పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబరు 26 నుంచి రైతు నేత, క్యాన్సర్ వ్యాధి గ్రస్తుడు 70 ఏళ్ల జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నిరవధిక నిరశన దీక్ష చేపట్టడం యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. . పంజాబ్ హర్యానా సరిహద్దు లోని ఖనౌరీ శిబిరం వద్ద ఆయన దీక్ష ప్రారంభించడంతో రైతులు గత కొన్నాళ్లుగా సాగిస్తున్న ఆందోళన కొత్త మలుపు తిరిగి మరింత బలోపేతం అయింది. రానురాను ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీనికి గురువారం ( జనవరి 2) వరకు గడువు పెట్టింది. అయితే దల్లేవాల్‌కు వైద్యం అందించడానికి వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయని పంజాబ్ ప్రభుత్వం చేతులెత్తేసింది.
ఇదే సమయంలో దల్లేవాల్ నిరశన దీక్షకు సుప్రీం కోర్టు జోక్యంతో బ్రేక్ పడుతోందన్న తప్పుడు అభిప్రాయం దుమారం రేపింది.ఈ అపనింద పడడంతో పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు మందలించింది. తాము దల్లేవాల్ ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నాం తప్ప ఆయన నిరశన దీక్షకు ఎక్కడా బ్రేకు వేయలేదని వైద్యం తీసుకుంటూ నిరశన దీక్ష సాగించవచ్చని స్పష్టం చేసింది. ఇది అందరికీ తెలియజెప్పాలని పంజాబ్ ప్రభుత్వానికి సూచించింది. ఇదిలా ఉండగా తమ డిమాండ్లకు కేంద్రం ఒప్పుకుంటేనే దల్లేవాల్ నిరసన దీక్షను విరమిస్తారని రైతు నాయకులు సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీ , స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు కనీస మద్దతు ధరకుచట్టబద్ధత , మూడు వ్యవసాయ చట్టాలపై గతంలో ఆందోళన సాగించిన రైతులపై ఉన్న కేసులను ఎత్తి వేయడం ఇవన్నీ నెరవేర్చాలని సంయుక్త కిసాన్ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్( ఏక్తా యుగ్రహాన్ ) తదితర ప్రధానవ్యవసాయ సంఘాలు ఎంతగా అభ్యర్థించినా ప్రభుత్వాల నుంచి ఎలాంటి చొరవ కనిపించ లేదు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి హామీ ఇవ్వలేని కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకోవడం రైతులపై కపట ప్రేమ నాటకమే.
డై అమోనియం పాస్ఫేట్ ఎరువుపై అదనపురాయితీ కింద రూ. 3850 కోట్ల వరకు వన్‌టైమ్ ప్యాకేజీగా ఇవ్వడానికి నిర్ణయించినట్టు ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటోంది. ఇక ప్రధాని మోడీ అమాంతం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ప్రగల్భాలు పలుకుతున్నారు. సేద్యానికి ఎరువులు అవసరమే కానీ, పండించిన పంటలే గిట్టుబాటు ధరకు అమ్ముడు పోనప్పుడు ఎరువుల సబ్సిడీ వల్ల రైతులకు ఏం కలిసివస్తుంది ? గతంలో కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను నిరసిస్తూ రైతులు సాగించిన ఉద్యమాన్ని కేంద్రం ఎంతగా ఉక్కుపాదం మోపి అణగదొక్కిందో, ఎలా నేరస్థులను చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు రైతులపై ప్రేమ నటించడం పిల్లి రొయ్యల మొలతాడు కట్టుకుని రుద్రాక్షమాలలు ధరించిన సామెత గుర్తుకు వస్తుంది. ఆనాడు రైతుల ఆగ్రహానికి బెంబేలెత్తిన మోడీ సర్కారు అప్పటికప్పుడు ఆ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించి చేతులు దులుపుకుంది. కానీ మళ్లీ దొడ్డిదారిన ఆ మూడు వ్యవసాయ చట్టాలను ప్రవేశ పెట్టేందుకు పావులు కదుపుతోందని వార్తలు వస్తున్నాయి.
ఈ చట్టాలపై కొత్తగా అభిప్రాయాల సేకరణకు అన్ని రాష్ట్రాలకు కొత్తపాలసీ కాపీలు పంపారని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపిస్తుండటంలో వాస్తవం లేకపోలేదు. నేషనల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఆన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ముసాయిదా పాలసీని ఇటీవల కేంద్రం ప్రకటించింది. దీనిని దృష్టిలో పెట్టుకునే కేజ్రీవాల్ దాని గుట్టుబయటపెట్టారు. అయితే విధానపరమైన అంశాలు, శాంతిభద్రతలు, రాజకీయాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీం కోర్టు విధించిన గడువు , మార్గదర్శకాలు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో అన్నది చర్చకు వస్తోంది. కోర్టులు ఇందులో జోక్యం చేసుకొనే సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వాలు మాత్రం తమవంతు బాధ్యతగా, ఇలాంటి ఆందోళనలకు పరిష్కారం చూపించడమే సమంజసం. రైతుల డిమాండ్లు ప్రభుత్వం ముందు చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి.
దీనికి తోడు వ్యవసాయ సంక్షోభం బహుముఖాలుగా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నెలలు, సంవత్సరాల పాటు శాశ్వతంగా రైతులు ధర్నాలు, నిరసనలు కొనసాగించడం , ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దేశానికి నష్టమే. దల్లేవాలా దీక్ష విరమించాలని వస్తున్న అభ్యర్థనలను ఆయన మద్దతుదారులు పక్కన పెడుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలా అభ్యర్థనలు చేస్తున్నవారు ప్రభుత్వ ఏజెంట్లన్న ముద్ర పడుతోంది. అలాగే కొందరి ఒత్తిళ్ల వల్ల దల్లేవాల్ దీక్షను కొనసాగిస్తున్నారన్న ఆపోహలకు తావీయరాదు. దల్లేవాల్ ఒంటరిగా దీక్ష చేయడం కన్నా ఉమ్మడిగా కొంతమంది రైతులతో కలిసి దీక్ష కొనసాగించడం ఆయన ఆరోగ్యానికి భద్రత కలిగిస్తుందని కొందరు రైతు నాయకులు సలహాలు ఇస్తున్నారు. వీటిని దల్లేవాల్ వర్గీయులు పరిశీలన లోకి తీసుకోవడం అవసరం. ఈ పరిస్థితుల్లో దల్లేవాలా ఆరోగ్యానికి ఎలాంటి ముప్పుకలగబోదని . హర్యానా, పంజాబ్ , కేంద్ర ప్రభుత్వాలు భరోసా ఇవ్వడం తక్షణ కర్తవ్యం. ఇదిలా ఉండగా, రైతులతో చర్చలు ఎప్పుడు ప్రారంభిస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాను మీడియా ప్రశ్నించగా, సుప్రీం కోర్టు సూచనల మేరకు తమ ప్రభుత్వం వ్యవహరిస్తుందని వెల్లడించారు. అంటే కేంద్ర అధిష్ఠాన కటాక్షం పైనే అంతా ఆధారపడి ఉందన్న మాట!