కరీంనగర్: తెలంగాణలో కరోనా టెస్టు కిట్ల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలో మంత్రి ఈటల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ ను శుక్రవారం ప్రారంభించారు. కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానం వస్తే నిర్లక్ష్యం వద్దని మంత్రి హెచ్చరించారు. ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలన్నారు. కరోనా టెస్టులు, రిపోర్టుల కోసం వేచిచూడవద్దని, వెంటనే వైద్యులను సంప్రదించాలని మంత్రి ఈటల పేర్కొన్నారు. ఫలితాల కోసం ఆగొద్దని.. డాక్టర్లు వైద్యం మొదలు పెట్టాలని మంత్రి ఆదేశించారు. నిర్లక్ష్యం కారణంగానే ప్రాణాలు పోతున్నాయన్నారు. పాజిటివ్ అని తెలిసీ… నిర్లక్ష్యం చేస్తున్నవారే మరణిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత లేదని ఈటల తెలిపారు. 2,3 రోజుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత తీరుతుందన్నారు. రాష్ట్రానికి ఆక్సిజన్ ను విశాఖ నుంచి కేటాయించలేదన్న మంత్రి 1300కి.మీ దూరంలో ఉన్న ఒడిశా నుంచి యుద్ధ విమనాల్లో ఆక్సిజన్ తెప్పిస్తున్నామని పేర్కొన్నారు. జగిత్యాల, మహారాష్ట్రకు రాకపోకల వల్లే అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని మంత్రి తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
Minister Etela inaugurates Oxygen Production Plant