Monday, December 23, 2024

మంత్రి ఎర్రబెల్లి విస్తృత పర్యటన

- Advertisement -
- Advertisement -

జనగామ: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు పాఠశాలల భవనాలు, గ్రామపంచాయతీ భవనాలను ప్రారంభించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం రంగరాయగూడెంలో ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి అంగన్‌వాడీ పాఠశాలను ప్రారంభించారు. కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో చేపట్టిన పాఠశాల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్దబాయితండా గ్రామపంచాయతీ భవనం, పాలకుర్తిలో బాలుర రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ, పాలకుర్తి హైస్కూల్‌లో డిజిటల్ తరగతులను ప్రారంభించారు.

అదేవిధంగా పెద్దవంగర మండలం గుంట్లకుంటలో ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి పనులు, హెల్త్ సబ్‌సెంటర్, ఆర్‌సీతండా గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. పోచారం గ్రామంలో బ్రిడ్జీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో జీపీ భవనం ప్రారంభించి బ్రిడ్జీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. బొమ్మకల్లు, బావోజీతండా గ్రామంలో జీపీ భవనాలను ప్రారంభించారు. పెద్దవంగర మండలం చిట్యాల గ్రామంలో ప్రాథమిక పాఠశాలను, చిన్నవంగర గ్రామంలో నూతన కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించి విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో విద్యాశాఖ దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల రేఫురేఖలు మారాయని, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రూ.7,289 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మొదటి విడతగా 9,123 పాఠశాలల్లో రూ.3,495 కోట్లతో పనులు చేపట్టినట్లు, పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు.

ప్రతి విద్యార్థికి రూ.600 వెచ్చించి 2 జతల యూనిఫారాలు ఉచితంగా ఇస్తున్నట్లు, డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నట్లు, రాష్ట్రంలో 1,232 సంక్షేమ గురుకుల పాఠశాలలు, 1,425 సంక్షేమ పాఠశాలలు, 26,815 ప్రభుత్వ, కేజీబీవీ మోడల్ స్కూళ్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరం వరకు అమలయ్యే ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9, 10 తరగతులకు కూడా పెంచనట్లు, సన్నబియ్యంతో కూడిన నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. వంట మనుషులు, కార్మికులకు రూ.1వెయ్యి గౌరవ వేతనాన్ని రూ.3వేలకు పెంచినట్లు తెలిపారు.

రాబోయే విద్యా సంవత్సరం నుంచి రాగి జావ కూడా అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్న వేలాది మంది విద్యార్థులకు ఉదయం రాగి జావను అల్పాహారంగా ఇవ్వబోతున్నట్లు తెలిపారు. దీనివల్ల విద్యార్థులకు అవసరమైన కాల్షియం, ఇనుము, మినరల్స్, విటమిన్స్ వంటివి సమృద్ధిగా లభిస్తాయని, తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు. విద్యా వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టిలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి విద్యారంగాన్ని పటిష్టపరుస్తున్నట్లు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలకు మహర్దశ కలిగినట్లు తెలిపారు. గ్రామ పరిపాలన వ్యవస్థ, స్థానిక సంస్థల అభివృద్ధి, స్థానిక సంస్థల పురోగతికి నిధులు మంజూరు చేస్తూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూలేనంతగా కృషిచేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఇంతగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్‌కి ప్రజలు అండగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. ప్రజలు గత, ప్రస్తుత పాలన, అభివృద్ధిని అంచనా వేసి విశ్లేషించాలని, మంచిని మంచిగా, చెడును చెడుగా చూడాలని, అభివృద్ధికి పాటుపడిన వారికి అండగా నిలవాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, ఆర్డీవోలు, ఆయా శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News