Saturday, January 25, 2025

ప్రజా పాలన కాదు.. ప్రజా వంచన దినోత్సవంగా జరుపుకోండి:బండి సంజయ్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో ప్రజా పాలన దినోత్సవంగా కాకుండా, తెలంగాణ ప్రజా వంచన దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే తామూ భాగస్వాములం అవుతామని అన్నారు. తెలంగాణ ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా? అని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాల నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తోపాటు పలువురు నేతలతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ ను బండి సంజయ్ తిలకించారు. అనంతరం వారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లపై నిప్పులు చెరిగారు. సెప్టెంబర్ 17న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్వవం ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం’ పేరుతో ఆ పార్టీ తెలంగాణ ప్రజలను వంచిస్తోందన్నారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస పార్టీ ప్రజలను వంచించినందున ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవాన్ని’ నిర్వహించుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని మాట ఇచ్చిన తరువాత వరుసగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మోదీ ఆదేశాలు, అమిత్ షా సూచనల మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కేంద్ర హోంశాఖ భాగమై ఈ ఉత్సవాలు నిర్వహిస్తోందని అన్నారు. అందులో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఫోటో ఎగ్జిబిషన్‌ను చూడగటానే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణకు విముక్తి కోసం చేసిన పోరాటాలు, సమర యోధుల త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపారని కొనియాడారు.

రజాకార్ల పాలనలో దారుణాలు అన్నీ ఇన్నీ కావని చెబుతూ బైరాన్ పల్లి, గుండ్రాంపల్లి, పరకాల, వెయ్యి ఊడల మర్రి సంఘటనలు ఇంకా కళ్ల ముందు మెదులుతున్నాయని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నగ్నంగా మహిళలను బతుకమ్మ ఆడించిన దురాగతాలు మరవలేమని వాపోయారు. నిజాం నిరంకుశ పాలనపై కొమరం భీం, చాకలి ఐలమ్మ, స్వామి రామానంద తీర్ధ, బూర్గుల రామక్రిష్ణారావు, కొండా లక్ష్మణ్ బాపూజీ పోరాటాలను, హిందూ మహాసభ, ఆర్య సమాజ్ పోరాటాలను గుర్తుచేసేందుకు, రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి వివరించారు. తెలంగాణ విమోచన దినోత్సవానికి ప్రధాన కారకులు సర్దార్ వల్లభాయి పటేల్ అని అన్నా రు. దేశంలోని 562 సంస్థానాలు విలీనం చేసే క్రమంలో హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసేందుకు నిజాం అంగీకరించలేదు.

దేశమంతా స్వాతంత్య్రం వచ్చినా తెలంగాణకు స్వాతంత్య్రం రాకపోతే భారతమాత కడుపులో క్యాన్సర్ గడ్డ అట్లాగే ఉండిపోతుందనే ఉద్దేశంతో ఆఫరేషన్ పోలోతో శస్త్ర చికిత్స చేసి తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్ వల్లభాయి పటేల్ అని బండి సంజయ్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఫొటో ఎగ్జిబిషన్ ను సందర్శించాలని ఆయన తెలిపారు. అనంతరం పరేడ్ మైదానంలో యువకులతో కలిసి కాసేపు కేంద్ర మంత్రి క్రికెట్ ఆడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News