హైదరాబాద్ : త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ఎంఐఎం పార్టీ సన్నాహాలు చేపట్టింది. ఇతర రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడగా ఎవరూ ఊహించని విధంగా ఎంఐఎం కర్ణాటక బరిలో నిలిచే తమ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. పార్టీ అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి ముగ్గురు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ఎంఐఎం విడుదల చేసిన తొలి జాబితాలో లతీఫ్ ఖాన్ అమీర్ ఖాన్ పఠాన్ బెలగావి నార్త్ 11 నుండి, దుర్గప్ప కాశప్ప బిజవాడ్ హుబ్లి ధడ్వాడ్ ఈస్ట్ 72 నుండి,
అల్లాభఖ్ష్ మెహబూబ్ సాబ్ బిజాపూర్, బసవన్న భాగెవాడి 28 నుండి పోటీ చేస్తారని ప్రకటించారు. లతీఫ్ ఖాన్ ఎంఐఎం కర్ణాటక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. పియుసి వరకు చదువుకున్న లతీఫ్ ఖాన్ ఇదివరకు కార్పొరేటర్‌గా పనిచేశారు. దుర్గప్ప కాషప్ప బిఎ వరకు చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి కార్పొరేటర్‌గా పనిచేశారు. అల్లా బఖ్ష్ బిఎ ఎల్‌ఎల్‌బి వరకు చదువుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంఐఎం ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఇకరు హిందు కాగా ఇద్దరు ముస్లింలను ఎంపిక చేశారు.