Monday, December 23, 2024

హిందీ నేర్చుకుంటే ఉద్యోగాలు వస్తే.. వాళ్లెందుకు పానీ పూరీ అమ్ముతారు?

- Advertisement -
- Advertisement -

Minister Dr. K. Ponmudi setires on Hindi language

చెన్నై: హిందీయేతర రాష్ట్రాల ప్రజలు ఇంగ్లీషుకు బదులు హిందీలోనే మాట్లాడుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ దుమారం చెలరేగుతోంది. అందరికన్నా తమిళనాడునుంచి దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడే అమిత్ షా వ్యాఖ్యలను తిప్పికొట్టారు. తమ రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సైతం రాష్ట్రంలో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని గుర్తు చేస్తూ హెచ్చరికలు చేశారు. కాగా తాజాగా తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ కె. పొన్ముడి ఈ విషయంపై స్పందిస్తూ సెటైర్లు వేశారు.

హిందీభాష మరిన్ని ఉద్యోగాలు కల్పించేదే అయితే వాళ్లు (ఉత్తర భారత దేశం వారు)ఎందుకు పానీ పూరీ అమ్ముకొంటున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాదు తమిళనాడులో స్థానిక భాష అయిన తమిళం, అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు మాత్రమే ఉంటాయని చెప్పారు. రాష్ట్రంలో ద్విభాషా విధానమే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం భారతీయార్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో యూనివర్శిటీ చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ‘ హిందీని కానీ, వేరే ఏ భాషను కానీ ఎవరిపైనా బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు’ అని ఆయన స్పష్టం చేశారు. కాగా, హిందీపై తమిళనాడు ప్రజల మనోభావాలను కేంద్రానికి గవర్నర్ తెలియజేస్తారనే ఉద్దేశంతోనే తాను ఈ వేదికపై ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ తర్వాత పొన్ముడి చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News