కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి గంగుల కమాలకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో 9.90 లక్షలతో చేపట్టనున్న కుర్మ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి మంత్రి గంగుల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరీంనగర్ లో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తెలంగాణ రాకముందు కూడా ఇక్కడి ప్రజలు పన్నులు కట్టారు. అయినా అభివృద్ధికి నోచుకోలేదు… ఉద్యమకారుడు పాలకుడై కరీంనగర్ లో అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం వేల కోట్లు విడుదల చేస్తున్నారు. కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి… మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నారు. తెలంగాణ ప్రజలు విధ్వంసాన్ని కోరుకోరు… అభివృద్ధిని కాంక్షిస్తారు. సిఎం కెసిఆర్ పాలనలో తెలంగాణలో మతకలహాలు లేకుండా… లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని ఆయన పేర్కొన్నారు.
బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు… ఇందుకు గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోందన్నారు. అందుకే అక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదు.. బండి సంజయ్ గడ్డపారతో తవ్వడం కాదు… నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ మతకలహాలకు ఆజ్యం పోయడం మానుకుని… తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే… బండి సంజయ్ మతం ప్రాతిపాదికన ఓట్లు అడిగేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పరమతాలను గౌరవించడం నేర్చుకోవాలి… రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం…ఇంకో మతం గురించి మాట్లాడడం ఏ మతం ఒప్పుకోదని ఆయన పేర్కొన్నారు.