కరీంనగర్ : భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మరోసారి పేద, మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందని, ప్రధాని మోడీ మిత్రుడు అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ కటౌట్లు, సిలిండర్లతో, వంటవార్పుతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 75 సంవత్సరాల స్వతంత్ర పాలనలో సిలిండర్‌పై సంవత్సరానికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందని, బీజేపీ అధికారంలోకి రాకముందు 8 సంవత్సరాల క్రితం కేవలం 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 1200 రూపాయలకు చేరుకుందన్నారు. స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరని, గడిచిన 8 సంవత్సరాలలో సిలిండర్‌పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోడీ అని అన్నారు. ధరల పెంపుపైన దృష్టి పెట్టిన కేంద్రప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని, పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదన్నారు.
అదానికి దోచి పెట్టేందుకు పేద, మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపారని, మన రక్తపుముద్దను మోడీ గుజరాత్‌కు దోచిపెడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, వ్యవసాయానికి ఉచిత కరెంట్‌లతో తెలంగాణలో ఆకలికేకలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ప్రధాని మోడీ పెట్రోల్, గ్యాస్, పప్పులు, నిత్యావసర ధరలు పెంచి దేశ ప్రజల రక్తాన్ని పీల్చిపిప్పి చేస్తున్నారని దుయ్యబట్టారు. గ్యాస్ సిలిండర్ ధరను 1200 నుంచి 8 వందలకు తగ్గించాలని, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపబోమని హెచ్చరించారు. గ్యాస్‌పెంపు ధరలను ఎంపీలు బండి సంజయ్, కిషన్‌రెడ్డిల భార్యలతో పాటు ఏ ఆడబిడ్డ కూడా ఒప్పుకోదని, పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
రాష్ట్రంలో ఓ వైపు సంక్షేమ పథకాలతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరుపేద, మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీలుస్తుందన్నారు. పెంచిన ధరలు తగ్గించేవరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈధర్నా కార్యక్రమంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి – హరిశంకర్, జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్,కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, నగర కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.