మజ్లిస్ రాష్ట్ర అధ్యక్షుడి ప్రతిపాదన
ఛత్రపతి సంభాజీనగర్: రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి(ఎంవిఎ)తో కలసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఎఐఎంఐఎం మాజీ ఎంపి ఇంతియాజ్ జలీల్ వెల్లడించారు. రాష్ట్రంలో శివసేన(షిండే), ఎన్‌సిపి(అజిత్ పవార్)తో కలసి అధికారాన్ని పంచుకున్న బిజెపిని ఓడించడమే తమ పార్టీ లక్షమని ఆయన ప్రకటించారు. ఎంఐఎం మహారాష్ట్ర విభాగ అధ్యక్షుడైన జలీల్ ముంబైలో పార్టీ సమావేశం అనంతరం మరాఠీ న్యూస్ చానల్ ఎబిపి మఝాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా తాము ఎంవిఎకి ఈ ప్రతిపాదన చేశామని, బిజెపిని ఓడించడానికి తమతో చేతులు కలపవలసిందిగా మరోసారి వారికి విజ్ఞప్తి చేస్తున్నామని జలీల్ తెలిపారు. తమను కూటమిలో చేర్చుకోవడం అన్నంది ఇక వారి ఇష్టానికే వదిలివేస్తున్నట్లు ఆయన తెలిపారు. తమను కలుపుకుని ముందుకు వెళితే అది వారికే(ఎంవిఎ) లాభమని, కాని పక్షంలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన అన్నారు. తమకు కూడా కొంత బలం ఉందని, ఓటు బ్యాంకు ఉందని భావిస్తే తమతో చేతులు కలపడానికి వారు(ఎంవిఎ) సంసిద్ధత తెలియచేస్తారని, లేకపోతే దూరం పెడతారని జలీల్ వ్యాఖ్యానించారు.
ఎంఐఎం పట్ల ఎంవిఎ భాగస్వామ్య పక్షమైన శివసేన(యుబిటి)కు ఎటువంటి అభ్యంతరం ఉండదా అన్న ప్రశ్నకు బిజెపి ఇప్పటికే దేశాన్ని నాశనం చేసిందని, ఆ పార్టీని ప్రభుత్వం నుంచి దూరం చేయాలన్నదే తమ లక్షమని ఆయన అన్నారు. అయితే ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలోని వంచిత్ బహుజన్ అఘాడి(విబిఎ)తో పొత్తుకు ఆయన విముఖత వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే అవకాశం ఉంది. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మహారాష్ట్రలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలలో 31 సీట్లను ఎంవిఎ గెలుచుకుంది. అధికార మహాయుతి కూటమి కేవలం 17 స్థానాలను గెలుచుకుంది.