హైదరాబాద్: రాష్ట్రంలో ఏ పేద కుటుంబానికి కూతురు పెళ్లి బాధకరం కాకూడదని మేనమామలా ముఖ్యమంత్రి కెసిఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రూపొందించారని బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కళ్యాణలక్ష్మి అమలులో నిధుల కొరత ఏ మాత్రం లేదన్నారు. బుధవారం సంక్షేమ భవన్‌లో ఉన్నతాధికారులతో కళ్యాణలక్ష్మి పథకంపై మంత్రి సమీక్షించారు. బిసి, ఈబిసిలకు ప్రథకం పారంభించిన ఎప్రిల్ 2016 నుండి ఇప్పటి వరకు రూ.5,369 కోట్లను 5 లక్షల 89 వేల కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు.
సంపూర్ణ పారదర్శకతతో పథకాన్ని అమలు చేస్తున్నామని, ఈ సంవత్సరం లక్షా 11 వేల దరఖాస్తుల్లో వెరిఫికేషన్ కోసం రెవెన్యూ శాఖలోని ఆర్‌డిఒల వద్ద 10,364, ఎంఆర్‌ఓల వద్ద 21,906 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వారం రోజుల్లో పరిశీలించి క్లియరెన్స్ చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. పేద కుటుంబాల ఆడబిడ్డలకు సంబంధించిన అంశంలో వ్యయప్రయాసాలకోర్చైనా త్వరితగతిన ప్రక్రియను ముగించాలని కోరారు.
పేదింటి కుటుంబాలు లగ్న పత్రిక రాసుకున్న సమయంలోనే వాటిని సమర్పించి దరఖాస్తు చేసుకుంటే పెళ్ళి మంటపంలోనే కళ్యాణలక్ష్మి చెక్కులను అందిస్తామని, ఆ దిశగా యంత్రాంగాన్ని సమాయత్తం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.