Thursday, December 19, 2024

గిట్టుబాటు కోసం రోడెక్కిన రైతాంగం

- Advertisement -
- Advertisement -

పరిగి: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వేరుశనగ పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా, పరిగిలో రైతులు శనివారం రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రస్తుత సీజన్‌లో తాము పండించిన వేరుశనగ పంటకు గిట్టు బాటు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగి బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో, ధర్నా, నిరసన తెలిపారు. దీంతో సుమారు కిలో మీటరు పొడవునా ఇరువైపులా పలు వాహనాలు భారీగా స్తంభించి పోయాయి. రాకపోకలకు తీవ్రంగా అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. పరిగి మండలంతో పాటు దోమ మండలానికి చెందిన గిరిజన రైతులు, ఇతర రైతులు పండించిన వేరుశనగను మార్కెట్‌కు తీసుకువస్తే గత వారంలో రూ.8 వేలకు పలికిన క్వింటాల్ ధర ఈ వారంలో వెయ్యికి పైగా ఎందుకు తగ్గించారని మండిపడ్డారు.

వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై రూ.6500కు క్వింటాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధరను తగ్గించి రైతులను నట్టేట ముంచారని ఆవేదన చెందారు. కొందరు వ్యాపారులు మార్కెట్‌లో ఏళ్లుగా తిష్టవేసి వారు చెప్పిందే ధర అన్నట్లు వ్యవహరిస్తూ, అధికారులు వారికి వత్తాసు పలుకుతూ రైతులను నష్టపోయేలా చేస్తున్నారని కన్నెర్ర చేశారు. దీంతో తాము రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు రైతులు అన్నారు. ధర్నా సందర్భంగా పోలీసులు జోక్యం చేసుకుంటుండగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీస్ నశించాలని ..పోలీస్‌లు వెంటనే తప్పుకోవాలని నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో డిఎస్‌పి కరుణ సాగర్‌రెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన సంఘటన స్థ్థలానికి వచ్చి ధర్నా చేస్తున్న పలువురు రైతులను సముదాయించి పంపించారు. వెంటనే మార్కెట్ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు తిరిగి అందోళన చేయగా ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. వెంటనే సంబంధిత శాఖ అధికారులతో, స్థానిక వ్యాపారులతో మాట్లాడి వేరుశనగ పంటకు గిట్టు బాటు ధర కల్పించాలని పోలీస్‌లు చెప్పడంతో విరమింపజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News