అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు
వరద బాధితలకు భరోసాగా తెలంగాణ సర్కార్!
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి, పంచాయతీరాజ్ అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
హైదరాబాద్: వరద బాధితులకు అండగా తెలంగాణ సర్కార్ నిలుస్తున్నది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నిన్నమొన్నటి వరకు స్వయంగా సిఎం కెసిఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ లు వరద ముంపు ప్రాంతాలను పర్యటించారు. ఏరియల్ సర్వే చేశారు. అధికారులతో సమీక్షలు జరిపి తీసుకోవాల్సిన చర్యలను ఆదేశించారు. అక్కడితో ఆగకుండా, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్ కు వచ్చిన వెంటనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ అధికారులతో సమీక్షించారు. మంత్రుల నివాసంలో వరద ముంపు ప్రాంతాల పరిస్థితులను, తీసుకుంటున్న చర్యలను ఒకసారి పరిశీలించారు.
ఇటీవల కురిసిన వర్షాలకు ఆతలాకుతలమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున పంచాయతీరాజ్ అధికారులను సహాయక చర్యల నిమిత్తం నియమించారు. అలాగే ఫాగింగ్ వంటి చర్యలు యంత్రాలను పంపించారు. జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన గ్రామపంచాయతీలు 45, ఆవాసాలు 96, ఉన్నట్లుగా మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. వర్షాలకు బాగా నష్టపోయిన బూర్గంపాడు, సారపాక, భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం గ్రామాల తాజా పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఆయా గ్రామాలకు ఇప్పటికే 5 డిపిఓలను, 21మంది ఎంపిఓలను, 219 మంది పంచాయతీ కార్యదర్శులను, 4,100 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాం. అలాగే 9 ఫాగింగ్ మిషన్లు, 60 చేతి ఫాగింగ్ మిషన్లు, 90 స్ప్రేయర్లు, 12 టిప్పర్లు, 170 ట్రాక్టర్లు, ట్రాలీలు, 4 బాబ్ క్యాట్స్, 12 జెసిబిలును ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అవసరమైన చర్యలు వెంట వెంట తీసుకోవాలని, ప్రజలను ముంపు పరిస్థితుల నుంచి సాధ్యమైనంత వేగంగా బయట పడేయాలని, బాధిత ప్రజలకు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యల్లో రాజీ పడొద్దని మంత్రి అధికారులను ఆదేశించారు.