ప్రకృతిని పూజించే పండుగ బతుకమ్మ
రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: ఆడబిడ్డల సంతోషమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ మహిళా సంఘ భవనంలో నిర్వహించిన 16, 37, 38 డివిజన్‌లోని ఆడపడుచులకు దసరా పండుగ కానుక బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ…. రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డల సంతోషమే ధ్యేయంగా అద్భుతమైన పథకాలు అమలు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. పూలను దేవతలుగా భావించి పండుగ జరుపుకునే పండుగ ప్రపంచంలోని ఏ దేశం లేదన్నారు.
బతుకమ్మ పండుగ ద్వారా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే పూలతో బొడ్డెమ్మను పేర్చి ప్రకృతని పూజించే గొప్ప సంస్కృతి ఉన్న పండుగ అన్నారు. గతంలో నీటి కోసం గోసపడే వారమని, కరెంటు కోసం ఇబ్బందులు పడేవారమని, నేడు ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రజలకు నిరంతరాయంగా త్రాగునీరు, కరెంట్ సరఫరా చేస్తున్నామన్నారు. ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్‌లను పార్టీలకతీతంగా అందిస్తున్నామన్నారు. అనంతరం 16, 37, 38 డివిజన్లకు చెందిన ఆడపడుచులకు మంత్రి చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, నగర మేయర్ వై.సునిల్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అనిల్‌కుమార్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, గుగ్గిళ్ల జయశ్రీ, కో ఆప్షన్ సభ్యులు సందిల్లా రమ, తహశీల్దార్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.