హసన్‌పర్తి : రాబోయే ఎంఎల్‌సి ఎన్నికల్లో తెలంగాణ గ్రాడ్యుయేట్ ఓటర్లు బిజెపి అభ్యర్థికి ఓటేస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ పరిధిలో 55వ డివిజన్‌లో కెఎల్‌ఎన్ ఫంక్షన్‌హాల్‌లో ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ టిఆర్‌ఎస్ ముఖ్యకార్యకర్తల సన్నాహక సమావేశం వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేసే ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ పార్టీ అని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నెంబర్‌వన్ గా ఉందన్నారు. అన్నివర్గాల సంక్షేమమే టిఆర్‌ఎస్ ప్రభుత్వ లక్షమన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు.
పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. రాబోయే పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎంఎల్‌సి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. వర్ధన్నపేట ఎంఎల్‌ఎ ఆరూరి రమేష్, ఎంఎల్‌సి అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలు మాట్లాడుతూ 2014 ముందు తెలంగాణ ఎలా ఉంది.. గడిచిన ఆరేండ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆలోచించాలని కోరారు. వివిధ శాఖలలో లక్షకుపైగా ఉద్యోగాలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసిందని, రాబోయే రోజుల్లో మరో 60 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ కార్పొరేటర్, డివిజన్ టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు గడ్డం శివరామకృష్ణ, 57వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ విజయ్‌కుమార్, జడ్పిటిసి సునీత, వైస్ ఎంపిపి, 56వ డివిజన్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్, నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పాల్గొన్నారు.