Monday, December 23, 2024

మానవ తప్పిదం వల్లే పోలవరానికి తీవ్ర నష్టం:మంత్రి అంబటి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మానవ తప్పిదం వల్లనే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్ట వాటిల్లిందని ఏపి నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు పనులను మంత్రి అంబటి రాంబాబు ఆదివారం ఉదయం పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు అధికారులతో ఆయన ప్రాజెక్ట్ పనుల పరోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే ప్రాజెక్ట్‌కి తీవ్ర నష్టం ఏర్పడిందని ఆరోపించారు. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించాయని.. గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిందని పేర్కొన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పెద్దపెద్ద అగాధా ఏర్పడ్డాయన్నారు. గత వరదల్లో 485 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టు తేలిందన్నారు.

ఎన్‌హెచ్‌పిసి ,పిపిఏ బృందాలు అన్ని విధాలుగా పరిశీలన చేసి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించారని అంబటి తెలిపారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టి మిగతా పనుల్లో ముందుకు వెళ్లవచ్చని ఆ బృందాలు సూచించాయన్నారు. త్వరలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులను చేపడతామని అన్నారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బ తిన్న ప్రాంతాలను రిపేర్ చేసిన తర్వాత ఈసిఆర్‌ఎఫ్ డ్యాం పనులు మొదలుపెడతామన్నారు. వచ్చే నాలుగు నెలలు చాలా కీలకం కానున్న నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని చెప్పారు. ఈ సీజన్ లో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే రోజు కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News