వరంగల్ : దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్‌కు సమానమైన గ్రాంట్‌ను అదనంగా ఇస్తూ గ్రామ పంచాయతీలను తెలంగాణ ప్రభుత్వం బలోపేతం చేస్తుంటే.. కొత్త చట్టాలు తీసుకొచ్చి సర్పంచ్‌ల అధికారాలను, నిధులను కేంద్రం తగ్గించిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తప్పుడు మాటలతో బిజెపి సర్పంచ్‌లను తప్పుదారి పట్టిస్తోందని, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి సర్పంచ్‌లకు సంపూర్ణ అవగాహన కల్పించి వారిని సరైన దారిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి అన్నారు.
వరంగల్ జడ్పి కార్యాలయంలో బుధవారం జడ్పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. జడ్పిటిసిలు, ఎంపిపిలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కొరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీనిచ్చారు.
ఈసందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రూ.1800 కోట్లు రోడ్ల కోసం సిఎం కెసిఆర్ ఇచ్చారని, అందులో మేయింటనెన్స్ కోసం రూ.వెయ్యి కోట్లు, దెబ్బతిన్న రోడ్ల కోసం, రూ.800 కోట్లు అదనంగా ఇచ్చారన్నారు. రైతులకు ఎవరు చేయనంత తెలంగాణ ప్రభుత్వం చేస్తుందన్నారు. ఈఏడాది వరంగల్ జిల్లాలో రైతు బంధు కింద వానాకాలంలో 2,లక్షల 84 వేల మందికి రూ.266.20 కోట్లు ఇస్తున్నామన్నారు. గ్రామం వారిగా రైతు బంధు ఎంత వస్తుంది..? లబ్ధిదారుల జాబితా సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి, ఎంపిపి, ఎంఎల్‌ఎలకు ఇవ్వాలని అధికారులను ఆదేశిచారు.
రైతు బీమా రూ.5 లక్షలు ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఇస్తుందని ఎక్కడ కూడా ఈపథకం లేదన్నారు. ప్రతి గ్రామపంచాయతీ ముందు ప్రభుత్వ పథకాలు, లబ్ధిదారుల నిధుల వివరాల బోర్డు పెట్టాలన్నారు.ఫామ్ ఆయిల్ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని, 2 వేల ఎకరాలు వరంగల్ జిల్లాలో ఫామ్ ఆయిల్ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రైతు వేసుకునే పంట ఆయిల్ ఫామ్ అని అందరిని ప్రోత్సహించే ఏర్పాటు అధికారులు చేయాలన్నారు. సర్పంచ్‌లను పక్క దోవ పట్టించే ప్రయత్నం బిజెపి చేస్తుందని దీనిని తిప్పికొట్టాలన్నారు. పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం మొత్తం గ్రాంట్ రూ.1202.75 కోట్లు, గ్రామానికి ఇచ్చేవి రూ.5 లక్షలు, ఇప్పటి వరకు ఈఏడాది జిల్లా పరిషత్‌లకు రూ.86 కోట్లు విడుదల చేశామన్నారు.
కేంద్రం గతంలో ఇచ్చే గ్రాంట్‌ను తగ్గించిందని, కేంద్రం ఇచ్చే గ్రాంట్‌కు సమానంగా ఇస్తుంది కేవలం తెలంగాణ రాష్ట్రమేనన్నారు. గతంలో రూ.1830 కోట్లు కేంద్రం ఇచ్చేదని, ఈఏడాది రూ.500 కోట్లు తగ్గించిందని, ఈఏడాది ఒక్కరూపాయి ఇవ్వలేదన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రతి ఏటా పంచాయతీలకు రూ.330 కోట్లు విడుదల చేస్తే అందులో 50 శాతం వాటా కాగా 50 శాతం కేంద్ర వాటా మాత్రమేనన్నారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధుల్లో ఒక్కరూపాయి ఇవ్వకున్నా రాష్ట్రం ప్రతి నెలా రూ.256 కోట్లు విడుదల చేస్తుందని తెలిపారు.
గ్రామ పంచాయతీలు బలోపేతం చేసింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు. జడ్పిటిసిలు, ఎంపిపిలకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని కోరగా ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయిస్తానని తెలిపారు. ఈసమావేశంలో వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్‌లు డాక్టర్ బి.గోపి, రాజీవ్‌గాంధీహనుమంతు, నర్సంపేట ఎంఎల్‌ఎ పెద్ది సుదర్శన్‌రెడ్డి, అదనపు కలెక్టర్ అశ్వినితానాజివాకాడే, జడ్పి సిఈఒ సాహితిమిత్ర, జడ్పిటిసిలు, ఎంపిపిలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.