Wednesday, January 22, 2025

మద్దతు ధరల చట్టం ఎప్పుడు?

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: ప్రధాని మోడీ ప్రభుత్వానికి రైతులపై మక్కువ ఎక్కువైపోయింది. చెరకు ధరను మరి రూ. 10 పెంచి క్వింటాలు రూ. 315కి చేర్చింది. యూరియా సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రత్యేక పథకాన్ని అమలు చేయదలచింది. బుధవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలను తీసుకొన్నది. 2024 ఏప్రిల్‌లో వచ్చే చెరకు పంటకు ఈ కొత్త ధర వర్తిస్తుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో వుంచుకొని ఈ నిర్ణయాలు తీసుకొన్నట్టు బోధపడుతున్నది. అమెరికా, ఈజిప్టు పర్యటనల నుంచి వచ్చిన తర్వాత ప్రధాని మోడీ లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని గెలిపించుకోడం మీదనే దృష్టి కేంద్రీకరించారని అర్థమవుతున్నది.

చెరకు అత్యధికంగా పండించే రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో వుండగా, దానికి నువ్వా నేనా అనే పోటీ ఇస్తూ రెండో స్థానంలో మహారాష్ట్ర, మూడో స్థానంలో కర్ణాటక వున్నాయి. తమ ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ. 50 వేలు సాయం అందిస్తున్నదని కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, అనురాగ్ ఠాకూర్‌లు మంత్రివర్గ సమావేశం తర్వాత బుధవారం నాడు ప్రకటించారు. అయితే స్వాతంత్య్ర వజ్రోత్సవాల బహుమతిగా 2022 23 ఆర్థిక సంవత్సరంలోనే దేశంలోని రైతుల అందరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని ప్రధాని మోడీ చేసిన వాగ్దానం ఏమైపోయిందో తెలియదు. దేశంలో 90 కోట్లకు మించి రైతు కుటుంబాలు వుండగా, ప్రధాని కిసాన్ పథకం కింద ఏడాదికి మూడు సమాన వాయిదాల్లో రూ. 6000 నగదు ఇచ్చే పథకం కేవలం 10.74 కోట్ల కుటుంబాలకే అందుతున్నది. అంటే కేవలం 10 శాతం రైతు కుటుంబాలే ఈ కనీస లబ్ధిని పొందుతున్నాయి. 2016లో ప్రారంభించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం పరిమిత సంఖ్యలోని రైతులకే వర్తిస్తున్నది.

Minimum support price in india

రైతుల కోసం ఉద్దేశించిన 17 పథకాలకు 202021 ఆర్థిక సంవత్సరంలో రూ. 17,540 కోట్లు కేటాయించగా, అందులో రూ. 5,787 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపులో 33% మాత్రమే ఖర్చు అయింది. ఇందులో మూడు పథకాల కింద ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదని సమాచారం. రైతు సంక్షేమం కోసం ఆచరణలో ఇంత తక్కువ స్థాయి కృషి జరుగుతున్నప్పుడు వారి ఆదాయం ఏ విధంగా రెట్టింపు అవుతుందో అర్థం కాని విషయం. 2019లో దేశ వ్యాప్తంగా కనీసం 5,957 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజుకి సగటున 16 మంది రైతులు ప్రాణాలను త్యజించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి 2020 వరకు గల ఆరు సంవత్సరాల్లో రైతు ఆత్మహత్యలు అత్యధికంగా జరిగినట్టు వెల్లడైంది.

2018లో 5,763 మంది, 2017లో 5,955 మంది, 2016లో 6,270 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. సంస్థాగత రుణాలు అందుబాటులో లేక, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడుతున్నందున రైతులు సాగు మీద సంపాదిస్తున్న దానికి, తీర్చవలసిన అప్పుకి లంగరు అందడం లేదు. వ్యవసాయ ఆదాయానికి మించి అప్పులు పేరుకుపోడంతో వున్న ఎకరా, అర ఎకరా భూమిని అమ్ముకొని కౌలు రైతులుగానో, వ్యవసాయ కార్మికులు గానో మారిపోతున్న రైతులు ఎంతో మంది వున్నారు. ఆడ పిల్ల పెళ్ళి చేయలేక ఉరి తాడును ఆశ్రయిస్తున్న వారున్నారు. రైతులకు ఇంత చేశాం, అంత చేశాం అని చెప్పుకొనే కేంద్ర ప్రభుత్వం 2020 ఆగస్టు నుంచి 2021 డిసెంబర్ వరకు దాదాపు ఏడాదిన్నర కాలం ఢిల్లీ సరిహద్దుల్లో జరిగిన చరిత్రాత్మకమైన రైతు ఉద్యమం వల్ల రైతులకు గట్టిగా చేసిందేమీ లేదు. మూడు నల్ల చట్టాలను వారి ముందు ఉరి తాళ్ళ మాదిరిగా వేలాడ దీసి రెచ్చగొట్టి ఉద్యమంలోకి లాగిన కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యమ ఉధృతికి తాళలేక చివరికి వాటిని ఉపసంహరించుకొన్నట్టు ప్రకటించింది.

ప్రధాని మోడీ దేశానికి క్షమాపణలు చెప్పుకొన్నారు. కాని మొత్తం 23 పంటలకు మద్దతు ధరను హామీ ఇస్తూ చట్టాన్ని చేయాలన్న వారి అసలు డిమాండ్ ఇంత వరకు నెరవేరలేదు. దీనిపై చర్చలు జరిపి చట్టాన్ని తెస్తామని ఇచ్చిన హామీని ప్రధాని మోడీ ప్రభుత్వం మరిచిపోయింది. ఇతర అన్ని సరకులకు, సామగ్రికి లాభసాటి ధరలను నిర్ణయించి అమ్ముకొనే స్వేచ్ఛ వాటి ఉత్పత్తిదారులకు వుండగా, ఒక్క వ్యవసాయోత్పత్తుల విషయంలోనే రైతుకు అటువంటి స్వేచ్ఛ లేకపోడం అన్యాయం. రైతుల శ్రమ మీద దళారులు బాగుపడుతున్నారు గాని, వారు మాత్రం రోజురోజుకీ కుంగిపోతున్నారు. ఈ పరిస్థితి తొలగాలంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా అసలు ఖర్చుకి రైతు ఇంటిల్లిపాది చేసే శ్రమ విలువను కూడా చేర్చి ఆ మొత్తానికి ఒకటిన్నర రెట్లు మద్దతు ధరగా నిర్ణయించవలసి వుంది. రైతు కోసం ఏదైనా చేస్తామంటారు గాని, స్వామినాథన్ కమిషన్ సిఫారసు యధాతథంగా ఇంత వరకు అమలు చేయకపోడమే అసలు విషాదం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News