నల్గొండ: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో భాగంగా చండూరు 2వ, 3వ వార్డులలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం చేశారు. మంగళవారం 2వ, 3వ వార్డులలో విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికీ వెళుతూ, టిఆర్ఎస్, కారు గుర్తుకు ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. మంత్రి ఎర్రబెల్లితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుండి ప్రచారం కోసం వెళ్ళిన నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… బిజెపిని ఈ ఉపఎన్నికలో ఒడించాలన్నారు. మునుగోడు లో గతంలో టిఆర్ఎస్ ని ఆదరించక పోయినా, కెసిఆర్ ఇక్కడ అన్ని పథకాలను అందించి, అభివృద్ధి చేశారని చెప్పారు. అభివృద్ధి కొనసాగాలంటే, మునుగోడు టిఆర్ఎస్ గెలవాలని తెలిపారు.
బిజెపి కావాలని ఈ ఎన్నికలు తెచ్చిందని విమర్శించారు. వేల కోట్లకు అమ్ముడు పోయిన కొందరి స్వార్థంతో ఈ ఎన్నిక వచ్చిందన్నారు. అలాంటి వాళ్లకు, అవకాశ వాడులకు తగిన బుద్ధి చెప్పే, అవకాశం ఇప్పుడు ప్రజలకు వచ్చిందన్నారు. ప్రజలు బాగా ఆలోచించి తమ ఓటు హక్కు ను వినియోగించుకోవాలని కోరారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బిజెపిలో చేరిన వ్యక్తి, ఈ ఏడాదిలో ఏమి చేయగలడు? అని ప్రశ్నించారు. ప్రజలు ఎవరు ఏమీ చేశారో విశ్లేషించుకోవాలని తెలిపారు. ఇంటి పార్టీ, సొంత మనుషులనే ఎన్నుకోవాలన్నారు. సిఎం కెసిఆర్ చేసిన అభివృద్ధి దేశంలోనే ఎవరూ చేయలేదని సూచించారు. రాష్ట్రాన్ని, మన గ్రామాలను దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కెసిఆర్ దే అన్నారు. మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే, మన నాయకులు, మనకు ప్రతినిధులుగా ఉండాలన్నారు. పేదలకు రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలతో ఎంతో అభివృద్ధి చేశారు. మిషన్ భగిరథతో మునుగోడులో ఫ్లోరైడ్ లేకుండా చేసిన ఘనత ఎవరిదో మీకు తెలుసన్నారు. ఇంతకాలం ఏలిన నాయకులకు ఈ సోయి వచ్చిందా? అలాంటి పార్టీలు, నాయకులు మనకు అవసరమా? అందుకే అలాంటి పార్టీలను ఈ ఎన్నికలో బొంద పెట్టాలన్నారు. టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలన్నారు. సారు, కారుతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.