హైదరాబాద్: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు మినీ మేడారం జాతర జరుగనుంది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అమ్మవార్లకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మినీ జాతర (మండమెలిగే పండుగ) నిర్వహిస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన మండమెలిగే 2వ తేదీన సారలమ్మ గద్దె శుద్ధి, 3వ తేదీన సమ్మక్క గద్దె శుద్ధి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
శుద్ధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పిస్తారు. ఈ మినీ జాతరలో వన దేవతలను గద్దెలపైకి తీసుకురావడం మినహా మిగతా పూజా కార్యక్రమాలు యధావిధిగా కొనసాగనున్నాయి. మేడారంలోని సమ్మక్క పూజా మందిరంలో కొక్కెర కృష్ణయ్య, కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరంలో కాక సారయ్యలు, అమ్మవార్ల పూజారులు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.