Monday, December 23, 2024

కిషన్‌రెడ్డి విషం

- Advertisement -
- Advertisement -

Minister Gangula fires on central Minister Kishan reddy

రాష్ట్రం ఆత్మగౌరవం దెబ్బతినేలా

మిల్లులలో బియ్యం మాయం అనడం విడ్డూరంగా ఉంది

బియ్యం మాయమైతే భారం
రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుంది
ఢిల్లీ వేదికగా అవగాహన
లేకుండా మాట్లాడారు 3 కోట్ల
57లక్షల గన్నీ బ్యాగులు
సిద్దంగా ఉంచాం రాష్ట్రాన్ని
కేంద్రం కావాలనే బదనాం
చేయాలని చూస్తోంది: మంత్రి
గంగుల కమలాకర్

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి: తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా ఢిల్లీ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విషం చిమ్ముతున్నారని రాష్ట్ర పౌర సరఫరాలు, సిసంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. గురువారం కరీంనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఓట్లతో ఢిల్లీ గద్దెపై కూర్చొని ఇక్కడి ప్రజల్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎఫ్‌సిఐ, సివిల్ సప్లైస్ శాఖపై అవగాహన లేకుండా కేంద్రమంత్రి అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. రైస్ మిల్లుల్లో బియ్యం మాయమయ్యాయని కిషన్‌రెడ్డి అనడం విడ్డ్డూరంగా ఉందని, అ వడ్లకు మీరు డబ్బులు ఇచ్చారా.. అని ప్రశ్నించారు. రైతుల నుంచి ఎంఎస్‌పికి ధాన్యం కొనుగోలు చేసేది రాష్ట్ర ప్రభుత్వం అని, ఇందులో ఎన్ని ఇబ్బందులున్నా రాష్ట్రం సర్దుబాటు చేస్తుందని, కేంద్రం పాత్ర ఏమి లేదన్నారు. వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సిఐకు ఇచ్చాకే 4 నెలల తర్వాత కేంద్రం సొమ్ములు ఇస్తుందని గుర్తుచేశారు. కామారెడ్డి రైస్‌మిల్లుల్లో 84,927 బియ్యం బస్తాలు కన్పించడం లేదని అనడాన్ని ఆయన తప్పుపటారు. దీనిపై ఎఫ్‌సిఐకి లేఖ రాశామన్నారు. మిల్లుల్లో ఉన్నపుడు అవి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యమేనని, ఎఫ్‌సిఐ గోదాముల్లోకి వెళ్లిన తర్వాత అవి కేంద్రానికి చెందుతాయన్నారు.

రాష్ట్రంలో ఉన్న 2,794 రైస్ మిల్లులో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. అసలు సవిల్ సప్లై మీద కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అవగాహన ఉందా అని ప్రశ్నించారు. బియ్యం మాయమైతే ఆ భారం రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందని కేంద్రపై కాదన్నారు. తమ వద్ద 3.57 కోట్ల గన్నీ బ్యాగులు సిద్ధంగా ఉన్నాయి, అవసరం అనుకుంటే చెక్ చేసుకోండన్నారు. ఎనిమిది కోట్ల గన్నీ బ్యాగులు కావాలని అడిగితే 4.45 కోట్ల బ్యాగులిచ్చారన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజల ప్రతినిధే అయితే జూట్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా అవసరమైన గన్నీ బ్యాగులు ఇప్పించాలన్నారు. కరోనా కష్టకాలంలో వెస్ట్ బెంగాల్ నుంచి గన్నీ బ్యాగులు తెచ్చుకున్నపుడు కిషన్ రెడ్డి ఎక్కడున్నారని గంగుల ప్రశ్నించారు. మీకు తప్పుడు నీవేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి పియూష్ గోయల్ కన్నా ఘోరంగా తెలంగాణ ప్రజల్ని కిషన్ రెడ్డి అవమానిస్తున్నారని దెప్పిపొడిచారు. బిజెపి పాలిస్తున్న రాష్ట్రాల్లో ఒక తీరుగ.. ఇక్కడ మరో తీరుగా కేంద్రం వ్యవహరిస్తోందని, ఇందుకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు.

2020..2021 యాసంగిలో 62.52 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 89 శాతం మేర 55.43 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సిఎంఆర్ రూపంలో ఎఫ్‌సిఐకి ఇవ్వడం జరిగిందన్నారు. మిగతా దాంట్లో కూడా కేంద్రం నుంచి క్లారిటీ లేకపోడం వల్ల ఆగాల్సి వస్తుందన్నారు. పెండింగ్ రారైస్ 6.28 ఎల్‌ఎంటిఎస్‌లో 5.25 ఎల్‌ఎంటిస్ ఫోర్టిఫైడ్ బాయిల్డ్ ఇస్తామని చెప్పామని, ఇంతవరకు కేంద్రం నుంచి సమాధానం లేదన్నారు. 2021, 2022 వానాకాలం సీజన్లో 70.22 ఎల్‌ఎంటిస్ ధాన్యం సేకరించామని, కానీ, కేంద్రం 68.66 ఎల్‌ఎంటిస్ ధాన్యానికి సమానమైన 46 ఎల్‌ఎంటిస్ బియ్యం మాత్రమే అనుతించిందని, ఈ మిల్లింగ్ ప్రక్రియకు పివి పేరుతో ఇతరత్రా కొర్రీలతో ఇబ్బందులు పెడుతుందన్నారు. ఈ యాసంగికి సంబంధించి ఇప్పటికే 724 కొనుగోలు కేంద్రాలను ప్రాంభించామని, 104 కొనుగోలు కేంద్రాల ద్వారా 11,543 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి కమలాకర్ తెలిపారు. సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News