగా చెప్పారు.

అలా ఉద్యమం చేయదలచిన వారు అనుమతి తీసుకుని ధర్నాచౌక్ ప్రాంతంలో నిరసనలు చేసుకోమని కెటిఆర్ చెప్పారు. కెటిఆర్ వ్యాఖ్యలలో తప్పుపట్టాల్సిన విషయం ఏముందో మేధావులకు సైతం అర్ధం కావడంలేదు. హైదరాబాద్ లోని ఐటి పరిశ్రమ ఆవశ్యకత, ప్రాముఖ్యత గుర్తెరిగి మసలుకోవలసిన బాధ్యత ఐటి ఉద్యోగులందరిపై ఉందనేది నిర్వివాదాంశం. ప్రస్తుతం దేశంలో ఉన్న ఐటి కేంద్రాలలో హైదరాబాద్ ఐటి కేంద్రం మూడవ స్థానం ఆక్రమించింది.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్ర ఐటి శాఖామాత్యులు కెటిఆర్ చేసిన అమోఘమైన కృషే దానికి ప్రధాన కారణం అని కచ్చితంగా చెప్పవచ్చు. దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటి రంగం మనుగడ ఉద్యమాల కారణంగా దెబ్బతింటుందనే కెటిఆర్ ఆ విధంగా స్పందించినట్లు స్పష్టంగా తెలుస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాలలోని ఐటి ఉద్యోగ ఆశావాహుల,ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ కంపెనీలలో విధులు నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటి ఉద్యోగుల భవిష్యత్తు దృష్ట్యా కెటిఆర్ వ్యాఖ్యలను సమర్ధించాల్సిన

రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు రాజకీయాలకు వాడుకోవాలని చూడడం ఏమాత్రం సమర్ధనీయం కాదు. ఐటి ఉద్యోగుల నిరసనలపై కెటిఆర్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఆ వ్యాఖ్యలను భూతద్దంలో చూపుతూ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన కులస్థులు కొందరు కాంగ్రెస్, బిజెపిల పంచనచేరి ఆ పార్టీలలో తమకు శాసనసభ టికెట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరే వీరి సామాజిక వర్గానికి చెందిన కొందరు ఐటి ఉద్యోగులను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతాలలో, పేద, మధ్య తరగతి ప్రజలు ఉపయోగించుకునే మెట్రో స్టేషన్‌లలో నిరసనలు చేపిస్తూ చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో ఏమాత్రం సంబంధం లేని తెలంగాణ రాష్ట్ర ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తున్నారు. కానీ అదే సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి, అయిదుగురు ఎంఎల్‌ఎలు, ఒక ఎంపి, ఒక ఎంఎల్‌సి పదవులు బిఆర్‌యస్ పార్టీ కేటాయించి ఆ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఈ పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే కొందరు రాజకీయ శరణార్ధులు

మినహాయించి ఆ సామాజిక వర్గం కూడా పూర్తి స్థాయిలో మరోమారు కెసిఆర్ నాయకత్వాన్ని బలపరచే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం లౌకిక వాదానికి పెట్టింది పేరు. అన్ని కులాల ప్రజలకు, అన్ని మతాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజల జీవన మనుగడకు దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేని పటిష్టమైన రక్షణ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దీనిని పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల ప్రజలపై ఉందనేది నిర్వివాదాంశం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News