ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు జిల్లా, మేడారంలోని సమ్మక్క సారమ్మ జాతర. బుధవారం మండమెలిగే పండుగతో మినీ మేడారం జాతర ప్రారంభమైంది. ఈ జాతర ఈనెల 12 నుండి 15 వరకు జరుగుతుంది. ప్రతి రెండేళ్లకోసారి మేడారం జాతర జరగనున్న నేపథ్యంలో మధ్యలో వచ్చే మేడారం జాతరను పూజారులు ఆదివాసి సంప్రదాయాల పద్ధతిలో మినీ మేడారం జాతరగా నిర్వహిస్తారు. మాఘశుద్ధ పౌర్ణమి నుండి నాలుగు రోజులపాటు మండమెలిగే పండగగా పూజారులు నిర్వహిస్తారు. మన దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, మేడారం గ్రామంలోకి దుష్టశక్తులు రాకుండా మామిడాకులతో దిష్టి తోరణాలు కట్టారు. పున్నమి వెలుగుల్లో పూజారులు జాగారాలు చేస్తూ నిష్టగా పూజలు నిర్వహించారు. పెద్ద జాతరకు రాలేకపోయిన భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు మినీ మేడారం జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
జాతరకు ముందు నుంచే భక్తులు వేలాదిగా వచ్చి వనదేవతలను దర్శించుకుంటున్నారు. అమ్మవార్లకు బంగారం, పసుపు, కుంకుమ, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మినీ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టింది. రెండేళ్లకోసారి జరిగే మేడారం మహా జాతరకు భిన్నంగా మినీ మేడారం జాతర జరుగుతోంది. మండమెలిగే పండగ సందర్భంగా వనదేవతల పూజారులు ఉదయం మామిడి ఆకులతో తోరణాలు కట్టి గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజార్లు సమ్మక్క, సార్లమ్మ అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుధవారం సారలమ్మ పండగ సందర్భంగా ఏటూరునాగారం మండలం, కొండాయిలోని గోవిందరాజుల గుడిలో, పూనుగొండ్లలో పగిడిద్ద రాజు గుడితో పాటు కన్నెపల్లిలోని సరళమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారులు మేడారం ఆలయానికి చేరుకొని సారలమ్మ గద్దెను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మేడారంలోని వనదేవతల గద్దెల వద్దకు చేరుకొని సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దీప దూప నైవేద్యాలతో, జాగారాలతో వనదేవతలను కొలిచారు. అమ్మవార్ల పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించి మొక్కులు సమర్పించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మినీ జాతరలో కన్నయ్యగూడెం మండలం, ఐలాపూర్ గ్రామంలో ఆదివాసి గిరిజనులు సమ్మక్క సారలమ్మ ఆలయాలకు చేరుకున్న తర్వాత పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, బంగారం, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతర కంటే ఐలాపూర్‌లో మినీ జాతర అత్యంత ప్రాధాన్యం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతమైన ఐలాపూర్‌లో ఆదివాసి దేవతలైన సమ్మక్క, సారలమ్మలను గిరిజనులు దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు.