దక్షిణ కుంభమేళగా ప్రసిద్ధ గాంచిన మేడారం మినీ జాతర తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేడారం మినీ జాతర జరుగనుంది. మేడారం మినీ జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క అధికారులతో మంగళవారం (డిసెంబర్ 7) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్‌కు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్, ఇతర అధికారులు, మేడారం పూజారులు హాజరయ్యారు. మేడారం మినీ జాతర తేదీ, ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం ఫిబ్రవరి 12వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేడారం మినీ జాతర నిర్వహించాలని నిర్ణయించారు.
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరగా ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. సమ్మక్క -సారక్కలను భక్తుల కష్టాలను కడతేర్చే వనదేవతలుగా, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా గుర్తించి వన దేవతలుగా పూజిస్తున్నారు.