స్వాతంత్య్ర ఉద్యమంలో బిజెపి పాత్ర ఏంటి?
తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపికి ఏం సంబంధం?
ఎజెండాలేని జెండాలతో తెలంగాణపై బిజెపి దండయాత్ర చేస్తోంది!
మత విద్వేశాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది
ప్రజలు అప్రమత్తంగా ఉండాలె
మన తెలంగాణను, మన సీఎంను మనం కాపాడుకోవాలి
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో బిజెపిపై మంత్రి ఎర్రబెల్లి ఫైర్
పాలకుర్తి: జాతి పిత మహాత్మా గాంధీజీని చంపిన గాడ్సే వారసులెవరో బిజెపి ప్రజలకు చెప్పాలి? అసలు స్వాతంత్య్ర ఉద్యమంతో బిజెపికి ఏదైనా పాత్ర ఉందా? పోనీ బిజెపిలో ఉన్న వాళ్ళకైనా సమరయోధుల వారసత్వం ఉందా? తెలంగాణ సాయుధ పోరాటానికి బిజెపికి ఏమైనా సంబంధం ఉందా? అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిజెపిని నిలదీశారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులు, యువకులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు, పార్టీ శ్రేణులతో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలర్యాలీ, బహిరంగ సభలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… బిజెపిపై ధ్వజమెత్తారు. కనీసం స్వాతంత్య్ర వారసత్వం గానీ, తెలంగాణ సాయుధ పోరాట వారస్తవం గానీ లేదన్నారు. లేనిపోని ఏజెండాలతో జాతీయ జెండాను ఎగురవేసే కార్యక్రమాలను పనిగట్టుకుని పెట్టుకుని తెలంగాణపై ఆ పార్టీ దండయాత్ర చేస్తోందన్నారు. రాష్ట్రానికి రావచ్చు.. పోవచ్చు. దాన్ని ఎవరూ తప్ప పట్టరని, కానీ బిజెపి నేతలు టూరిస్టుల్లా అదే పనిగా మన రాష్ట్రానికి వస్తూ, మన మధ్య మత తత్వ చిచ్చు పెట్టి, విద్వేషాలను రెచ్చగొట్టి లేని పోని సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. విలీనం, విమోచనం పేరుతో ఇక్కడి ముస్లీం, హిందూ ప్రజల మధ్య లేనిపోనివి రెచ్చగొడుతున్నారన్నారు. అందుకే సిఎం కెసిఆర్ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ మూడు రోజులపాటే గాకుండా, ఈ ఏడాదంతా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారన్నారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నందునే మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని తెలిపారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో, మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రం ఐటీ రంగంతోపాటు అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా నిలిచిందని, దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా ఉందని మంత్రి తెలిపారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న తెలంగాణ దాన్ని అడ్డుకోవడానికి బిజెపి కుట్ర పన్నుతుందని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అయితే, ఇలాంటి మత తత్వ పార్టీల నుండి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలని, అలాగే మన సిఎంని మనం కాపాడుకోవాలని, అలాంటి మాయలోపడి విద్వేషాలకు పోకుండా, ఆ రెచ్చగొట్టే వాళ్ళకే తగిన బుద్ధి చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…. బిజెపికి అభివృద్ధి ఎంజెడా లేదన్నారు. రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని విమర్శించడం, విద్వేషాలు రెచ్చగొట్టడమే తప్ప మరో ఎజెండా కూడా లేదన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి, తమ పార్టీని ప్రతిష్టింప చేయడంతో మరోపనే లేకుండా పనిచేస్తున్నదన్నారు. స్వతంత్ర భారతంలో బిజెపి వంటి విద్వేష పూరిత పార్టీ లేనేలేదన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలు బిజెపి మత ఉచ్చులో పడొద్దన్నారు. ఆ పార్టీ అభివృద్ధి నిరోధకంగా మారిందని, సెంటిమెంట్లతో ప్రజలను మభ్య పెడుతోందని ఆయన పేర్కొన్నారు.