Monday, December 23, 2024

రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Fires on PM Modi's Govt

రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
గ్రామపంచాయతీలకు వచ్చే నిధుల్లోనూ బిజెపి సర్కార్ కిరికిరి
పల్లెలకు కేంద్రం నిధులు ఇవ్వడంలో ఎందుకు తాత్సర్యం చేస్తోంది
మోడీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగిన మంత్రి ఎర్రబెల్లి

మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు మన రాష్ట్రం హక్కు అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివ-ద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. దానిని కూడా కేంద్రం కాలరాసే విధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలకు హక్కుగా వచ్చే నిధులను కూడా కేంద్రం అడ్డుపడుతుండడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెలు అభివృద్ధి చెందడం కేంద్రానికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోందన్నారు. సోమవారం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటులోని తన కార్యాలయంలో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు రవిచంద్రతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవరి రాథోడ్, ఎంపీలు కె. కేశవరావు, నామా నాగేశ్వర రావు, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎంఎల్‌సిలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, బండా ప్రకాశ్, తాతా మధు, శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, శంకర్ నాయక్, పెద్ది సుదర్శన్ రెడ్డి, నన్నపనేని నరేందర్, వరంగల్ మహా నగర మేయర్ గుండు సుధారాణి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు వాసుదేవ రెడ్డి, నాగూర్ల వెంకన్న, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, కేంద్రంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రాల పట్ల మోడీ ప్రభుత్వంపై మొండిగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఫెడరల్ వ్యవస్థకు తూట్లు పొడిచే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న కారణంగానే ముఖ్యమంత్రి కెసిఆర్ బిజెపి సర్కార్‌పై యుద్ధం ప్రకటించారని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో మోడీ పాలనలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం శూన్యమని విమర్శించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను మోడీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు. ఈ నేపథ్యంలో అవి అమలయ్యే వరకు కేంద్రంతో పోరాటం ఆపేదిలేదని ఆయన స్పష్టం చేశారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో పలు సాగునీటి ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం అందిస్తున్న కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం ఎందుకు సాయం చేయడం లేదని ఆయన నిలదీశారు. ఇది రాష్ట్రం పట్ల కేంద్రం చూపిస్తున్న వివక్షకు నిదర్శనం కాదా! అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయాలపై రాష్ట్రానికి చెందిన బిజెపి ఎంపీలు ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదని మంత్రి ఎర్రబెల్లి నిలదీశారు. పైగా రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను బదనాం చేయాలని చూస్తున్నారన్నారు. ఒక పక్క వడ్లు కొనమని చెబుతున్న కేంద్రం వడ్లు కొనే రైస్ మిల్లర్లపై కేసులు పెడుతున్నారన్నారు. ఇది ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.
సిఎం కెసిఆర్ పాలనలో బడుగు…. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత లభిస్తోందని ఎంపి నామా నాగేశ్వర్‌రావు ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారన్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో చిచ్చుపెట్టేందుకు బిజెపి నాయకులు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆ పార్టీ నేతలు ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా… రాష్ట్ర ప్రజలు సిఎం కెసిఆర్ వైపే ఉంటారన్నారు.

Minister Errabelli Fires on PM Modi’s Govt

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News