Monday, January 13, 2025

ఆరేళ్ల నిబంధన అమలవుతుందా..?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకటో తరగతి ప్రవేశాల కనీస వయసు పై స్పష్టత కరువైంది. ఇప్పటి వరకు 5 ఏళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తుండగా, తాజాగా పిల్లలకు ఆరేళ్ల వయసు నిండిన తర్వాతనే ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని, అందుకు అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేయాలని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది.

ఇటీవల కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ వెలువడింది.కేంద్రీయ విద్యాలయాల్లో విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో ప్రవేశాలకు మార్చి 31వ తేదీ నాటికి ఆరేళ్లు నిండాలని నిబంధన విధించారు. అయితే ఈ నిబంధన కేంద్రీయ విద్యాలయాలకే వర్తిస్తుందా..?లేక అన్ని పాఠశాలలకు వర్తిస్తుందా..? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

మళ్లీ యుకెజినే చదవాలా..?
రాష్ట్రంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల్లో యుకెజి చదువుతున్న పిల్లలకు వచ్చే విద్యాసంవత్సరం ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తారా..? లేక మళ్లీ యుకెజినే చదవాలని చెబుతారా..? అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ బోర్డుల పాఠశాలలతో పాటు పలు స్టేట్ సిలబస్ స్కూళ్లలోనూ ప్రవేశాల ప్రక్రియ పూర్తి అయ్యింది. ఈ పాఠశాలలు ఐదేళ్ల వయసున్న పిల్లలకు ఒకటో తరగతిలో అడ్మిషన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రవేశాలను కొనసాగిస్తారా..? లేక కేంద్ర నిబంధనలకు అనుగుణంగా మళ్లీ ప్రవేశాలు నిర్వహిస్తారా..?

అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు రెండేళ్లు నిండిన పిల్లలను నర్సరీలో, మూడేళ్లు నిండిన వారిని ఎల్‌కెజిలో, నాలుగేళ్లు నిండితే యుకెజిలో చేర్పిస్తున్నారు. ఆరేళ్ల నిబంధన అమలులోకి వస్తే ఇప్పటికే నర్సరీ, ఎల్‌కెజి, యుకెజి చదువుతున్న పిల్లలు మరో సంవత్సరం అదనంగా చదవాల్సి వస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ లేకపోవడంతో కొంతమంది తల్లిదండ్రులు అంగన్‌వాడీలకు పంపిస్తుండగా, అత్యధికంగా ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కెజి, యుకెజిల్లోనే చేర్పిస్తున్నారు.
ప్రీ ప్రైమరీ పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన
ఆరేళ్ల నిబంధన అమలులోకి వస్తే పిల్లలు మరో ఏడాది ప్రీ ప్రైమరీ చదవాల్సి వస్తుంది. దీని వల్ల తల్లిదండ్రులకు ఆర్థికంగా భారమవుతుంది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలనుకుంటే ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏటా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు 5 లక్షల మంది విద్యార్థులు ఒకటో తరగతిలో ప్రవేశం పొందుతున్నారు.

వీరిలో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మూడు లక్షల మంది వరకు ఉంటారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కెజి, యుకెజిలలో సుమారు 9 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆరేళ్ల నిబంధనపై ప్రీ ప్రైమరీ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News