Sunday, December 22, 2024

యూసిసిపై లా కమిషన్‌కు ఎంఐఎం అభిప్రాయాలు

- Advertisement -
- Advertisement -

దేశంలో కామన్ సివిల్ కోడ్ సాధ్యం కాదు : అసదుద్దీన్
రాజకీయ లబ్దికోసమేనన్న ఓవైసి

హైదరాబాద్ : యూనిఫాం సివిల్ కోడ్ (యూసిసి) పై లా కమిషన్‌కు ఆల్ ఇండియా మజ్లిస్‌ఎంఐఎం తమ అభిప్రాయాలను తెలియజేసింది. ఎన్నికలకు ముందు ఓట్లను పోలరైజ్ చేయడం ద్వారా రాజకీయ లబ్దిపొందడానికి బిజెపి ఈ చర్యకు పాల్పడుతోందని ఆల్ ఇండియా మజ్లిస్- ఎ -ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు,హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసి అన్నారు. విభిన్న జాతులు, సాంప్రదాయాలు, భాషలు ఉన్న మన దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు చేయడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. పేదరికం, నిరుద్యోగం, ధరల పెరుగుదల, చైనా చొరబాటు లాంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందకు, అనవసరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ కసరత్తులో భాగమే యూసిసి అమలు ప్రతిపాదన అని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసదుద్దీన్ ఓవైసి మాట్లాడారు. యూసిసి గిరిజనుల విభిన్న ఆచారాలను నిర్మూలించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు వచ్చి గోండు సామాజిక వర్గానికి యూసిసి అమలు గురించి చెప్పాలని ప్రధాని మోదీకి సవాల్ విసిరారు.
యాదృచ్ఛికం కాదు
యూసిసిపై ప్రస్తుత లా కమిషన్ స్పందన కోరడం ఆశ్చర్యం కలిగిస్తోందని అసదుద్దీన్ ఓవైసి అన్నారు. సరిగ్గా ఐదేళ్ల తర్వాత మళ్లీ లా కమిషన్ కసరత్తు చేపట్టడం యాదృచ్ఛికం కాదని, గతంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపి ఈ అంశాన్ని లేవనెత్తిందని, వచ్చే 2024 ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేలా వాతావరణాన్ని దెబ్బతీయడమే దీని లక్ష్యమని ఓవైసి ధ్వజమెత్తారు. కామన్ సివిల్ లా కోడ్‌పై సూచనల కోసం అప్పీల్ చేసిన లా కమిషన్ కు యూసిసిపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గౌడ్ న్యాయపరమైన అభిప్రాయాలతో పాటు తమ పార్టీ తన స్పందనను పంపిందని ఓవైసి వివరించారు.
గవర్నర్ వాఖ్యలపై మండిపాటు
యూనిఫాం సివిల్ కోడ్‌పై కేరళ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసి మండిపడ్డారు. ఎవరైనా తమ ఆందోళనలను వ్యక్తం చేస్తే దానిని స్వాగతించాలని, ప్రజలు ఏది చెబితే అది ప్రభుత్వానికి తెలుస్తుందని, అప్పుడే ఆ సున్నితత్వాలన్నింటినీ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుంటుందన్నారు. గవర్నర్‌గా ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించకూడదని, అవసరమైతే పదవీకి రాజీనామా చేసి అధికారికంగా బిజెపిలో చేరాలని ఓవైసీ విరుచుకుపడ్డారు,
మిత్రుడు సిఎం జగన్‌ను కలుస్తా
ఎపి సిఎం జగన్ తన మిత్రుడని, త్వరలో ఆయనను యూసిసి అంశంపై కలుస్తామని అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు. ఇప్పటికే ఆయన తనను లంచ్‌కు ఆహ్వానించాడని పేర్కొన్నారు. తెలంగాణ సిఎం కెసిఆర్‌తో సమావేశమై యూసిసికి వ్యతిరేకంగా మద్దతు కోరామని, అందుకు కెసిఆర్ సానుకూలంగా స్పదించడంతో పాటు భావ స్వారూప్య పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు యూసిసిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓవైసి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News