హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన మహాత్మా జ్యోతిబా పూలే బిసి గురుకుల విద్యార్థులను మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. 87 శాతం ఉత్తీర్ణతతో ఉత్తమ ఫలితాలు సాధించడమే గాకుండా రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎంపిసిలో 4, 5, 6, బైపిసిలో 6, 7, ఎంఇసిలో 4, 5 ర్యాంకులను, 10 లోపు ర్యాంకులు సాధించిన 300 పై చిలుకు విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. మారుమూల ప్రాంతాల్లోని నిరుపేద కుటుంబాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందన్నారు. ప్రతి విద్యార్థిని కుటుంబంతో కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శాలువా కప్పి మెమొంటో అందజేశారు. వారికి ప్రోత్సాహకంగా నగదు పురస్కారాలను అందజేశారు.
ప్రతి విద్యార్థితో, వారి తల్లిదండ్రులతో మాట్లాడి అభినందిస్తూ వారు చదువుకున్న తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయాలకు అనుగుణంగా అద్భుతంగా రాణిస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి పేరు ప్రతిష్టలను నిలపాలని సూచించారు. ఒక్కో విద్యార్థిపై లక్షన్నర ఖర్చు చేస్తూ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 310 బిసి గురుకులాలను నిర్వహిస్తున్నామన్నారు. స్వయంగా మంత్రి వెన్ను తట్టి ప్రోత్సహించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పులకరించి పోయారు. మంత్రి అభినందన పూర్వక మాటలకు స్పూర్తి పొందారు. ఈ విజయానికి కెసిఆర్ ప్రభుత్వం అందించిన తోడ్పాటే కారణమని చెప్పారు. విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగారు. నూతన సచివాలయం అద్భుతంగా ఉందని పిల్లలంతా సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు.